T20 world cup: ఈ కప్‌ అందరిదీ

‘‘ఒక ఆటగాడు ఒక మ్యాచ్‌ని గెలిపించగలడు కానీ.. కప్పు సాధించిపెట్టలేడు.. అందుకే సమష్టిగా ఆడి విజేతగా నిలవాలి’’ అన్న దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ మాటలను అక్షర సత్యం చేస్తూ భారత జట్టు కలసికట్టుగా చెలరేగి టీ20 ప్రపంచకప్‌ అందుకుంది.

Updated : 02 Jul 2024 13:35 IST

‘‘ఒక ఆటగాడు ఒక మ్యాచ్‌ని గెలిపించగలడు కానీ.. కప్పు సాధించిపెట్టలేడు.. అందుకే సమష్టిగా ఆడి విజేతగా నిలవాలి’’ అన్న దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ మాటలను అక్షర సత్యం చేస్తూ భారత జట్టు కలసికట్టుగా చెలరేగి టీ20 ప్రపంచకప్‌ అందుకుంది. ఈ క్రమంలో ఏ ఒక్కరిపైనో ఆధారపడలేదు. ఒక మ్యాచ్‌లో ఒకరు ఆదుకుంటే.. ఇంకో మ్యాచ్‌ ఇంకొకరు నేనున్నా అంటూ ముందుకొచ్చారు. అందుకే ఈ కప్‌ అందరిది.

బ్యాటింగ్‌లో భారత్‌ను రోహిత్‌శర్మ ముందుండి నడిపించాడు. పవర్‌ప్లేలో వేగంగా ఆడి జట్టుకు శుభారంభాలను అందించాడు. ఒకవైపు కోహ్లి విఫలమవుతున్నా తాను మాత్రం ఏమాత్రం జోరు తగ్గించలేదు. ఆస్ట్రేలియా (92), ఇంగ్లాండ్‌ (57)పై ఆడిన ఇన్నింగ్స్‌లు ఇదే కోవలోకి వస్తాయి. అతడు 8 మ్యాచ్‌ల్లో 257 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఫైనల్‌ ముందు వరకు విఫలమైన కోహ్లి.. అసలు సమరంలో మాత్రం సత్తా చాటాడు. 76 పరుగులు చేసి భారత్‌కు పోరాడే స్కోరు అందించాడు. రోడ్డు ప్రమాదం తర్వాత తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన రిషబ్‌ పంత్‌.. కీలక మ్యాచ్‌ల్లో ఆడడనే ముద్ర పడ్డ సూర్యకుమార్‌ యాదవ్‌ భారత విజయాల్లో కీలకమయ్యారు. పాకిస్తాన్‌పై రిషబ్‌ (42).. అమెరికా, అఫ్గాన్‌లపై సూర్య (50, 53) వెలకట్టలేని ఇన్నింగ్స్‌ ఆడారు. 8 మ్యాచ్‌ల్లో 199 పరుగులు చేసిన సూర్య.. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో ఆఖరి ఓవర్లో పట్టిన క్యాచ్‌ ఛాంపియన్‌ ఎవరో తేల్చేసింది. ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్, శివమ్‌ దూబె కూడా మెరుపు ఫినిషింగ్‌ ఇచ్చారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాపై ఫైనల్లో అక్షర్‌ (47) ఆడిన ఇన్నింగ్స్‌ అలాంటిదే. బంగ్లాదేశ్‌పై హార్దిక్‌ (50 నాటౌట్‌) దూకుడుగా ఆడి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకమయ్యాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై దూబె (16 బంతుల్లో 27) సత్తా చాటాడు.

బంతితో కళ్లెం వేసి..: భారత్‌  అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది  బ్యాటింగే.. కానీ ఈసారి ప్రపంచకప్‌లో బంతితో టీమ్‌ఇండియా అదరగొట్టింది. బుమ్రా నేతృత్వంలోని మన బౌలర్లు అవసరమైన ప్రతిసారీ జట్టును ఆదుకున్నారు. ఒకరు విఫలమైతే మరొకరు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ముఖ్యంగా బుమ్రాను ఎంత పొగిడినా తక్కువే! ప్రత్యర్థి బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ కెప్టెన్‌ రోహిత్‌ చూసింది బుమ్రా వైపే! ఈ ప్రపంచకప్‌లో కేవలం 4 ఎకానమీతో పరుగులు ఇవ్వడం అతడి సత్తాకు నిదర్శనం. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో ఫైనల్లో ఓటమి ఖాయమైన స్థితిలో అతడు వేసిన ఓవర్‌ మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేసింది. 8 మ్యాచ్‌ల్లో కేవలం 4.17 ఎకానమీతో 15 వికెట్లు తీశాడు. ఇక బుమ్రాకు తోడుగా అర్ష్‌దీప్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. భారత్‌కు పోటీ ఇచ్చేలా కనిపించిన అమెరికాపై 9 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసిన వైనం మాత్రం గుర్తుండిపోతుంది. సఫారీలతో తుదిపోరులో తీవ్ర ఒత్తిడిలోనూ అతడు గొప్పగా బంతులు వేసి బ్యాటర్లను కట్టడి చేశాడు. అర్ష్‌దీప్‌ 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఫారూఖీ (అఫ్గానిస్థాన్‌)తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు ముందు నాలుగు మ్యాచ్‌లే ఆడిన కుల్‌దీప్‌.. మిడిల్‌ ఓవర్లలో బ్యాటర్లను నియంత్రించడమే కాక.. వికెట్లు తీసి బ్రేక్‌ ఇచ్చాడు. ఓవరాల్‌గా అతడు 5 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. ఇక హార్దిక్‌ బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్‌తో 144 పరుగులు కూడా సాధించాడు. తీవ్ర ఒత్తిడి మధ్య ఆఖరి ఓవర్‌ను గొప్పగా వేసి భారత్‌కు కప్‌ అందించాడు. తనను విమర్శించిన వాళ్లకు    ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అతడు దీటుగా బదులిచ్చాడు. అక్షర్‌ (8 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు) కూడా బంతితో రాణించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని