Team India: భారత ఆటగాళ్లతో ఓపెన్ బస్‌ పరేడ్.. ఎక్కడంటే?

టీమ్ఇండియా 17 ఏళ్ల తర్వాత పొట్టి కప్‌ను సాధించింది. దీంతో భారీ ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.

Updated : 03 Jul 2024 18:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్ఇండియా (Team India) 2024 టీ20 ప్రపంచ కప్‌ సాధించిన సందర్భంగా ముంబయిలో మెరైన్‌ డ్రైవ్‌ ప్రాంతంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ సంబరాలు మొదలవుతాయని తెలుపుతూ అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. ధోనీ సారథ్యంలో భారత్‌ 2007 టీ20 ప్రపంచ కప్‌ సాధించినప్పుడు కూడా ప్రపంచ కప్‌ గెలిచిన ఆటగాళ్లతో ముంబయిలో భారీ ఎత్తున  సంబరాలు నిర్వహించారు. వేలాది అభిమానులు టీమ్ఇండియా ఆటగాళ్లున్న బస్సు వెంట నడిచి గెలుపు సంబరాల్లో భాగమయ్యారు. తాజాగా అప్పటి ఫొటోను బీసీసీఐ కార్యదర్శి జై షా సామాజిక మాధ్యమాల్లో పంచుకుని ఇప్పుడు అదే విధంగా విజయోత్సవ సంబరాల్లో అభిమానులు భాగం కావాలని పిలుపునిచ్చారు. భారత్ 2011 ప్రపంచ కప్‌ విజేతగా నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన ఐదు రోజులకే ఐపీఎల్‌ ప్రారంభమైంది. దీంతో అప్పుడు ప్రపంచ కప్‌ జట్టుతో బస్‌ పరేడ్ నిర్వహించలేదు.

ప్రస్తుతం టీమ్ఇండియా ఆటగాళ్లు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బార్బడోస్‌ నుంచి స్వదేశానికి బయల్దేరారు. ఈ విమానం గురువారం ఉదయం దిల్లీలో ల్యాండ్ కానుంది. తర్వాత భారత ఆటగాళ్లు ప్రధాని మోదీని కలుస్తారు. అనంతరం భారత ప్రపంచ కప్‌ జట్టు ముంబయికి చేరుకుని విజయోత్సవ సంబరాల్లో పాల్గొంటుంది. సాయంత్రం భారత ఆటగాళ్లు తమ ఇళ్లకు పయనవుతారు.

జై షా ఎక్స్‌లో పోస్టు చేసిన ఫొటో 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని