T20 World Cup: ఈ కప్పెంతో ప్రత్యేకం

వన్డేల్లో కావచ్చు, టీ20ల్లో కావచ్చు.. ప్రపంచకప్‌ వస్తోందంటే అత్యంత భారీ అంచనాలతో బరిలోకి దిగే జట్టు భారతే. క్రికెట్‌ పిచ్చితో ఊగిపోయే మన అభిమానులు జట్టు మీద భారీ ఆశలే పెట్టుకుంటారు.

Updated : 30 Jun 2024 08:34 IST

వన్డేల్లో కావచ్చు, టీ20ల్లో కావచ్చు.. ప్రపంచకప్‌ వస్తోందంటే అత్యంత భారీ అంచనాలతో బరిలోకి దిగే జట్టు భారతే. క్రికెట్‌ పిచ్చితో ఊగిపోయే మన అభిమానులు జట్టు మీద భారీ ఆశలే పెట్టుకుంటారు. టీమ్‌ఇండియా కూడా టోర్నీని ఘనంగా ఆరంభించి కప్పు గెలిచేలాగే కనిపిస్తుంది. కానీ కీలక దశలో మన వాళ్లు చేతులెత్తేసి ఇంటిముఖం పట్టడం చాలాసార్లు అనుభవమే!

కానీ ఈసారి సాధించిన ప్రపంచకప్‌ విజయం మాత్రం భిన్నం. పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగి.. టోర్నీ ఆరంభ దశలో తడబడుతూ సాగి.. ఆపై అంచనాలను మించే ప్రదర్శనతో ఏకంగా కప్పు పట్టుకొచ్చేసింది రోహిత్‌ సేన. అందుకే ఈ విజయం ప్రత్యేకం.

ఈనాడు క్రీడావిభాగం

ఫార్మాట్లో అయినా ప్రపంచకప్‌ జరుగుతోందంటే.. విశ్లేషకులు, మీడియా దృష్టి మొత్తం టీమ్‌ఇండియా మీదే ఉంటుంది. భారత జట్టు అవకాశాలపై, టోర్నీలో ఎదురయ్యే అవరోధాలపై ఎడతెగని చర్చ జరుగుతుంది. కానీ అంచనాలను అందుకుంటూ భారత జట్టు కప్పు గెలిచింది సొంతగడ్డపై జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌లో మాత్రమే. ధోని సారథ్యంలో సచిన్‌ సహా దిగ్గజ ఆటగాళ్లతో నిండిన జట్టు భారీ అంచనాలను నిలబెట్టుకుంటూ కప్పు సాధించింది. అయితే 1983లో కపిల్‌ డెవిల్స్‌ వన్డే ప్రపంచకప్‌ గెలవడం, 2007లో ధోని బృందం పొట్టి కప్పును సొంతం చేసుకోవడం అనూహ్యం. ఆ రెండు సందర్భాల్లోనూ భారత జట్టుపై అసలు అంచనాలే లేవు. 1983లో గ్రూప్‌ దశ దాటితే గొప్ప అనుకున్న జట్టు కాస్తా భీకర వెస్టిండీస్‌ను ఓడించి కప్పే ఎగరేసుకుపోవడం పెను సంచలనం. ఇక 2007లో ధోని సారథ్యంలో జూనియర్లతో నిండిన జట్టు అప్పుడే మొదలైన పొట్టి కప్పులో అసాధారణ ప్రదర్శనతో టైటిల్‌ అందుకున్న వైనం చిరస్మరణీయం. ఆ తర్వాత ఏడు పర్యాయాలు పొట్టి కప్పులో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి ఏదో ఒక దశలో బోల్తా కొట్టింది టీమ్‌ఇండియా. నిరుడు వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో ఫైనల్‌ చేరిన రోహిత్‌సేనను ఆస్ట్రేలియా గట్టి దెబ్బ కొట్టింది. ఆ ఓటమి తర్వాత అభిమానుల్లో ఒక రకమైన నైరాశ్యం అలుముకుంది. ఈ నేపథ్యంలోనే ఏడు నెలల వ్యవధిలో మొదలైన టీ20 ప్రపంచకప్‌లో జట్టు మీద ఎక్కువ ఆశలు పెట్టుకోలేదు.

సందడే లేదు: భారత కాలమానానికి విరుద్ధమైన సమయాల్లో మ్యాచ్‌లు జరగడంవల్ల వెస్టిండీస్‌లో సిరీస్‌ అన్నా, ప్రపంచకప్‌ అన్నా మన అభిమానులకు పెద్దగా ఆసక్తి ఉండదు. అక్కడ జరిగిన 2007 వన్డే, 2009 టీ20 ప్రపంచకప్‌లను భారత అభిమానులు గుర్తుంచుకోరు. వాటిలో భారత్‌ ప్రదర్శన కూడా పేలవం. ఈసారి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌ను ఆరంభ దశలో మన అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. మనకు అనుకూలం కాని వేళలు, స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లు, వర్షం అంతరాయాలతో గ్రూప్‌ దశ మన అభిమానుల్లో ఏమాత్రం ఆసక్తి రేకెత్తించలేకపోయింది. గ్రూప్‌ దశ వరకు టీమ్‌ఇండియా మ్యాచ్‌లకు కూడా ఆశించిన ఆదరణ లేకపోయింది. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు సైతం ఎప్పుడూ ఉండే యుఫోరియా ఈసారి కనిపించకపోవడం గమనార్హం.

అంతా రివర్స్‌: గతేడాది వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ జైత్రయాత్ర ఎలా సాగిందో తెలిసిందే. కానీ ఫైనల్లోకి వచ్చేసరికి అంచనాలకు తగని ఆటతో కప్పును ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. అంతకుముందు కూడా ఐసీసీ టోర్నీల్లో చాలాసార్లు ఇలాగే జరిగింది. కానీ ఈసారి  అంతా రివర్స్‌. టోర్నీ మొదలయ్యేటప్పటికీ రోహిత్‌సేన మీద పెద్దగా అంచనాలు లేవు. జట్టులో సమస్యలు కనిపించాయి. హార్దిక్‌ ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. జడేజా ఫామ్‌లో లేడు. బుమ్రా మినహా ఏ బౌలర్‌ మీదా నమ్మకాల్లేవు. మొత్తంగా ఇది ప్రపంచకప్‌ గెలిచే జట్టులా కనిపించలేదు. దీంతో అభిమానుల్లో అంచనాలు తక్కువగానే కనిపించాయి. గ్రూప్‌ దశలో భారత్‌ ఉత్తమ ప్రదర్శన చేయలేకపోయింది. పాకిస్థాన్‌ మీద 119 పరుగులకే పరిమితమై అతి కష్టం మీద గెలిచింది. అమెరికా మీద నెగ్గడానికి కూడా చెమటోడ్చింది. దీంతో రోహిత్‌సేనపై అంచనాలు ఇంకా తగ్గిపోయాయి. అయితే సూపర్‌-8 నుంచి టీమ్‌ఇండియా జూలు విదల్చడం మొదలుపెట్టింది. అఫ్గాన్, బంగ్లాదేశ్‌లనే కాదు.. ఆస్ట్రేలియానూ సునాయాసంగా ఓడించింది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. నిరుడు వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో కన్నీళ్లు పెట్టించిన ఆస్ట్రేలియాను, 2022 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో పరాభవం మిగిల్చిన ఇంగ్లాండ్‌ను ఓడించి ఇంటిముఖం పట్టించడం భారత అభిమానులకు మామూలు కిక్‌ ఇవ్వలేదు. దీంతో ఉద్వేగం మళ్లీ పతాక స్థాయికి చేరుకుంది. జట్టు మీద ఆశలు పెరిగాయి. కప్పు మీదికి దృష్టి మళ్లింది. ఇప్పుడు ఫైనల్లోనూ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలను ఓడించి విజేతగా నిలవడంతో ఈ కప్పు విలువ పెరిగింది.

ఊహించని హీరోలు: ఈ ప్రపంచకప్‌లో ఇంకో విశేషం ఏంటంటే.. ఎక్కువ అంచనాలున్న కొందరు ఆటగాళ్లు విఫలమైతే, ఎవ్వరూ ఊహించని ఆటగాళ్లు కొందరు హీరోలుగా మారారు. కోహ్లి ఫైనల్లో కీలక ఇన్నింగ్స్‌ మినహా చాలా మ్యాచ్‌లలో నిరాశపరిచాడు. మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరున్న రవీంద్ర జడేజా టోర్నీపై తనదైన ముద్ర వేయలేకపోయాడు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌ల మీదా తేలిపోయాడు. నెమ్మదైన ఈ పిచ్‌లపై స్ట్రోక్‌ ప్లేను ఇష్టపడే రోహిత్‌ శర్మ నిలవలేడని అనుకుంటే అతను గొప్పగా రాణించాడు. ఇక ఐపీఎల్‌లో తీవ్రంగా తడబడ్డ హార్దిక్‌ పాండ్య.. ప్రపంచకప్‌కు వచ్చేసరికి భిన్నంగా మారిపోయాడు. బ్యాటుతో, బంతితో అదరగొట్టాడు. గ్రూప్‌ దశలో తుది జట్టులో చోటే దక్కని కుల్‌దీప్‌ యాదవ్‌.. సూపర్‌-8 నుంచి అవకాశం దక్కించుకుని గొప్ప ప్రదర్శన చేశాడు. అక్షర్‌ పటేల్‌ సైతం అంచనాలను మించి రాణించాడు. అనుకోకుండా ప్రపంచకప్‌లో అవకాశం దక్కించుకున్న పేసర్‌ అర్ష్‌దీప్‌ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలవడం కూడా అనూహ్యమే.

17

టీ20 ప్రపంచకప్‌లో అర్ష్‌దీప్‌ తీసిన వికెట్లు. అఫ్గానిస్థాన్‌ పేసర్‌ ఫజల్‌హక్‌ ఫారూఖీతో కలిసి అతను ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాడు. ఒకే టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల రికార్డును వీళ్లు పంచుకున్నారు. 

176

ఫైనల్లో భారత్‌ స్కోరు. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. గత రికార్డు (2021లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 173) బద్దలైంది. 

‘‘గత మూడు నాలుగేళ్లుగా పడిన శ్రమని మాటల్లో చెప్పలేను. గతంలో చాలాసార్లు తీవ్రమైన ఒత్తిడి మ్యాచ్‌లు ఆడినా.. ప్రతిసారీ పరాజయం వైపే నిలిచాం. ఒత్తిడి ఉన్నప్పుడు ఏం చేయాలో మా ఆటగాళ్లకు అర్థమైంది. కోహ్లి ఫామ్‌పై ఎవరికి అనుమానాలు లేవు. గత 15 ఏళ్లుగా అతడు అమూల్యమైన సేవలు అందించాడు.  మా జట్టును చూసి గర్వపడుతున్నా’’

రోహిత్‌శర్మ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని