T20 world cup: మలుపు తిరిగిందిలా..

విధ్వంసకారుడు క్లాసెన్‌ మామూలు ఊపులో లేడు. అవతల మరో మెరుపు వీరుడు మిల్లర్‌ ఉన్నాడు. చేతిలో 6 వికెట్లున్నాయి. 30 బంతుల్లో చేయాల్సింది 30 పరుగులే. ఆ స్థితిలో దక్షిణాఫ్రికా శిబిరంలో విజయోత్సాహం.

Updated : 30 Jun 2024 07:07 IST

విధ్వంసకారుడు క్లాసెన్‌ మామూలు ఊపులో లేడు. అవతల మరో మెరుపు వీరుడు మిల్లర్‌ ఉన్నాడు. చేతిలో 6 వికెట్లున్నాయి. 30 బంతుల్లో చేయాల్సింది 30 పరుగులే. ఆ స్థితిలో దక్షిణాఫ్రికా శిబిరంలో విజయోత్సాహం. భారత ఆటగాళ్లలో నిరాశ. కానీ అసాధ్యం అనుకున్న దాన్ని రోహిత్‌ సేన అందుకుంది. అమోఘమైన బౌలింగ్‌తో చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. ఆశలు పూర్తిగా సన్నగిల్లిన స్థితిలో 16వ ఓవర్లో బుమ్రా.. అత్యద్భుతంగా బౌలింగ్‌ చేసి 4 పరుగులే ఇచ్చి పట్టపగ్గాల్లేకుండా సాగిపోతున్న స్కోరు బోర్డుకు కళ్లెం వేశాడు. తర్వాత హార్దిక్‌ బంతి అందుకున్నాడు. 17వ ఓవర్‌ తొలి బంతికి క్లాసెన్‌ ఔటైపోయాడు. ఈ ఓవర్లో కూడా 4 పరుగులే వచ్చాయి. సమీకరణం 3 ఓవర్లలో 22గా మారడంతో గెలుపు ద్వారాలు తెరుచుకుంటున్నాయా అనిపించింది. ఆ దశలో రోహిత్‌.. బుమ్రాకు బంతి అప్పగించాడు. అతడు తీవ్ర ఉత్కంఠలో అత్యద్భుతంగా బౌలింగ్‌ చేసి దక్షిణాఫ్రికాను మరింత ఒత్తిడిలోకి నెట్టేశాడు. యాన్సెన్‌ (2)ను బౌల్డ్‌ చేయడమే కాక ఈ ఓవర్లో కేవలం 2 పరుగులే ఇచ్చాడు. 2 ఓవర్లలో 20 పరుగులు చేయాల్సి రావడంతో ఆశలు రెట్టింపయ్యాయి. 19వ ఓవర్లో అర్ష్‌దీప్‌ బౌలింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్లో 4 పరుగులే రావడంతో మ్యాచ్‌ భారత్‌ వైపు మొగ్గినట్లే అనిపించింది. 6 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన దశలో.. మిల్లర్‌ భారీ షాట్‌ ఆడగా.. బౌండరీ వద్ద సూర్య అత్యద్భుత క్యాచ్‌ను అందుకోవడంతో ప్రపంచకప్‌ చేతుల్లోకి వచ్చేసిన భావన. రెండో బంతికి రబాడ ఫోర్‌ కొట్టడంతో మళ్లీ టెన్షన్‌. కానీ తర్వాత హార్దిక్‌ కట్టుదిట్టంగా బంతులేయడంతో 2 బంతుల్లో 3 పరుగులే వచ్చాయి. 2 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన స్థితిలో అయిదో బంతికి రబాడ ఔటైపోవడంతో ఉత్కంఠకు తెరపడింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని