T20 Worlc cup: ఈ ప్రపంచకప్‌ వేరయా..

2007 నుంచి 2022 వరకు 8 టీ20 ప్రపంచకప్‌లు జరిగాయి. కానీ వీటిన్నిటిలోకెల్లా అత్యంత ప్రత్యేకమైన, విభిన్నమైన ప్రపంచకప్‌గా ప్రస్తుత టోర్నీని చెప్పుకోవచ్చు.

Published : 01 Jul 2024 04:19 IST

2007 నుంచి 2022 వరకు 8 టీ20 ప్రపంచకప్‌లు జరిగాయి. కానీ వీటిన్నిటిలోకెల్లా అత్యంత ప్రత్యేకమైన, విభిన్నమైన ప్రపంచకప్‌గా ప్రస్తుత టోర్నీని చెప్పుకోవచ్చు. తొలిసారి 20 జట్లు ఆడటం, అమెరికా ఆతిథ్యం, మందకొడి పిచ్‌లు, అఫ్గానిస్థాన్‌ సంచలన ప్రదర్శన, దక్షిణాఫ్రికా స్ఫూర్తిదాయక ప్రయాణం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలున్నాయి.

రికార్డు సంఖ్యలో..: టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి 20 జట్లతో జరిగిన టోర్నీ ఇదే. దీంతో చిన్న దేశాలకూ పెద్ద జట్లతో తలపడే అవకాశం వచ్చింది. అయితే కూనలు ఉత్తమ ప్రదర్శనతో టోర్నీని రసవత్తరంగా మార్చాయి. బౌలింగ్‌ అనుకూల పరిస్థితుల్లో పెద్ద జట్లకు ఇవి సవాలు విసిరాయి. పాపువా న్యూ గినీపై వెస్టిండీస్, స్కాట్లాండ్‌పై ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌పై పాకిస్థాన్‌.. నెదర్లాండ్స్, నేపాల్‌పై దక్షిణాఫ్రికా చెమటోడ్చి గెలిచాయి. నేపాల్‌పై సఫారీ జట్టు ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది.

సఫారీలు తొలిసారి: ఐసీసీ టోర్నీలంటే చాలు దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతుందనే అభిప్రాయాలుండేవి. ఈ టోర్నీకి ముందు ఆ జట్టు ఒక్కసారి కూడా సెమీస్‌ దాటకపోవడమే అందుకు కారణం. టీ20 ప్రపంచకప్‌ల్లో చూసుకుంటే 2009, 2014లో ఆ జట్టు సెమీస్‌లోనే నిష్క్రమించింది. మిగతా టోర్నీల్లో రెండో రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టింది. కానీ ఈ సారి సఫారీ జట్టు ఆ ముద్ర చెరిపేసుకుంది. టోర్నీలో తీవ్ర ఒత్తిడి సమయాల్లో పట్టుదలతో నిలిచిన ఆ జట్టు మొట్టమొదటి సారి ఓ ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. తుదిపోరులోనూ పోరాడి ఓడింది. డికాక్, మిల్లర్, క్లాసెన్, స్టబ్స్‌ బ్యాట్‌తో.. నోకియ, రబాడ, షంసి, మహరాజ్‌ బంతితో మెరిశారు. మరోవైపు పెద్ద జట్లకూ ఈ టోర్నీలో గట్టిషాక్‌లే తగిలాయి. గత రెండు ప్రపంచకప్‌ల్లోనూ కనీసం సెమీస్‌ చేరిన న్యూజిలాండ్, పాకిస్థాన్‌ ఈ సారి గ్రూప్‌ దశలోనే వెళ్లిపోయాయి.

బ్యాటింగ్‌.. అమ్మో

టీ20లు అంటేనే ధనాధన్‌ బ్యాటింగ్‌ ప్రదర్శనలు గుర్తుకొస్తాయి. బ్యాటర్ల చేతుల్లో బౌలర్ల ఊచకోత కళ్ల ముందు మెదులుతుంది. కానీ ఈ టీ20 ప్రపంచకప్‌లో కథ అడ్డం తిరిగింది. బంతి దూకుడుకు బ్యాట్‌ భయపడింది. అందుకు ప్రధాన కారణం ఆతిథ్య దేశాలైన అమెరికా, వెస్టిండీస్‌లోని పరిస్థితులు, పిచ్‌లు. ముఖ్యంగా తొలిసారి ఈ పొట్టికప్‌కు ఆతిథ్యమిచ్చిన యుఎస్‌.. నాసా కౌంటీ క్రికెట్‌ స్టేడియంలోని పిచ్‌ల వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చిన ఈ డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు కుదురుకునేందుకు సమయం లేకపోవడంతో అస్థిర బౌన్స్‌తో బ్యాటర్లకు ప్రమాదకరంగా మారాయి. మరోవైపు వెస్టిండీస్‌లోని స్పిన్‌ పిచ్‌లు కూడా బ్యాటర్లకు కళ్లెం వేశాయి. ఈ టోర్నీలో 55కు గాను వర్షంతో రద్దయిన 4 పోను 51 మ్యాచ్‌లు జరిగాయి. అంటే 102 ఇన్నింగ్స్‌లు. ఇందులో దాదాపు సగం అంటే 50 ఇన్నింగ్స్‌ల్లో 120 కంటే తక్కువ పరుగులే నమోదయ్యాయి. అంటే బంతికో పరుగు కూడా రాలేదు. కేవలం నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనే స్కోరు 200 దాటింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకూ జరిగిన 9 ప్రపంచకప్‌ల్లో జట్లు చేసిన అత్యల్ప స్కోర్ల జాబితాలో తొలి పది స్థానాల్లో ఈ సారి నమోదైన స్కోర్లే అయిదున్నాయి. అత్యల్ప స్కోరూ (ఉగాండా 39) ఈ ప్రపంచకప్‌లోనిదే.

అఫ్గాన్‌ ప్రకంపనలు

2024 టీ20 ప్రపంచకప్‌ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అఫ్గానిస్థాన్‌ సంచలన ప్రదర్శన కచ్చితంగా గుర్తుకొస్తుంది. తమది ఏ మాత్రం చిన్న జట్టు కాదని ఈ టోర్నీలో అఫ్గాన్‌ వీరులు అసాధారణ ప్రదర్శనతో సెమీస్‌ వరకూ వచ్చారు. గ్రూప్‌ దశలో న్యూజిలాండ్‌ను చిత్తుచేసి.. సూపర్‌-8లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌పై గెలిచి అదరగొట్టారు. సెమీస్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయినా ఈ టోర్నీలో అఫ్గాన్‌ ఆటగాళ్ల తెగువ, పోరాట పటిమ ప్రత్యేకంగా నిలిచిపోతాయి. బ్యాటింగ్‌లో రహ్మనుల్లా గుర్బాజ్‌ (281 పరుగులు), ఇబ్రహాం జద్రాన్‌ (231).. బౌలింగ్‌లో ఫజల్‌హక్‌ ఫారూఖీ (17 వికెట్లు), రషీద్‌ ఖాన్‌ (14), నవీనుల్‌ హక్‌ (13) అద్భుత ప్రదర్శనతో అఫ్గానిస్థాన్‌ చిరస్మరణీయ ప్రదర్శనలో కీలకమయ్యారు.

అమెరికా అదుర్స్‌

ఆతిథ్య హోదాలో తొలిసారి ప్రపంచకప్‌ ఆడిన అమెరికా అద్భుత ఆటతీరుతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఆ జట్టు ఒక్క మ్యాచ్‌ గెలిచినా గొప్పే అనుకుంటే.. ఏకంగా పాకిస్థాన్‌పై సంచలన విజయంతో సూపర్‌-8లో అడుగుపెట్టింది. అత్యంత ఉత్కంఠగా సాగిన ఆ పోరులో అమెరికా సూపర్‌ ఓవర్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. యుఎస్‌లో క్రికెట్‌కు ఆదరణ పెంచే దిశగా అక్కడ ప్రపంచకప్‌ మ్యాచ్‌లను ఐసీసీ నిర్వహించింది. ఈ టోర్నీలో అమెరికా ప్రదర్శనతో ఆ దేశంలో ఆటకు ప్రాచుర్యం పెరగడంతో పాటు మరికొన్ని దేశాలు కూడా క్రికెట్‌ బాట పట్టే అవకాశముంది. చిన్న జట్ల ప్రదర్శన మరింత స్ఫూర్తినిచ్చేదే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని