Rohit- Virat: అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్‌ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ

టీ20 ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న టీమ్‌ఇండియాకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు.

Published : 05 Jul 2024 00:07 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న టీమ్‌ఇండియాకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు. దిల్లీ నుంచి ముంబయి చేరుకుని విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న భారత జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. రోడ్ షో జరిగిన మెరైన్ రోడ్డు మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. సుమారు గంటన్నరపాటు సాగిన విజయయాత్ర భారత క్రికెట్‌ చరిత్రలో అపురూపమైన ఘట్టంగా నిలిచిపోతుంది. ర్యాలీ ముగిసిన అనంతరం ప్రపంచ కప్ గెలిచిన భారత ఆటగాళ్లు వాంఖడె స్టేడియానికి చేరుకున్నారు. అక్కడికి కూడా వేలాది అభిమానులు తరలివచ్చారు. స్టేడియంలో బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ప్రపంచ కప్‌ గెలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని అందించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ వేదికపైకి వస్తున్నప్పుడు ‘‘రోహిత్.. రోహిత్’’ నినాదాలతో స్టేడియం దద్దరిల్లింది. స్టేడియంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి స్టెప్పులేయగా.. మిగతా క్రికెటర్లు కూడా వారితో కలిసి డ్యాన్స్‌ చేశారు. కార్యక్రమంలో రోహిత్, విరాట్ కోహ్లీ మాట్లాడారు.   

‘‘మాకు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులను చూస్తే ఈ టి20 ప్రపంచకప్ టైటిల్‌ కోసం మాలాగే వారు కూడా ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమైంది. ఈ టీ20 ప్రపంచకప్ ట్రోఫీ యావత్ దేశానికి చెందుతుంది’’ - రోహిత్ 

‘‘రోహిత్, నేను చాలా కాలంగా దీని కోసం (టీ20 ప్రపంచ కప్‌) ప్రయత్నిస్తున్నాం. మేము ప్రతిసారి ప్రపంచ కప్ గెలవాలని కోరుకున్నాం. వాంఖడెకు ట్రోఫీని తిరిగి తీసుకురావడం చాలా ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. 2011 ప్రపంచ కప్‌ గెలిచిన రోజు కంటతడి పెట్టిన సీనియర్ల భావోద్వేగాలతో నేను కనెక్ట్ కాలేకపోయాను. కానీ, ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తోంది. 15 ఏళ్లలో రోహిత్‌ను ఇంత ఎమోషనల్‌గా చూడటం ఇదే మొదటిసారి’’ - కోహ్లీ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని