IND vs ENG: ఇంగ్లాండ్‌పై రివెంజ్‌ అదిరింది.. టీమ్‌ఇండియా ఫైనల్‌కు చేరింది

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్‌ 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

Updated : 28 Jun 2024 14:29 IST

గయానా: రెండేళ్ల కిందట జరిగిన ఘోర పరాభవానికి అద్భుతమైన రివెంజ్. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ ఈసారి కూడా హాట్‌ ఫేవరెట్‌. కానీ, బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్‌ఇండియా ముందు ఈసారి ఆ జట్టు విన్యాసాలు సరిపోలేదు. దీంతో ఇంగ్లిష్‌ జట్టును చిత్తు చేసిన భారత్‌.. మూడోసారి టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. వరుసగా విజయాలు సాధించిన రెండు టీమ్‌లు ఫైనల్‌లో తలపడనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

బౌలర్లు విజృంభిన వేళ రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను భారత్‌ 68 పరుగుల తేడాతో చిత్తుచేసింది. ఈ మెగాటోర్నీలో ఓటమి అన్నదే ఎరుగకుండా జైత్రయాత్ర చేస్తున్న టీమ్‌ఇండియా.. టైటిల్‌ కోసం ఫైనల్‌కు చేరింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్ శర్మ (57: 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో విరుచుకుపడగా, సూర్యకుమార్‌ యాదవ్‌ (47: 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగాడు. హార్దిక్‌ పాండ్య (23: 13 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్‌), జడేజా (17*: 9 బంతుల్లో 2 ఫోర్లు) పరుగులు చేశారు. విరాట్‌ కోహ్లీ (9), రిషబ్‌ పంత్‌ (4) నిరాశ పరిచారు. ఇంగ్లిష్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ 3 వికెట్లు తీశాడు. టోప్లే, జోఫ్రా ఆర్చర్‌, సామ్‌ కరన్‌, ఆదిల్‌ రషీద్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లు అక్షర్‌ పటేల్‌ 3, కుల్‌దీప్‌ యాదవ్‌ 3, బుమ్రా 2 వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించారు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్’ అవార్డు వరించింది. అక్షర్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాడు మొయిన్‌ అలీని రిషభ్ పంత్ స్టంపౌట్‌ చేయడం ఆటకే హైలైట్‌గా నిలిచింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు