T20 World Cup: అద్భుతవీరులు

ఏళ్లుగా వారి ఆట చూస్తున్నాం.. కొన్నిసార్లు వారి ప్రదర్శనకు ఆశ్చర్యపోయాం.. కొన్ని విజయాలకు అబ్బురపడ్డాం! కానీ ఈ టీ20 ప్రపంచకప్‌లో అఫ్ఘనుల ఆటను వర్ణించడానికి మాటల్లేవు..!

Updated : 26 Jun 2024 06:56 IST

ఏళ్లుగా వారి ఆట చూస్తున్నాం.. కొన్నిసార్లు వారి ప్రదర్శనకు ఆశ్చర్యపోయాం.. కొన్ని విజయాలకు అబ్బురపడ్డాం! కానీ ఈ టీ20 ప్రపంచకప్‌లో అఫ్ఘనుల ఆటను వర్ణించడానికి మాటల్లేవు..! ఎలా నేర్చారో ఇంత ఆట.. ఎక్కడి నుంచి వచ్చిందో  ఇంత కసి.. వారిలో ఎవరు నింపారో ఇంతటి పోరాట తత్వం.. అని క్రికెట్‌ ప్రపంచమంతా విస్తుపోతోంది! వసతులు, వనరులు లేకున్నా.. ప్రతిభ, పట్టుదల, పోరాటమే ఆయుధాలుగా ప్రపంచ క్రికెట్లో అఫ్ఘనులు ఎదిగిన తీరు.. సాధిస్తున్న విజయాలు.. క్రికెట్‌ చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయమే.

ఈనాడు క్రీడావిభాగం

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌. కొన్ని బంతులే మిగిలున్నాయి. వీలైనంత స్కోరు చేయాలన్న తపన  ఆ జట్టు కెప్టెన్‌ది. బంతిని ఆడాడు. ఒక పరుగు పూర్తి చేశాడు. రెండో పరుగు కోసం మెరుపు వేగంతో పరుగెత్తాడు. కానీ అవతలి బ్యాటర్‌ నుంచి కదిలిక లేదు. ఒళ్లు మండిపోయింది. క్రీజు మధ్యలో బ్యాట్‌ను విసిరి కొట్టాడు. ఆ దృశ్యం చూస్తే అర్థమవుతుంది క్రికెట్‌ను అఫ్గాన్‌ ఆటగాళ్లు ఎంత తీవ్రతతో ఆడతారో.. వాళ్ల కసి ఎలాంటిదో చెప్పడానికి. నిజానికి ఈ మ్యాచ్‌లో 13 బంతులే మిగిలుండగా.. అఫ్గాన్‌ చేసింది కేవలం 93 పరుగులే. ప్రధాన బ్యాటర్లు షాట్లు ఆడలేక తేలిపోతున్న వేళ.. స్పిన్నరైన రషీద్‌ మూడు కళ్లు చెదిరే సిక్సర్లు బాది జట్టుకు పోరాడే స్కోరును సాధించిపెట్టాడు. రషీద్‌ అంత బాదినా బంగ్లా ముందు నిలిచిన లక్ష్యం 115 పరుగులే. అయినా అఫ్గాన్‌ పట్టు వదల్లేదు. రెండు ఓవర్ల వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టింది. కానీ బంగ్లా తగ్గలేదు. పుంజుకుంది. 10 ఓవర్లలో 77/5తో ప్రత్యర్థి నిష్క్రమణకు రంగం సిద్ధం చేసింది. అప్పుడైనా అఫ్గాన్‌ ఆశలు కోల్పోయిందా? లేదు. కెప్టెన్‌ రెండు బంతుల్లో రెండు వికెట్లతో జట్టులో మళ్లీ ఊపిరులూదాడు. ఎన్నో ఏళ్లుగా హై టెన్షన్‌ మ్యాచ్‌లు ఆడుతున్న వాళ్లు కూడా ఉత్కంఠభరితంగా సాగే ఇలాంటి స్వల్ప స్కోర్ల మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురవుతుంటారు. పేరుమోసిన బౌలర్లు కూడా తడబడి ఎక్స్‌టాలు వేస్తుంటారు. బంతులు గతి తప్పుతుంటాయి. ఫీల్డర్లు తప్పిదాలు చేస్తుంటారు. కానీ పార్ట్‌టైమర్‌ అయిన గుల్బాదిన్‌ సైతం ఆఖర్లో ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన తీరు అసామాన్యం. ఇక బంగ్లా కథ ముగించిన ఓవర్లో నవీనుల్‌ ప్రతి బంతీ ఒక బుల్లెట్టే. ప్రతి బంతికీ ఎంతో ఆలోచించి.. వ్యూహాత్మకంగా, కసిగా అతను సంధించిన వైనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫీల్డర్లయితే బౌండరీ వదిలితే ప్రాణం పోతుందన్నట్లుగా బంతుల్ని ఆపారు. అఫ్గాన్‌ ఆటగాళ్లు మైదానంలో చూపించిన ఆ తీవ్రతకు, వారి పోరాట తత్వానికి ప్రతి క్రికెట్‌ అభిమానీ ముగ్ధుడై ఉంటాడనడంలో సందేహం లేదు. అందుకే విజయం కూడా వారికి సలాం కొట్టి ఒళ్లో వాలింది.

నైబ్‌ డ్రామా.. బ్రావో గిమ్మిక్కు

అఫ్గాన్‌తో మ్యాచ్‌లో బంగ్లా 11.4 ఓవర్లలో 81/7తో ఉన్న దశలో వర్షం పడి మ్యాచ్‌ ఆగింది. అయితే వర్షం పడబోతుండగా స్టాండ్స్‌ నుంచి అఫ్గాన్‌ కోచ్‌ ట్రాట్‌.. మ్యాచ్‌ నెమ్మదించేలా చేయాలని తమ ఆటగాళ్లకు సైగలు చేశాడు. అది చూడగానే స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న నైబ్‌ కాళ్లు పట్టేసినట్లు కూలబడిపోయాడు. ఆ సమయానికి బంగ్లా డ/లూ పద్ధతిలో 2 పరుగులు వెనుకబడి ఉంది. అంతటితో మ్యాచ్‌ ఆగిపోతే అఫ్గాన్‌ గెలిచేది. అందుకే ట్రాట్‌ అలా సంజ్ఞలు చేయగా.. నైబ్‌ నాటకీయ రీతిలో కుప్పకూలిపోయాడు. ఈ వీడియో మ్యాచ్‌ అనంతరం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మరోవైపు బంగ్లా ఇన్నింగ్స్‌ను ముగించిన బంతిని నవీనుల్‌ సంధించడానికి ముందు అఫ్గాన్‌ బౌలింగ్‌ కోచ్‌ బ్రావో చేసిన గిమ్మిక్కు చర్చనీయాంశమైంది. టీవీ కెమెరాల్లో కనిపించేలా షార్ట్‌ పిచ్‌ బంతి వేయాలని సంజ్ఞ చేశాడు. ఇది గమనించిన ముస్తాఫిజుర్‌ బ్యాక్‌ ఫుట్‌పై ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ అందుకు భిన్నంగా ప్రణాళికలో భాగంగా నవీనుల్‌ ఫుల్‌ డెలివరీతో అతణ్ని బోల్తా కొట్టించి వికెట్ల ముందు బలిగొన్నాడు.

ఇంకెవరైనా అంటారా?

కొన్నేళ్ల ముందు వరకు అఫ్గానిస్థాన్‌ను పసికూన అనేవాళ్లు. కానీ అసోసియేట్‌ దేశగా మొదలై ప్రపంచ క్రికెట్లో చాలా వేగంగా ఎదిగిన అఫ్గాన్‌.. వేరే పసికూనల్ని దాటి టెస్టు హోదా కూడా సంపాదించింది. ‘కూన’ అనే ముద్రను ఎప్పుడో పోగొట్టుకున్న అఫ్గాన్‌ను.. ఇప్పుడు ఏ పెద్ద జట్టు కూడా తక్కువ అంచనా వేయడం కానీ, ‘చిన్న’ జట్టు అనే సాహసం కానీ ఎవ్వరూ చేయలేరిప్పుడు. ఇంగ్లాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, శ్రీలంక బంగ్లాదేశ్‌ లాంటి జట్ల మీద అఫ్గాన్‌ విజయాలు సాధించింది. టీ20ల్లో కేవలం మ్యాచ్‌లే కాదు.. పాకిస్థాన్, వెస్టిండీస్‌ లాంటి పెద్ద జట్ల మీద సిరీస్‌ విజయాలే సాధించింది. ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను ఏకంగా 84 పరుగుల తేడాతో చిత్తు చేసి ఆ జట్టు గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. సూపర్‌-8లో ఏకంగా ఆస్ట్రేలియానే 21 పరుగుల తేడాతో మట్టికరిపించి ఆ జట్టు ఇంటిముఖం పట్టేలా చేసింది. ఇంత గొప్ప ప్రదర్శన చేస్తున్న అఫ్గాన్‌ను ఇకపై ఎవరైనా కూన అనో, చిన్న జట్టనో అనగలరా?

గెలుపు వాళ్లది.. ఆనందం మనది

అఫ్గానిస్థాన్‌ గెలుపుతో ఆ దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా  హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆర్థికంగా దుర్భర పరిస్థితులున్న దేశంలో.. వసతులు లేకపోయినా.. సహజ ప్రతిభతో, కసితో ఓ చిన్న దేశం ప్రపంచ క్రికెట్లో ఈ స్థాయికి చేరడం, ఇంత గొప్ప విజయాలు సాధించడం చూస్తే ఎవరికి మాత్రం ముచ్చటేయదు, స్ఫూర్తి కలగదు? అఫ్గాన్‌ తర్వాత ఈ విజయాన్ని ఎక్కువ ఆస్వాదిస్తున్నది భారతే అనడంలో సందేహం లేదు. క్రికెట్లో అఫ్గాన్‌ ఎదుగుదలలో భారత్‌ పాత్ర ఎంతో కీలకం. ఆ జట్టు దేశంలో స్టేడియాలు, ప్రాక్టీస్‌ సౌకర్యాలు అందించడమే కాదు.. కొన్ని సిరీస్‌లకు ఇక్కడి నుంచే ఆతిథ్యమిచ్చే అవకాశం కల్పించింది. పాకిస్థాన్‌తో ఉన్న శత్రుత్వం వల్ల కూడా అఫ్గాన్‌ అంటే ‘మన’ జట్టు అనే భావన కలుగుతుంది. మరోవైపు 2003, 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌తో పాటు 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ తుది పోరులో భారత్‌ను ఓడించి అభిమానులకు గుండెకోతను మిగిల్చిన ఆస్ట్రేలియాను ఈసారి పొట్టి కప్పులో సెమీస్‌ చేరకుండా నిలువరించడంలో సగం పాత్ర రోహిత్‌ సేన పోషిస్తే.. మిగతా సగం పని అఫ్గానిస్థాన్‌ పూర్తి చేసింది. నిజానికి అఫ్గానిస్థాన్‌ వల్ల కంగారూ జట్టు వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించాల్సింది. 292 పరుగుల ఛేదనలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచి ఆ జట్టు మ్యాక్స్‌వెల్‌ అద్భుత పోరాటంతో గట్టెక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని