Team India Head Coach: శ్రీలంక టూర్‌కు కొత్త హెడ్ కోచ్‌.. మా నెక్ట్స్‌ టార్గెట్ ఆ రెండు టైటిల్స్‌: జై షా

జులై నెలాఖరులో టీమ్‌ఇండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌కు కొత్త హెడ్‌ కోచ్‌ జట్టుతో కలుస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు.

Published : 01 Jul 2024 12:20 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్‌తో ముగిసింది. ఇప్పటికే కొత్త హెడ్‌ కోచ్‌ కోసం బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir), భారత మహిళల జట్టుకు గతంలో కోచ్‌గా వ్యవహరించిన డబ్ల్యూవీ రామన్‌ పేర్లను షార్ట్‌లిస్ట్ చేశారు. వీరికి క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది. త్వరలోనే కొత్త కోచ్‌ పేరు ప్రకటించే అవకాశముంది. గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. 

ఈనేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా (Jay Shah) కొత్త హెడ్‌ కోచ్‌ అంశంపై కీలక అప్‌డేట్ ఇచ్చాడు. హెడ్ కోచ్‌ కోసం ఇద్దరి పేర్లను షార్ట్‌లిస్ట్ చేశామని చెప్పాడు. ఈ నెలాఖరులో టీమ్‌ఇండియా శ్రీలంకకు పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య మూడు టీ20లు, మూడు వన్డే సిరీస్‌లు జరగనున్నాయి. జులై 27 నుంచి మొదలయ్యే ఈ టూర్‌కు కొత్త కోచ్‌ జట్టుతో కలుస్తాడని జై షా వెల్లడించాడు. అయితే, జులై 6 నుంచి జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్‌కు వీవీఎస్‌ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని పేర్కొన్నాడు. 

మా తదుపరి లక్ష్యం ఆ రెండు టైటిల్స్‌

టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ గెలుచుకోవడంపై జై షా హర్షం వ్యక్తంచేశాడు. సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉండటం భారత్‌ టైటిల్ సాధించడంలో ఉపయోగపడిందన్నాడు. ‘‘ఇతర జట్లలో కంటే టీమ్‌ఇండియాలో ఎక్కువ అనుభజ్ఞులున్నారు. అందరూ రాణించారు. నాణ్యమైన ఆటగాడికి ఆటకు ఎప్పుడు వీడ్కోలు పలకాలో తెలుసు. (రోహిత్ శర్మ టీ20 రిటైర్మెంట్‌ని ఉద్దేశించి). రోహిత్ స్ట్రైక్‌రేట్ యువ ఆటగాళ్ల కంటే ఎక్కువగా ఉంది. టీమ్‌ఇండియా ఇలానే విజయాలు సాధిస్తూ ముందుకెళ్లాలి. అన్ని టైటిల్స్‌ గెలవాలి. ప్రతిభావంతులైన ఆటగాళ్లు మన వద్ద ఎంతోమంది ఉన్నారు. జింబాబ్వే టూర్‌కు ప్రపంచకప్‌ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే వెళ్తున్నారు. అవసరమైతే మూడు జట్లను రంగంలోకి దించవచ్చు. ఈ జట్టు పురోగతిలో ఉంది. మా తదుపరి లక్ష్యం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే. అక్కడ ఇలాంటి జట్టే ఆడుతుంది. సీనియర్లు ఉంటారు’’ అని జై షా వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు