Team India: భీకర హరికేన్‌.. బార్బడోస్‌లో చిక్కుకుపోయిన టీమ్‌ఇండియా

బెరిల్ హరికేన్‌ ఎఫెక్ట్ టీమ్ఇండియాపై పడింది. ఈ హరికేన్ కారణంగా భారత జట్టు స్వదేశానికి ఆలస్యంగా రానుంది. 

Published : 01 Jul 2024 13:05 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ గెలవడంతో యావత్ భారతావని సంబరాల్లో మునిగితోలుతోంది. టీమ్‌ఇండియా (Team India) ప్లేయర్లకు సొంత గడ్డపై ఘన స్వాగతం పలికేందుకు భారత్ సిద్ధమైంది. కానీ, ఫ్యాన్స్‌ ఆశలపై భీకర హరికేన్‌ నీళ్లు చల్లింది. ఈ హరికేన్‌ కారణంగా భారత ఆటగాళ్లు స్వదేశం రావడం ఆలస్యం కానుంది. టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఉన్న బార్బడోస్‌తోపాటు సెయింట్‌ లూసియా, గ్రెనడా, సెయింట్‌ విన్సెంట్, గ్రెనడైన్‌ దీవులపై బెరిల్‌ హరికేన్‌ పంజా విసురుతోంది. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

 బెరిల్‌ హరికేన్‌ కారణంగా ఆ ప్రాంతంలో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసివేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల భారత ఆటగాళ్లు తాము బస చేస్తున్న హోటల్‌కే పరిమితమయ్యారు. బార్బడోస్‌లో కర్ఫ్యూ దృష్ట్యా టీమ్‌ఇండియా ఆటగాళ్ల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పరిస్థితులు మెరుగుపడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

వీరి రాక ఆలస్యమైతే..  

ఐదు టీ20ల సిరీస్‌ కోసం టీమ్‌ఇండియా త్వరలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుతం బార్బడోస్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌, సంజు శాంసన్‌, ఖలీల్‌ అహ్మద్‌, రింకుసింగ్ జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యారు. వీరి రాక ఆలస్యమైతే ఇతర ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశముంది.  

స్వదేశానికి వచ్చిన తర్వాత భారత ఆటగాళ్లను బీసీసీఐ ఘనంగా సత్కరించనుంది. ఈవిషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. భారత జట్టు హరికేన్ కారణంగా బార్బడోస్‌లో చిక్కుకుపోయిందని జై షా తెలిపాడు. టీమ్ఇండియా అక్కడినుంచి బయలుదేరిన తర్వాత సన్మాన కార్యక్రమానికి ఏర్పాట్లుచేస్తామని పేర్కొన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని