Team India: బీసీసీఐ స్పెషల్‌ ఫ్లైట్‌.. బార్బడోస్‌ నుంచి భారత్‌కు రానున్న టీమ్‌ఇండియా

హరికేన్‌ కారణంగా బార్బడోస్‌లో చిక్కుకున్న టీమ్‌ఇండియా బుధవారం భారత్‌కు చేరుకోనుంది. బీసీసీఐ ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు ప్రయాణించనున్నారు. 

Published : 02 Jul 2024 15:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: 17 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ టీమ్‌ఇండియా (Team India) టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup)ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. బెరిల్‌ హరికేన్‌ ప్రభావంతో రెండు రోజులుగా బార్బడోస్‌లో చిక్కుకుపోయిన టీమ్‌ఇండియా జట్టు స్వదేశానికి పయనం కానుంది. ప్లేయర్ల కోసం బీసీసీఐ (BCCI) ప్రత్యేక విమానం ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. బుధవారం టీమ్‌ఇండియా జట్టు భారత్‌కు బయలుదేరనుంది. ఆటగాళ్లకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త ఊరటనిచ్చినటయ్యింది.

హరికేన్‌ విజృంభణతో బార్బడోస్‌లో రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి ఎయిర్‌పోర్ట్‌ను మూసేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రెండు రోజులుగా భారత ఆటగాళ్లు తాము బస చేస్తున్న హోటల్‌కే పరిమితమయ్యారు. పరిస్థితి కాస్త మెరుగుపడడంతో భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు బార్బడోస్‌ నుంచి భారత్‌కు ప్రత్యేక విమానం బయలుదేరనుంది. అదేరోజు సాయంత్రం 7.45 గంటలకు దిల్లీకి ఆటగాళ్లు చేరుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ఎంపికైన యశస్వి జైస్వాల్‌, సంజు శాంసన్‌, ఖలీల్‌ అహ్మద్‌, రింకుసింగ్ కూడా అందులోనే ఉన్నారు.

ఆ రోజు రోహిత్‌ శర్మ ఫోన్‌ చేయకపోయి ఉంటే..: ద్రవిడ్‌

జింబాబ్వేకు టీమ్‌ఇండియా..

జింబాబ్వే వేదికగా జులై 6 నుంచి 14 వరకు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం టీమ్‌ఇండియా బయలుదేరింది. అయితే.. బార్బడోస్‌లో ఉన్న కొందరు ఆటగాళ్లు నేరుగా జింబాబ్వేకి వెళుతున్న జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని