T20 World Cup: ఛాంపియన్లు వస్తున్నారు

13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్‌ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Updated : 04 Jul 2024 10:13 IST

దిల్లీలో ప్రధానితో సమావేశం
వాంఖడెలో సన్మానం కూడా
నేడు ముంబయిలో టీమ్‌ఇండియా రోడ్‌ షో
ముంబయి

13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్‌ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం దిల్లీలో అడుగు పెట్టబోతున్న రోహిత్‌ సేన.. అక్కడే ప్రధానితో సమావేశం కాబోతోంది. ఆ తర్వాత ముంబయి చేరుకోనున్న జట్టు రోడ్‌ షోలో పాల్గొనబోతోంది. అనంతరం ప్రఖ్యాత వాంఖడె స్టేడియంలో అభిమానుల మధ్య టీమ్‌ఇండియాను బీసీసీఐ సన్మానించబోతోంది.

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ శనివారమే పూర్తయినా.. బార్బడోస్‌లో తుపాను కారణంగా తర్వాతి మూడు రోజుల్లో విమానం ఎక్కలేకపోయింది రోహిత్‌సేన. ఎట్టకేలకు బుధవారం తెల్లవారుజామున 4.50 గంటలకు ప్రత్యేక విమానంలో జట్టు సభ్యులు, సహాయ సిబ్బంది భారత్‌కు బయల్దేరారు. గురువారం ఉదయం 6 గంటలకు విమానం దిల్లీకి చేరుకుంటుంది. 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని రోహిత్‌ బృందం కలుస్తుంది. ఆ సమావేశం ముగిశాక ప్రత్యేక విమానంలోనే ముంబయికి బయల్దేరుతుంది. అక్కడికి చేరుకున్నాక సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రోడ్‌ షో మొదలవుతుంది. రెండు గంటల పాటు సాగే ఊరేగింపులో రోహిత్‌ బృందం ఓపెన్‌ టాప్‌ బస్సులో కప్పుతో అభిమానులకు అభివాదం చేస్తూ సాగుతుంది. రాత్రి వాంఖడె స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తారు.

‘‘బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బార్బడోస్‌ నుంచి భారత జట్టు బయల్దేరింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షాలతో పాటు బార్బడోస్‌లో చిక్కుకుపోయిన మన జర్నలిస్టులు కూడా అదే విమానంలో వస్తున్నారు. ఉదయం జట్టు సభ్యులు దిల్లీలో దిగాక.. 11 గంటలకు ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలుస్తారు. తర్వాత ముంబయికి బయల్దేరుతారు. అక్కడ నారిమన్‌ పాయింట్‌ నుంచి ఓపెన్‌ టాప్‌ బస్సులో ఊరేగింపు ఉంటుంది. వాంఖడెలో సన్మానం అనంతరం బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నగదు బహుమతిని జట్టు సభ్యులకు అందిస్తారు’’ అని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తెలిపాడు. రోడ్‌ షోలో పాల్గొనాలని అభిమానులకు బీసీసీఐ కార్యదర్శి జై షా, టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ‘ఎక్స్‌’లో పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచకప్‌ విజయోత్సవ ఊరేగింపులో మాతో కలవండి. గుర్తుంచుకోండి.. జులై 4న 5 గంటలకు రోడ్‌ షో మొదలవుతుంది’’ అని జై షా పేర్కొన్నాడు. ‘‘ఈ ప్రత్యేక సందర్భాన్ని మీరు కూడా ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. విజయాన్ని ఆస్వాదిద్దాం రండి’’ అని రోహిత్‌ కోరాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని