T20 World cup: ప్రపంచం అందేసింది.. భారత్‌ చిందేసింది..

పతాక ఘట్టం మొదలవుతుంది. హీరోను విలన్‌ గ్యాంగ్‌ చుట్టుముడుతుంది. చావుదెబ్బలు తింటాడు. నాలుగు పోట్లు గట్టిగా దిగుతాయి. హీరో కుప్పకూలిపోతాడు. ఉలుకూపలుకుండదు. హీరో కథ ముగిసిందని ప్రతినాయకుడు వికటాట్టహాసం చేస్తాడు. కథానాయకుడి మద్దతుదారుల్లో విషాద ఛాయలు అలుముకుంటాయి!

Updated : 30 Jun 2024 06:54 IST

బార్బడోస్‌లో టీమ్‌ఇండియా అద్భుతం 
టీ20 ప్రపంచకప్‌ రోహిత్‌ సేనదే 
ఉత్కంఠభరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం 
బుమ్రా సంచలన బౌలింగ్‌
అర్ష్‌దీప్, హార్దిక్‌ అదుర్స్‌ 
కోహ్లి కీలక ఇన్నింగ్స్‌

పతాక ఘట్టం మొదలవుతుంది. హీరోను విలన్‌ గ్యాంగ్‌ చుట్టుముడుతుంది. చావుదెబ్బలు తింటాడు. నాలుగు పోట్లు గట్టిగా దిగుతాయి. హీరో కుప్పకూలిపోతాడు. ఉలుకూపలుకుండదు. హీరో కథ ముగిసిందని ప్రతినాయకుడు వికటాట్టహాసం చేస్తాడు. కథానాయకుడి మద్దతుదారుల్లో విషాద ఛాయలు అలుముకుంటాయి!

కానీ చచ్చినట్లు పడి ఉన్న హీరో.. ఉన్నట్లుండి పైకి లేస్తాడు. విలన్‌ సహా అందరినీ మట్టుబెట్టి విజయనాదం చేస్తాడు!!

అది సినిమా. అక్కడ ఇలాంటి ఫాంటసీలు సర్వ సాధారణం!

కానీ నిజ జీవితంలో అలాంటివి జరగవు. జరిగితే అదొక అద్భుతం!

ఆ అద్భుతమే జరిగింది శనివారం!

ఒక్క ఓవర్లో 30 పరుగులు కొట్టాల్సి ఉన్నా.. బౌలింగ్‌ జట్టు విజయానికి గ్యారెంటీ లేని రోజులివి. అలాంటిది 5 ఓవర్లలో 30 పరుగులే చేయాలి. క్రీజులో    ఉన్నదేమైనా సామాన్యమైన బ్యాటర్లా? విధ్వంసానికి మారుపేరైన క్లాసెన్, మిల్లర్‌!

వాళ్లు అత్యంత క్రూరమైన విలన్లలాగే కనిపిస్తున్నారు భారత అభిమానులకు. వారి ధాటికి మన హీరోలు డంగైపోయి ఉన్నారు. స్టేడియంలో ఉన్న వేలమంది..   టీవీ సెట్లు, మొబైళ్ల ముందున్న కోట్లాదిమందిలో తీవ్ర నిరాశ, అంతులేని నిర్వేదం!

ఈ స్థితిలో మ్యాచ్‌ గెలవాలంటే.. కేవలం హీరో కాదు, సూపర్‌ హీరో కావాలి! అలాంటి సూపర్‌ హీరోనే అయ్యాడు జస్‌ప్రీత్‌ బుమ్రా!

అతనో చిన్న ఆశ కల్పించాడో లేదో.. ఆ స్ఫూర్తితో హార్దిక్, అర్ష్‌దీప్, సూర్య.. ఒక్కొక్కరుగా సూపర్‌ హీరోలైపోయారు. అరగంటలో ఎన్నెన్నో అద్భుతాలు!

బ్రిడ్జ్‌టౌన్‌లో నమ్మశక్యం కాని ఫలితం.. భారత అభిమానులకు చిరస్మరణీయ విజయం!

రోహిత్‌సేన చేతుల్లో టీ20 ప్రపంచకప్‌!

బ్రిడ్జ్‌టౌన్‌

సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కల నిజమైంది. భారత్‌ మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది. ఎప్పుడో 2007లో టీ20 ప్రపంచకప్‌ మొదలైనపుడు ఆ టైటిల్‌ను సొంతం చేసుకున్న భారత్‌.. మధ్యలో ఏడు కప్పుల విరామం తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఇప్పుడు ఆ టోర్నీలో విజేతగా నిలిచింది. శనివారం నాటకీయ మలుపులు తిరుగుతూ.. తీవ్ర ఉత్కంఠ రేపుతూ సాగిన 2024 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో రోహిత్‌ సేన 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మొదట టీమ్‌ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఫైనల్‌ కోసమే దాచుకున్నాడా అన్నట్లు విరాట్‌ కోహ్లి (76; 59 బంతుల్లో 6×4, 2×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా.. అక్షర్‌ పటేల్‌ (47; 31 బంతుల్లో 1×4, 4×6), శివమ్‌ దూబె (27; 16 బంతుల్లో 3×4, 1×6) కూడా విలువైన పరుగులు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌ (2/23), నోకియా (2/26) ఆకట్టుకున్నారు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. బుమ్రా (2/18), హార్దిక్‌ పాండ్య (3/20), అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/20) అద్భుత బౌలింగ్‌తో జట్టును గెలిపించారు. హెన్రిచ్‌ క్లాసెన్‌ (52; 27బంతుల్లో 2×4, 5×6) భారత్‌ను భయపెట్టగా.. డికాక్‌ (39; 31 బంతుల్లో 4×1, 1×6) కూడా రాణించారు.

వాళ్ల చేతుల్లోకి వెళ్లి..: దక్షిణాఫ్రికా ఛేదన ఆరంభమైన తీరు చూస్తే.. మ్యాచ్‌ను సునాయాసంగా భారత్‌ గెలిచేస్తుందనే అనిపించి ఉంటుంది. అర్ష్‌దీప్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసి తొలి ఓవర్లో 6 పరుగులే ఇవ్వగా.. బుమ్రా కళ్లు చెదిరే బంతితో రీజా హెండ్రిక్స్‌ (4)ను బౌల్డ్‌ చేసి జట్టుకు అదిరే ఆరంభాన్నిచ్చాడు. అర్ష్‌దీప్‌ తన తర్వాతి ఓవర్లో మార్‌క్రమ్‌ (4)ను వికెట్‌ కీపర్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చడంతో 3 ఓవర్లకు 14/2తో సఫారీ జట్టు కష్టాల్లో పడింది. ఇలాంటి ఆరంభం తర్వాత ఆ జట్టు ఏం కోలుకుంటుందిలే అనుకుంటే.. డికాక్‌కు జత కలిసిన ట్రిస్టియన్‌ స్టబ్స్‌ కాసేపటికే కథ మొత్తం మార్చేశాడు. ఇద్దరూ ఎదురుదాడికి దిగడంతో 8.1 ఓవర్లకు 68/2తో సఫారీ జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను చుట్టేసిన స్పిన్నర్లు కుల్‌దీప్, అక్షర్‌ ధారాళంగా పరుగులిచ్చేశారు. మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోంచి నెమ్మదిగా జారిపోతున్న దశలో అక్షర్‌ బౌలింగ్‌లో స్టంప్స్‌ వదిలి సాహసోపేత షాట్‌కు ప్రయత్నించిన స్టబ్స్‌ బౌల్డయి వెనుదిరిగాడు. అయినా దక్షిణాఫ్రికాకు ఇబ్బంది లేకపోయింది. డికాక్‌కు జత కలిసిన క్లాసెన్‌ తనకెంతో ఇష్టమైన స్పిన్‌ బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. కుల్‌దీప్, అక్షర్, జడేజా.. ఈ ముగ్గురికీ అతను చుక్కలు చూపించేశాడు. మధ్యలో డికాక్‌ ఔటైనా.. క్లాసెన్‌ మాత్రం పట్టు వదల్లేదు. 36 బంతుల్లో 54 పరుగులు చేయాల్సిన స్థితిలో అక్షర్‌ పటేల్‌ వేసిన 15వ ఓవర్‌ దక్షిణాఫ్రికా విజయ సమీకరణాన్ని అత్యంత తేలికగా మార్చేసింది. మళ్లీ ఈ అవకాశం రాదన్నట్లుగా అక్షర్‌ బంతుల్ని నంజుకున్న క్లాసెన్‌ 2 సిక్సర్లు, 2 ఫోర్లు బాదగా.. ఆ ఓవర్లో మొత్తం 25 పరుగులు వచ్చాయి. 30 బంతుల్లో 30 పరుగులే చేయాల్సి రావడంతో ఇక మ్యాచ్‌ చేజారినట్లే అనిపించింది. కానీ ఆఖరి 5 ఓవర్లలో అనూహ్య మలుపులు తిరిగిన మ్యాచ్‌ భారత్‌ చేతికి చిక్కింది. ఈ 5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 22 పరుగులే చేసింది. 

కోహ్లి నిలవగా.. అక్షర్, దూబె దంచగా..: సూపర్‌-8లో, సెమీస్‌లో అదరగొట్టిన రోహిత్‌ రెండో ఓవర్లోనే ఔటైపోయాడు. అదే ఓవర్లోనే పంత్‌ కూడా వెనుదిరిగాడు. సూర్యకుమార్‌ 3 పరుగులే చేసి వికెట్‌ ఇచ్చేశాడు. 34 పరుగులకే 3 వికెట్లు. ఫామ్‌లో ఉన్న ముగ్గురు బ్యాటర్లు పవర్‌ ప్లేలోనే ఔటైపోయినా భారత్‌ ప్రపంచకప్‌ ఫైనల్స్‌లోనే అత్యధిక స్కోరు చేయగలిగిందంటే.. అందుకు కోహ్లి ఒక ఎండ్‌లో పాతుకు పోయి ఇన్నింగ్స్‌కు తెచ్చిన స్థిరత్వం.. మరో ఎండ్‌లో అక్షర్‌ పటేల్, శివమ్‌ దూబెల మెరుపులే కారణం. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్‌ నెమ్మదించి, స్పిన్నర్లకు సహకరిస్తుందన్న అంచనాతో మొదట టాస్‌ గెలిచిన రోహిత్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ ఆరంభమైన తీరు చూస్తే 200 స్కోరు నమోదు కాబోతోందా అనిపించింది. ఫామ్‌తో తంటాలు పడుతున్న కోహ్లి తొలి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి మంచి ఊపుమీద కనిపించాడు. 1.2 ఓవర్లకే స్కోరు 23 పరుగులకు చేరుకుంది. ఇక ఇన్నింగ్స్‌ అంతా మెరుపులే మెరుపులు అనుకుంటే.. భారత్‌ అనూహ్యంగా 11 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికాను ఆత్మరక్షణలోకి నెట్టాలన్న ఉద్దేశంతో మరో షాట్‌కు ప్రయత్నించిన రోహిత్‌ (9).. స్క్వేర్‌ లెగ్‌లో క్లాసెన్‌కు దొరికిపోయాడు. ఈ దశలో ఆచితూచి ఆడాల్సిన పంత్‌ ఎదుర్కొన్న రెండో బంతికే స్వీప్‌ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. కాసేపటికే సూర్యకుమార్‌ (3) సైతం రబాడ బౌలింగ్‌లో ఔటైపోవడంతో భారత్‌ ఆత్మరక్షణలో పడింది. ఆ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్‌ రక్షకుడిలా మారాడు. దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కోహ్లి పరిస్థితులను అనుసరించి నెమ్మదించగా.. అక్షర్‌ మాత్రం ధాటిగా ఆడాడు. స్పిన్నర్లు మార్‌క్రమ్, కేశవ్‌ మహరాజ్‌ల ఓవర్లలో అతను సిక్సర్లు బాదడంతో స్కోరు బోర్డు ముందుకు కదిలింది. కోహ్లి మాత్రం బంతికో పరుగు చేస్తూ సాగాడు. రబాడ వేసిన 14 ఓవర్లో అక్షర్‌ సిక్స్‌తో స్కోరు వంద దాటింది. అర్ధశతకం దిశగా సాగుతున్న అక్షర్‌ అదే ఓవర్లో దురదృష్టవశాత్తూ రనౌటైపోయాడు. కోహ్లి 48 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన విరాట్‌.. ఆ వెంటనే చెలరేగాడు. అర్ధశతకం తర్వాత 10 బంతుల్లో 26 పరుగులు చేసి నష్టాన్ని భర్తీ చేసిన కోహ్లి.. మరో భారీ షాట్‌ ఆడబోయి వెనుదిరిగాడు. కోహ్లి చెలరేగుతున్న దశలో స్కోరు 190 చేరుతుందనిపించింది. కానీ చివరి 8 బంతుల్లో 11 పరుగులే వచ్చాయి.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) క్లాసెన్‌ (బి) కేశవ్‌ 9; కోహ్లి (సి) రబాడ (బి) యాన్సెన్‌ 76; పంత్‌ (సి) డికాక్‌ (బి) కేశవ్‌ 0; సూర్యకుమార్‌ (సి) క్లాసెన్‌ (బి) రబాడ 3; అక్షర్‌ రనౌట్‌ 47; దూబె (సి) మిల్లర్‌ (బి) నోకియా 27; హార్దిక్‌ నాటౌట్‌ 5; జడేజా (సి) కేశవ్‌ (బి) నోకియా 2; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 176; వికెట్ల పతనం: 1-23, 2-23, 3-34, 4-106, 5-163, 6-174, 7-176; బౌలింగ్‌: యాన్సెన్‌ 4-0-49-1; కేశవ్‌ మహరాజ్‌ 3-0-23-2; రబాడ 4-0-36-1; మార్‌క్రమ్‌ 2-0-16-0; నోకియా 4-0-26-2; షంసి 3-0-26-0

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: హెండ్రిక్స్‌ (బి) బుమ్రా 4; డికాక్‌ (సి) కుల్‌దీప్‌ (బి) అర్ష్‌దీప్‌ 39; మార్‌క్రమ్‌ (సి) పంత్‌ (బి) అర్ష్‌దీప్‌ 4; స్టబ్స్‌ (బి) అక్షర్‌ 31; క్లాసెన్‌ (సి) పంత్‌ (బి) హార్దిక్‌ 52; మిల్లర్‌ (సి) సూర్య (బి) హార్దిక్‌ 21; యాన్సెన్‌ (బి) బుమ్రా 2; మహారాజ్‌ నాటౌట్‌ 2; రబాడ (సి) సూర్య (బి) హార్దిక్‌ 4; నోకియా నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169; వికెట్ల పతనం: 1-7, 2-12, 3-70, 4-106, 5-151, 6-156, 7-161, 8-168; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-20-2; బుమ్రా 4-0-18-2; అక్షర్‌ పటేల్‌ 4-0-49-1; కుల్‌దీప్‌ 4-0-45-0; హార్దిక్‌ పాండ్య 3-0-20-3; జడేజా 1-0-12-0

1

2007లో ఆరంభ టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో ఉన్న ఆటగాళ్లలో కేవలం రోహిత్‌ మాత్రం ప్రస్తుతం విజేతగా నిలిచిన జట్టులోనూ ఉన్నాడు. దీంతో రెండు టీ20 ప్రపంచకప్‌ విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు.


3

టీ20 ప్రపంచకప్‌ను రెండు సార్లు సొంతం చేసుకున్న జట్ల జాబితాలో టీమ్‌ఇండియా స్థానం. ఇంగ్లాండ్‌ (2010, 2022), వెస్టిండీస్‌ (2012, 2016) ముందున్నాయి.


2

భారత్‌ గెలిచిన టీ20 ప్రపంచకప్‌లు. 2007 ఆరంభ పొట్టి కప్‌లోనూ జట్టు విజేతగా నిలిచింది. వన్డేలనూ కలుపుకొంటే ఇది నాలుగో ప్రపంచకప్‌. 1983, 
2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్‌ సొంతం చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని