Rahul Dravid: ఆ రోజు రోహిత్‌ శర్మ ఫోన్‌ చేయకపోయి ఉంటే..: ద్రవిడ్‌

Rahul Dravid: ఆ రోజు రోహిత్‌ శర్మ నుంచి తనకు ఫోన్‌కాల్‌ రాకపోయి ఉంటే.. ఇంతటి ఘన చరిత్రలో తాను భాగం కాకపోయేవాడినని అన్నాడు రాహుల్‌ ద్రవిడ్‌. హెడ్‌ కోచ్‌గా తన చివరి ప్రసంగంలో ఆసక్తికర సంగతులు పంచుకున్నాడు.

Updated : 02 Jul 2024 13:39 IST

బ్రిడ్జ్‌టౌన్‌ (బార్బడోస్‌): సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమ్‌ఇండియాకు టీ20 ప్రపంచకప్‌ను అందించి హెడ్ కోచ్‌ పదవిని ఘనంగా ముగించాడు రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid). ఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచి రోహిత్‌ సేన ట్రోఫీని ముద్దాడిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో వీడ్కోలు ప్రసంగం చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ (BCCI) మంగళవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. గతేడాది కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తనకు ఫోన్‌ చేయకపోయి ఉంటే.. ఈ రోజు తాను ఈ ఘన చరిత్ర (T20 World cup 2024)లో భాగం కాకపోయేవాడినని ద్రవిడ్‌ అన్నాడు.

గతేడాది నవంబరులో భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ను టీమ్‌ఇండియా (Team India) చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఆ ఓటమి తర్వాత ద్రవిడ్‌ హెడ్‌ కోచ్‌ పదవి నుంచి వైదొలగాలనుకున్నారట. అప్పుడు రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఫోన్‌ చేసి.. కనీసం టీ20 ప్రపంచకప్‌ వరకైనా కొనసాగాలని ఒప్పించాడు. ఈ విషయాన్ని ద్రవిడ్‌ గుర్తుచేసుకుంటూ కెప్టెన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘రో.. గతేడాది నవంబరులో నువ్వు నాకు ఫోన్‌ చేసి కోచ్‌గా కొనసాగమని అడిగావు. అందుకు థ్యాంక్యూ సో మచ్‌’’ అని అన్నాడు.

టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌.. అందుకే పిచ్‌పై ఉన్న మట్టిని తిన్నా: రోహిత్ శర్మ

ఇక.. జట్టు సభ్యులతో తన అనుబంధాన్ని ద్రవిడ్‌ గుర్తుచేసుకున్నాడు. ‘‘నాకు మాటలు రావట్లేదు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. జట్టులోని ప్రతి ఒక్కరితో కలిసి పని చేయడం నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. మనమంతా కొన్నిసార్లు మాట్లాడుకున్నాం. మరికొన్నిసార్లు చర్చించుకున్నాం. పరస్పరం వాదించుకున్నాం. ఈ టోర్నీ ఆసాంతం ఆటగాళ్లంతా కలిసికట్టుగా ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు. మీరు కోరుకున్నవిధంగా ఈ విజయాన్ని ఆస్వాదించండి. ఈ క్షణాలు మీకు చిరకాలం గుర్తుండిపోతాయి. పరుగులు, వికెట్లను పక్కనబెట్టండి. మీ కెరీర్‌ను మీరు మర్చిపోవచ్చు.. కానీ ఇలాంటి మధురమైన క్షణాలు మదిలో నిలిచిపోతాయి’’ అని ద్రవిడ్‌ (Rahul Dravid) తెలిపాడు. ప్రతి గొప్ప టీమ్‌ వెనక.. ఓ విజయవంతమైన సంస్థ ఉంటుందని, బీసీసీఐ అధికారులు టీమ్‌ఇండియాకు ప్రతిక్షణం వెన్నంటి నిలిచారని కొనియాడాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు