IND vs SA: దంచికొట్టిన కోహ్లీ, అక్షర్‌.. దక్షిణాఫ్రికా టార్గెట్ 177

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Updated : 29 Jun 2024 23:38 IST

బ్రిడ్జ్‌టౌన్: దక్షిణాఫ్రికాతో (South Africa) జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో (T20 Worldcup) భారత్‌ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ ఇండియా (India).. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) (76; 59 బంతుల్లో 6×4, 2×6) కీలక మ్యాచ్‌లో అదరగొట్టాడు. అక్షర్‌ పటేల్‌ (47; 31 బంతుల్లో 1×4, 4×6) దూకుడుగా ఆడాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (9) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. మహరాజ్‌ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఒక్క బంతి వ్యవధిలోనే తొలి డౌన్‌లో వచ్చిన రిషభ్‌ పంత్‌ (0) పరుగులేమీ చేయకుండానే డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అప్పటికి జట్టు స్కోరు కేవలం 23 పరుగులు మాత్రమే.

అక్కడికి స్వల్ప వ్యవధిలోనే సూర్యకుమార్‌ యాదవ్‌ (3) రబాడా బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి క్లాసెన్‌ చేతికే చిక్కిపోయాడు. ఐదు ఓవర్లలోనే కీలకమైన 3 వికెట్లు కోల్పోవడంతో జట్టు కష్టాల్లో పడింది. అయితే, అప్పుడే క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ నిర్మించాడు. ఇద్దరూ క్రీజులో నిలదొక్కుకొని వీలుచిక్కినప్పుడల్లా ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదేశారు. దీంతో టీమ్‌ ఇండియాకు కాస్త సాంత్వన చేకూరింది. అయితే, అర్ధశతకానికి చేరువలో సమన్వయ లోపంతో అక్షర్‌ పటేల్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. చివర్లో శివమ్‌ దూబె (27; 16 బంతుల్లో 3×4,1×6) మెరుపులు మెరిపించాడు. దీంతో టీమ్‌ ఇండియా మంచి స్కోరు చేసింది. జడేజా (2), హార్దిక్‌ పాండ్య (5*) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. మార్కో యాన్సెన్, రబాడ చెరో వికెట్ తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని