T20 World Cup: ఇది ద్రవిడ్‌ చక్‌దే ఇండియా..

తేలికైన గ్రూపులోనే ఉన్నా.. కనీసం గ్రూప్‌ దశైనా దాటకుండానే  ఓ జట్టు వన్డే ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. సారథి గుండె పగిలింది. ఆ తర్వాత ఎంతకాలమో కెప్టెన్‌గా ఉండలేకపోయాడు.

Updated : 30 Jun 2024 06:52 IST

మార్చి 23, 2007.. పోర్టాఫ్‌ స్పెయిన్‌

తేలికైన గ్రూపులోనే ఉన్నా.. కనీసం గ్రూప్‌ దశైనా దాటకుండానే  ఓ జట్టు వన్డే ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. సారథి గుండె పగిలింది. ఆ తర్వాత ఎంతకాలమో కెప్టెన్‌గా ఉండలేకపోయాడు.

జూన్‌ 29, 2024.. బ్రిడ్జ్‌టౌన్‌

ఓ దుర్భేద్యమైన జట్టు అపజయమనేదే లేకుండా, అప్రతిహత విజయాలతో ప్రపంచకప్‌ (టీ20)ను ముద్దాడేసింది. భావోద్వేగాలను అంత బాహాటంగా వ్యక్తం చేసే అలవాటులేని ఆ వ్యక్తి చిద్విలాసం చేశాడు సగర్వంగా..! ఆ వ్యక్తే అప్పటి కెప్టెన్‌.. రాహుల్‌ ద్రవిడ్‌. సారథిగా సాధించలేని దాన్ని కోచ్‌గా సాధించి ఓ జీవితకాల వెలితిని పూడ్చుకున్నాడు అదే కరీబియన్‌ గడ్డపై. తీరదు అనుకున్న వేదనకు సమాధి కట్టాడు 17 ఏళ్ల తర్వాత. ఒకరకంగా ద్రవిడ్‌కిది చక్‌ దే ఇండియా మూమెంట్‌..! నిరుడు వన్డే ప్రపంచకప్‌లోనే అతడికీ మూమెంట్‌ రావాల్సింది. కానీ ఆటగాళ్లు, అభిమానుల మనసులు గెలిచిన ఈ ఫ్రెండ్లీ కోచ్‌.. ఎనిమిది నెలలు ఆలస్యంగానైనా తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు.

జెంటిల్మన్‌ క్రికెటర్‌గా ద్రవిడ్‌కు ఉన్న పేరు గురించి తెలిసిందే. దశాబ్దన్నరపాటు ఆటగాడిగా టీమ్‌ఇండియాకు సేవలందించిన అతడు.. రిటైరయ్యాక ఎంతో కాలం ఆటకు దూరంగా లేడు. జూనియర్‌ కోచ్‌గా తనదైన ముద్ర వేశాడు. భారత్‌ అండర్‌-19, భారత్‌-ఎ ఆటగాళ్ల నైపుణ్యాలను సానపట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి మార్గనిర్దేశకంలో భారత కుర్రాళ్లు అండర్‌-19 ప్రపంచకప్‌ను గెలిచారు కూడా. ద్రవిడ్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) అధిపతిగానూ పనిచేశాడు. అయితే జూనియర్‌ జట్లకు కోచ్‌గా ఇంత పేరు తెచ్చుకున్నా అతడు ఏనాడు టీమ్‌ఇండియా కోచ్‌ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. కానీ ద్రవిడ్‌ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్‌గా ఉండేలా ద్రవిడ్‌ను ఒప్పించగలిగాడు. కానీ కోచింగ్‌ ద్రవిడ్‌కు పూల పాన్పేమీ కాలేదు. అయినా సవాళ్లను అధిగమించి, వన్డే ప్రపంచకప్‌ కలిగించిన నిరాశను జయించి టీమ్‌ఇండియాకు కప్పు అందించేదాకా అతడు విశ్రమించలేదు.

అతడేం చేశాడు...: 2021 నవంబరులో బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్‌.. ఆరంభంలోనే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. కోహ్లి కెప్టెన్సీపై రగడ జట్టులో ఎంత అలజడి రేపిందో తెలిసిందే. అ అశాంతిని చల్లార్చి, జట్టు ఆటపై పూర్తిగా ఏకాగ్రత నిలిపేలా చేయడమే ద్రవిడ్‌ సాధించిన మొదటి విజయం. కానీ కోచ్‌గా మొదట్లో ద్రవిడ్‌కు అంతగా మంచి మార్కులేమీ పడలేదు. మేజర్‌ టోర్నీల్లో జట్టు ప్రదర్శనే అందుకు కారణం. 2022 ఆసియాకప్, టీ20 ప్రపంచకప్పుల్లో టీమ్‌ఇండియా ఆకట్టుకోలేకపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ జట్టు ఓడిపోడవడంతో ద్రవిడ్‌పై విమర్శలు తప్పలేదు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా, మౌనంగా 2023 వన్డే ప్రపంచకప్‌కు జట్టును ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం చేశాడు మిస్టర్‌ డిపెండబుల్‌. తగిన కూర్పు కోసం ఏడాది ముందు నుంచే ప్రక్రియను మొదలెట్టాడు. అతడు చేసిన మొదటి పని.. ప్రపంచకప్‌లో ఆడగలరు, వారి అవసరం ఉంది అనుకున్న ఆటగాళ్లను గుర్తించి వారిపైనే దృష్టిసారించడం. ఆ ఆటగాళ్లకు తగినన్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం కల్పించడం. సెలక్టర్లు, కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి గొప్ప సమన్వయంతో వ్యవహరించిన ద్రవిడ్‌.. (దాదాపు) 24 మంది ఆటగాళ్లతో ఓ పూల్‌ను సిద్ధం చేశాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే.. ప్రపంచకప్‌కు కొన్ని నెలల ముందు భారత జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లంతా ఈ పూల్‌లోని వాళ్లే. ఇది దాటి మరొకరు కనిపించరు. ఇందులో నుంచే ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేశారు. ద్రవిడ్‌ ముందు చూపు, పక్కా ప్రణాళికకు ఇది ఓ సూచిక. వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాల్లో ద్రవిడ్‌ ముద్ర స్పష్టం. జట్టును టీ20 ప్రపంచకప్‌కు గొప్పగా సమాయత్తం చేశాడు ద్రవిడ్‌. వన్డే ప్రపంచకప్‌తోనే తన పదవీకాలం ముగిసినా, ప్రస్తుత టోర్నీ వరకు కొనసాగడానికి అంగీకరించిన అతడు.. జట్టు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా చేశాడు. అన్నింటికన్నా మిన్నగా తన స్నేహశీలతతో ఆటగాళ్లందరి విశ్వాసాన్ని, అభిమానాన్ని, గౌరవాన్ని పొందడం ద్రవిడ్‌ సాధించిన అతి పెద్ద విజయం. 

ఈనాడు క్రీడావిభాగం

ఉప్పొంగిన ఉద్వేగం 

రాహుల్‌ ద్రవిడ్‌ భావోద్వేగాలను పెద్దగా బయటకు కనిపించనీయడు. కానీ ఆటగాడిగా దక్కని ప్రపంచకప్‌ ఇప్పుడు కోచ్‌గా సొంతమవడంతో ద్రవిడ్‌ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. ఫైనల్లో విజయం తర్వాత మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో పాటు సంబరాల్లో తేలిపోయాడు. ఇక కప్‌ చేతుల్లోకి వచ్చిన వెంటనే గట్టిగా అరుస్తూ ఉద్వేగాన్ని బయటపెట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని