t20 World Cup 2024: పొట్టి కప్పు విజేతగా భారత్‌.. వీళ్లనూ మరిచిపోవద్దు!

పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్‌ ఛాంపియన్‌గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు.

Published : 30 Jun 2024 18:15 IST

టీమ్‌ఇండియా పదకొండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. టీ20 ప్రపంచ కప్‌ను (T20 World Cup 2024) రెండోసారి గెలుచుకోవడంలో జట్టులోని ప్రతి ఒక్కరి శ్రమ ఉంది. హేమాహేమీ జట్లు తలపడే టోర్నీలో విజేతగా నిలవాలంటే ఏ ఒక్కరో.. ఇద్దరో రాణిస్తే చాలదు. పెద్ద టీమ్‌ను చూడగానే స్టార్ల పేర్లే గుర్తుకు రావడం సహజం. ఆ ప్లేయర్లు ఆడినా.. ఆడకపోయినా జట్టు గెలిస్తే వారే వార్తల్లో నిలుస్తుంటారు.

మ్యాచ్‌ పరిస్థితికి తగ్గట్టుగా ఫైనల్‌ 11లోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. కొందరిపై పెద్దగా అంచనాల్లేకుండానే అదరగొట్టేస్తారు. మ్యాచ్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటారు. ఇలాంటి వారినే ‘అన్‌సంగ్‌’ హీరోలుగా పిలుస్తుంటారు. భారత జట్టు (Team India) ఛాంపియన్‌గా నిలవడంలోనూ అలాంటి వారి కష్టం చాలా ఉంది. మరి వారెవరు..? ఏం సాధించారనేది తెలుసుకుందాం.. 

బుమ్రాకు సరైన ప్రత్యామ్నాయంగా అర్ష్‌దీప్‌!

టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన సమయంలో జస్‌ప్రీత్ బుమ్రాకు (Jasprit Bumrah) తోడుగా సిరాజ్‌, అర్ష్‌దీప్‌ను ఎంపిక చేశారు. కుర్రాడిని పక్కన పెట్టేసి సిరాజ్‌నే టోర్నీ మొత్తం ఆడిస్తారని అంతా భావించారు. రోహిత్‌ ‘మాస్టర్‌మైండ్‌’ మాత్రం అర్ష్‌దీప్‌కే (Arshdeep Singh) అవకాశం ఇవ్వమని చెప్పినట్లు ఉంది. అమెరికా పిచ్‌లపై ముగ్గురు స్పెషలిస్ట్‌ పేసర్లను బరిలోకి దించిన భారత్‌.. విండీస్‌కొచ్చేసరికి ఇద్దరినే తీసుకోవాల్సి వచ్చింది. ఎలానూ పేస్‌ ఆల్‌రౌండర్ హార్దిక్‌ ఉన్నాడు. దీంతో ఒక ఫాస్ట్‌బౌలర్‌ను పక్కన పెట్టి స్పిన్నర్‌ కుల్‌దీప్‌ను తీసుకొచ్చాడు కెప్టెన్. అనూహ్యంగా సిరాజ్‌ను తప్పించి.. యువ బౌలర్‌ను తీసుకున్నాడు. 

సారథి నమ్మకాన్ని పోనీయకుండా టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అర్ష్‌దీప్‌ (17) నిలిచాడు. ఫరూఖితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఫైనల్‌లోనూ 4 ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు తీశాడు. యూఎస్‌ఏపై నాలుగు వికెట్ల ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. సూపర్-8 ఆసీస్‌పై ‘రివెంజ్‌’ పోరులో 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని చావు దెబ్బ కొట్టాడు. 

తిరుగులేని రిషభ్‌ పంత్‌.. 

జాతీయ జట్టు తరఫున క్రికెట్ మ్యాచ్‌ ఆడి దాదాపు 15 నెలలైంది. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడిన రిషభ్‌ పంత్ (Rishabh Pant).. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ పునరాగమనం ఘనంగా జరిగింది. బ్యాటర్‌గానే కాకుండా కీపింగ్‌లోనూ అద్భుతమైన మెరుపులతో అదరగొట్టాడు. సెమీస్‌లో మొయిన్‌ అలీని స్టంపౌట్‌ చేయడం ఎప్పటికీ నిలిచిపోతుంది. అంత ఎత్తుగా లేచే బంతులను సైతం అందుకోవడానికి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. బ్యాటింగ్‌లో 8 మ్యాచులకుగాను 171 పరుగులు చేశాడు. ఫైనల్‌ మినహా.. మిగతా మ్యాచుల్లో వన్‌డౌన్‌లో వచ్చి విలువైన పరుగులు చేయడం గమనార్హం. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ భారత ఓపెనర్లలో ఎవరో ఒకరు త్వరగా పెవిలియన్‌కు చేరడం.. పంత్‌ వచ్చి దూకుడు కొనసాగించడం చూశాం. 

ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్

ఆల్‌రౌండర్‌ అనే ట్యాగ్‌లైన్‌తోనే అక్షర్ పటేల్ (Axar Patel) వరల్డ్‌ కప్‌ జట్టులోకి వచ్చాడు. ప్రతి మ్యాచ్‌లోనూ చోటు దక్కించుకొని.. భారత విజయాల్లో తన భాగస్వామ్యం ఉందంటూ నిరూపించాడు. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) పెద్దగా రాణించకపోయినా.. ఆ లోటును అక్షర్ అద్భుతంగా పూరించాడు. పాకిస్థాన్‌పై 20 పరుగులు చేసిన అక్షర్.. ఒక వికెట్‌ తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అఫ్గాన్‌పైనా ఆరు బంతుల్లో 12, ఇంగ్లాండ్‌పై 10 పరుగులతో పాటు డేంజరస్‌ బ్యాటర్లు బెయిర్‌స్టో, జోస్ బట్లర్, మొయిన్ అలీ వికెట్లను తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇప్పుడు ఫైనల్‌లోనూ 47 పరుగులు చేసి జట్టు మంచి స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 

ఫీల్డింగ్‌ వెనుక దిలీప్ టీమ్‌ కృషి

భారత జట్టు విజయంలో క్రికెటర్లు ఎంత ముఖ్య భూమిక పోషించారో.. తెర వెనుక ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) టీమ్‌ కూడా అదేవిధమైన బాధ్యతలను మోసింది. మరీ ముఖ్యంగా మెగా టోర్నీల్లో ఫీల్డింగ్‌ అత్యంత కీలకం. దీనిని గుర్తించిన బీసీసీఐ దిలీప్‌ను (T Dilip) ద్రవిడ్‌కు సహాయక ఫీల్డింగ్‌ కోచ్‌గా ఎంపిక చేసింది. కుర్రాళ్లతోపాటు సీనియర్లను ఎలా రాటుదేల్చాలో తెలిసిన నేర్పరి దిలీప్.

ప్రతి మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆ రోజు మైదానంలో ఎవరు అత్యుత్తమ ప్రదర్శన చేశారనే దానిని బేరీజు వేసి ‘బెస్ట్‌ ఫీల్డర్‌’ మెడల్‌ను అందజేయడం గత వన్డే ప్రపంచ కప్‌ నుంచి ప్రారంభించాడు. ఆ నిర్ణయం భారత జట్టులో పెను మార్పులే తీసుకొచ్చింది. అద్భుతమైన ఫీల్డింగ్‌తో కుర్రాళ్లతో సీనియర్లు పోటీపడిన సందర్భాలనూ మనం చూశాం. ఆసీస్‌పై అక్షర్‌ పటేల్.. ఫైనల్‌లో సూర్యకుమార్‌ యాదవ్ క్యాచ్ విన్యాసం చరిత్రలో నిలిచిపోతాయి. ప్రతి మ్యాచ్‌లోనూ దాదాపు 20 నుంచి 25 పరుగుల వరకు తన ఫీల్డింగ్‌తో రవీంద్ర జడేజా ఆపేశాడు.

భారత ఆటగాళ్లు ఫీల్డింగ్ మెరుపులు వెనుక దిలీప్‌తోపాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌ కృషి వెలకట్టలేనిది. త్రో స్పెషలిస్ట్‌లు రఘు, నువాన్‌తో కలిసి దిలీప్‌ ఆటగాళ్లకు సాన పెట్టాడు. క్రికెటర్‌గా మారదామని వచ్చిన దిలీప్‌ హైదరాబాద్‌ అండర్‌-25 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. బలమైన ఆర్థిక నేపథ్యమేమీ లేదు. పాఠశాల పిల్లలకు లెక్కల్లో ట్యూషన్లు చెబుతూ క్రికెట్‌ ఆడాడు. అండర్‌-25 జట్టుకు ఆడిన అనంతరం హెచ్‌సీఏ లీగ్స్‌లో క్లబ్‌ క్రికెట్‌ కొనసాగించాడు. ఐపీఎల్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ జట్టుకు సహాయక ఫీల్డింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఎన్‌సీఏలో పదేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని