Rohit Sharma: నేనెప్పుడూ గణాంకాలు చూడను.. భారత్‌ గెలుపే ముఖ్యం: రోహిత్

టీ20ల నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు పలికేశాడు. పొట్టి కప్‌ విజేతగా నిలిచిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ స్పందించాడు.

Published : 30 Jun 2024 11:50 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్ రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) విజేతగా నిలిచింది. ధోనీ తర్వాత ఈ ఘనతను సాధించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్రలో నిలిచిపోయాడు. ఈసారి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌లతో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు వచ్చినా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. పొట్టి కప్‌లో మాత్రం దక్షిణాఫ్రికాపై చివరి వరకూ పోరాడి భారత్ గెలిచింది. మ్యాచ్‌ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ (Rohit Sharma) మాట్లాడాడు. 

‘‘నా కెరీర్‌లోనే అత్యుత్తమ సమయం ఇదే అని చెప్పడానికి ఇబ్బందేం లేదు. ఈసారి ఎలాగైనా గెలవాలనే కాంక్షతోనే మేం బరిలోకి దిగాం. కొన్నేళ్లుగా కెరీర్‌లో నేను చేసిన పరుగులు అన్నీ ఇప్పుడు పక్కకు వెళ్లిపోయినట్లే. కప్‌ నెగ్గడమే ముఖ్యమైన విషయం. నేనెప్పుడూ గణాంకాలను నమ్మను. భారత్‌ కోసం మ్యాచ్‌లను గెలవడమే కావాలి. ట్రోఫీలు సొంతం చేసుకోవడమే ముఖ్యం. ఈసారి మేం విజయం సాధించేందుకు తీవ్రంగా కష్టపడ్డాం. మాటల్లో వర్ణించలేని పరిస్థితి. అసలు నేను ఏం ఆలోచించానో కూడా తెలియదు. వ్యక్తిగతంగా ఎంతో భావోద్వేగ సందర్భం. నా జీవితంలో దీనిని మరిచిపోలేను. 

ఈ ట్రోఫీకి అర్హుడైన వ్యక్తి ఒకరు ఉన్నారు. అతడే ద్రవిడ్. దాదాపు పాతికేళ్లపాటు క్రికెటర్‌గా అతడు చేసిన సేవలు అమోఘం. కోచ్‌గానూ అద్భుతంగా బాధ్యతలు నిర్వర్తించాడు. అతడి కెరీర్‌లో వరల్డ్‌ కప్‌ అనేది మాత్రమే మిస్‌ అయి ఉంటాడు. ఇప్పుడు మేం అందిస్తున్నాం. ద్రవిడ్ ఎంత గర్వపడ్డాడో మీరందరూ చూశారు. ఇక జట్టులోని ప్రతి ఒక్కరూ భారత్ విజేతగా నిలవడంలో కష్టపడ్డారు. ద్రవిడ్ వచ్చిన తర్వాత నుంచి కుర్రాళ్లకు తమ పాత్రపై స్పష్టమైన అవగాహన వచ్చింది. టీమ్‌కు ఎంపిక కాని యువ క్రికెటర్లతోనూ అతడు టచ్‌లో ఉండటం గొప్ప విషయం. వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు నిరంతరం కృషి చేశాడు. గతంలోనే బుమ్రా గురించి చెప్పా. అతడి ప్రదర్శనపై మాట్లాడేందుకు మాటలు ఉండవు. జట్టుకు అవసరమైనప్పుడు తన బౌలింగ్‌తో మాయ చేస్తాడు’’ అని రోహిత్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని