Team India: విశ్వవిజేతల విజయ యాత్ర.. క్రికెట్ ఫ్యాన్స్‌తో జనసంద్రంగా మారిన ముంబయి సముద్ర తీరం

ముంబయిలో టీమ్ఇండియా (Team India) ప్రపంచ కప్ విజయోత్సవ ర్యాలీ మొదలైంది. రోడ్ షో జరిగే మెరైన్ రోడ్డు అభిమానులతో కిక్కిరిసిపోయింది. 

Updated : 05 Jul 2024 00:33 IST

ఇంటర్నెట్ డెస్క్: 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) సాధించి విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన టీమ్‌ఇండియా (Team India) స్వదేశానికి చేరుకుంది. ఉదయం దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన రోహిత్‌ సేన.. సాయంత్రం ముంబయికి చేరుకుంది. మెరైన్ రోడ్డులో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ప్రపంచ కప్‌ గెలిచిన భారత ఆటగాళ్లు పాల్గొన్నారు. వరల్డ్ కప్‌ విన్నర్స్ ఓపెన్‌ టాప్‌ బస్‌లో నిల్చుని రోడ్‌ షోలో సందడి చేశారు. నారీమన్‌ పాయింట్ నుంచి వాంఖడె స్టేడియం ఈ రోడ్ షో సుమారు గంటన్నరపాటు సాగింది. టీమ్ఇండియా ఆటగాళ్లు వరల్డ్ కప్‌ ట్రోఫీని పట్టుకుని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భారత ఆటగాళ్లు అభిమానులను ఉత్సాహపర్చగా.. తమ అభిమాన క్రికెటర్లను తమ చరవాణుల్లో బంధించేందుకు ఫ్యాన్స్‌ పోటీపడ్డారు. రోడ్ షో ముగిసిన అనంతరం టీమ్ఇండియా వాంఖడె స్టేడియానికి చేరుకుంది. అక్కడ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రపంచ కప్‌ విజేతగా నిలిచిన భారత జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించి రూ.125 కోట్ల నగదు బహుమతిని అందజేసింది.  

వాంఖడె స్టేడియంలో నిర్వహించే కార్యక్రమానికీ అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉచిత ప్రవేశం కల్పించడంతో స్టేడియంలో అన్ని స్టాండ్స్‌ అభిమానులతో కిటకిటలాడాయి. టీమ్ఇండియా క్రికెటర్లు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి దిల్లీకి.. అక్కడి నుంచి ముంబయికి వచ్చిన విషయం తెలిసిందే. విశ్వవిజేతలను స్వదేశానికి తీసుకొచ్చిన ఈ ప్రత్యేక విమానానికి ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టు సిబ్బంది స్పెషల్ వాటర్ సెల్యూట్ చేశారు.

విశ్వవిజేతలకు ఘన స్వాగతం పలికేందుకు క్రికెట్ అభిమానులు ముంబయికి పోటెత్తారు. మెరైన్‌ రోడ్‌కు మధ్యాహ్నం నుంచే ఫ్యాన్స్‌ భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఆ రోడ్డు మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. అభిమానులు మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు. రాత్రి వాంఖడె స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఐదు గంటలకే రోడ్ షో ప్రారంభం కావాల్సి ఉండగా.. భారత ఆటగాళ్లు దిల్లీ నుంచి ముంబయికి ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో రోడ్ షో ఆలస్యంగా ప్రారంభమైంది.

డ్యాన్స్ చేసిన రోహిత్, కోహ్లీ 

వాంఖడె స్టేడియంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి స్టెప్పులేయగా.. మిగతా క్రికెటర్లు కూడా వారితో కలిసి డ్యాన్స్‌ చేశారు. ‘‘రోహిత్‌.. రోహిత్‌’’, ‘‘కోహ్లీ.. కోహ్లీ’’, ‘‘హార్దిక్.. హార్దిక్’’ అని అభిమానులు చేసిన నినాదాలతో స్టేడియం దద్దరిల్లింది. 






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని