T20 World Cup: జయహో జగజ్జేత

నిరాశ ఆవహించింది.. దుఃఖం తన్నుకొస్తోంది.. ఓటమి తప్పదన్న భావన మెలిపెడుతోంది. ఏడు నెలల కిందే వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఎదురైన పరాభవం గుర్తొస్తుంటే బాధ రెట్టింపవుతోంది.

Updated : 30 Jun 2024 06:56 IST

భారత్‌దే టీ20 ప్రపంచకప్‌
ఉత్కంఠభరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం
మెరిసిన కోహ్లి, అక్షర్, హార్దిక్, బుమ్రా, అర్ష్‌దీప్‌

నిరాశ ఆవహించింది.. దుఃఖం తన్నుకొస్తోంది.. ఓటమి తప్పదన్న భావన మెలిపెడుతోంది. ఏడు నెలల కిందే వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఎదురైన పరాభవం గుర్తొస్తుంటే బాధ రెట్టింపవుతోంది. టీవీల ముందు కూర్చున్న ప్రతి భారత అభిమానీ పరాభవానికి సిద్ధమైపోయాడు. నీళ్లు నిండిన కళ్లతో, బరువెక్కిన హృదయంతో! ఒక్కరంటే ఒక్కరైనా రోహిత్‌సేన కప్పు గెలుస్తుందని ఊహించి ఉండరు! ఎందుకంటే ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికా చేయాల్సింది 24 బంతుల్లో 26 పరుగులే. అలాంటి స్థితిలో ఓ జట్టు ఓడిపోతుందని ఎవరైనా కలలోనైనా అనుకుంటారా! కానీ అద్భుతమే జరిగింది. ఓటమి కోరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన పోరులో 7 పరుగుల తేడాతో గెలిచి దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. రెండొందల పరుగులు చేయొచ్చనుకున్న పిచ్‌పై మొదట భారత్‌ 7 వికెట్లకు 176 పరుగులే చేసింది. కోహ్లి (76), అక్షర్‌ (47) రాణించారు. ఛేదనలో హార్దిక్‌ (3/20), బుమ్రా (2/18), అర్ష్‌దీప్‌ (2/20) సూపర్‌ బౌలింగ్‌కు దక్షిణాఫ్రికా 8 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. మ్యాచ్‌ మలుపు తిరిగిన తీరు నభూతో..!

151/4. ఛేదనలో 16 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరిది. ఒకవైపు విధ్వంసక షాట్లతో యథేచ్ఛగా విరుచుకుపడుతున్న క్లాసెన్‌. మరోవైపు ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన బౌలర్లు. డీలాపడ్డ ఫీల్డర్లు. వాళ్ల శరీర భాషలో అది స్పష్టం. కానీ చచ్చిపోయిన భారత్‌ ఆశలకు హార్దిక్‌ జీవం పోశాడు. 17వ ఓవర్లో ప్రమాదకర క్లాసెన్‌ (52)ను ఔట్‌ చేయడమే కాకుండా.. 4 పరుగులే ఇచ్చాడు. టీవీలు కట్టేద్దామని అభిమానులు చేతుల్లోకి తీసుకున్న రిమోట్లన్నీ యథాస్థానాల్లోకి వెళ్లిపోయాయి. అప్పుడొచ్చాడు ఆపద్బాంధవుడు బుమ్రా. తన ఆఖరి ఓవర్లో అదరహో అనిపించాడు. మిణుకు మిణుకుమంటున్న టీమ్‌ఇండియా ఆశలకు రెక్కలు తొడుగుతూ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఓవర్లో రెండు పరుగులే ఇచ్చి యాన్సెన్‌ను ఔట్‌ చేసి తనకూ అవకాశముందని భారత్‌కు బలమైన నమ్మకం కలిగించాడు. ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగిపోయింది. ఆ తర్వాత బాధ్యత అర్ష్‌దీప్‌ (19వ ఓవర్‌) తీసుకున్నాడు. బుమ్రా నుంచి స్ఫూర్తి పొందాడో, ఎలాగైనా దేశాన్ని గెలపించాలని సంకల్పించుకున్నాడో.. శక్తులన్నీ కూడదీసుకుంటూ అత్యంత కట్టుదిట్టంగా, బ్యాటర్‌కు కాస్తయినా స్వేచ్ఛ ఇవ్వకుండా బంతులేశాడు. 0, 0, 1, 2, 1, 0.. ఇదీ అతడి వండర్‌ ఓవర్‌! ఒక్కసారిగా భారత్‌ ఫేవరెట్‌గా మారిపోయింది. ఉత్కంఠ ఊపేస్తుండగా భారాన్నంతా మోస్తూ, ఒత్తిడిని జయిస్తూ హార్దిక్‌ చిరకాలం గుర్తుండిపోయేలా బౌలింగ్‌ చేశాడు. ఇక్కడ సూర్య మరో హీరో. ఆఖరి ఓవర్‌ తొలి బంతికి అతడు అందుకున్న క్యాచ్‌కు మిల్లర్‌ నిష్క్రమించడంతో మ్యాచ్‌ భారత్‌ వైపు తిరిగింది. సిక్స్‌ వెళ్లడం ఖాయమనుకున్న బంతిని బౌండరీ లైన్‌ వద్ద అతడు కళ్లు చెదిరే రీతిలో అందుకున్న తీరు అభిమానుల స్మృతిపథంలో చాన్నాళ్లు ఉండిపోతుంది. హార్దిక్‌ తర్వాతి బౌంతికి బౌండరీ ఇవ్వగా.. మూడు, నాలుగు బంతులకు బైలు వచ్చాయి. హార్దిక్‌ వైడ్‌ వేసినా.. ఆ వెంటనే రబాడను ఔట్‌ చేయడంతో భారత్‌ విజయం ఖాయమైపోయింది. ఆఖరి బంతి పడగానే భారత ఆటగాళ్లు, అభిమానుల సంబరాలు మిన్నంటాయి.


క్లిష్ట సమయాల్లోనూ పోరాడి..: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

అసాధారణ విజయం సాధించిన భారత క్రికెట్‌ జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు. ఓటమిని ఎప్పటికీ అంగీకరించని స్ఫూర్తితో క్లిష్ట సమయాల్లోనూ అత్యద్భుత నైపుణ్యంతో పోరాడి గెలిచిన జట్టు మీది. వెల్‌డన్‌ టీం ఇండియా.. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం.


‘‘ఛాంపియన్స్‌. తమదైన శైలిలో భారత్‌ టీ20 ప్రపంచకప్‌ను స్వదేశానికి తీసుకురానుంది. భారత క్రికెట్‌ జట్టు పట్ల గర్వపడుతున్నాం. ఈ మ్యాచ్‌ చరిత్రాత్మకం. మన క్రికెటర్ల ప్రదర్శన పట్ల 140 కోట్లకు పైగా భారతీయులు గర్వపడుతున్నారు. వాళ్లు కేవలం ట్రోఫీ మాత్రమే కాదు కోట్లాది ప్రజల హృదయాలు గెలిచారు’’ - ప్రధాని మోదీ


అత్యద్భుత విజయం: రాహుల్‌ గాంధీ

టీ20 ప్రపంచకప్‌లో అత్యద్భుత విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. టోర్నమెంట్‌ మొత్తం నిరాటంక విజయాలను సాధించారు. అద్భుత క్యాచ్‌ పట్టిన సూర్యకుమార్‌కు, స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందించిన రోహిత్‌శర్మకు నా అభినందనలు.


 

హైదరాబాద్‌ సచివాలయం వద్ద క్రికెట్‌ అభిమానుల ఆనందోత్సాహాలు.. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని