IND vs SA: వదలొద్దు ఇండియా

టీ20 ప్రపంచకప్‌లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారమే అంతిమ సమరం. అజేయంగా ఫైనల్‌ చేరిన రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.

Updated : 29 Jun 2024 04:36 IST

రోహిత్‌సేనకు సువర్ణావకాశం
నేడే దక్షిణాఫ్రికాతో ఫైనల్‌
రాత్రి 8 నుంచి

గాయం ఇంకా మానలేదు. వేదన ఇంకా తీరలేదు!
ఏడు నెలల కిందట అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగు పెట్టి.. కంగారూలు కొట్టిన దెబ్బతో త్రుటిలో టైటిల్‌కు దూరమైన రోహిత్‌సేనను చూసి కళ్లు తడి కాని భారత అభిమాని లేడు.
ఇప్పుడు ఊహించని విధంగా ఆ గాయానికి మందేసే అవకాశం వచ్చింది. వేదన తీరే మార్గం కనిపిస్తోంది. అదిగదిగో పొట్టి కప్పు..!
17 ఏళ్ల కిందట ఊహించని విధంగా ధోనీసేన ఒళ్లో వాలి, తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా దొరకని ట్రోఫీ.. ఇప్పుడు రోహిత్‌సేనను ఊరిస్తోంది.
నిరుడు అహ్మదాబాద్‌లో గుండెకోత మిగిల్చిన ఆస్ట్రేలియాను ఇంటికి పంపించేశాం. అంతకుముందేడాది పొట్టి కప్పులో పరాభవం మిగిల్చిన ఇంగ్లాండ్‌నూ దెబ్బకు దెబ్బ తీశాం. ఇక సఫారీ జట్టును మట్టికరిపించేస్తే మనదే కప్పు.
పై రెండు జట్లతో పోలిస్తే దక్షిణాఫ్రికా అంత ప్రమాదకరంగా అనిపించకపోవచ్చు. ఇప్పటిదాకా ప్రపంచకప్‌ గెలవని, కీలక దశల్లో ఒత్తిడికి చిత్తయ్యే ఆ జట్టు చరిత్ర మన విజయంపై ధీమాను పెంచవచ్చు.
కానీ మనలాగే అపజయం లేకుండా ఫైనల్‌కు వచ్చిన ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకుంటే కష్టం. ఈ ఒక్క రోజు రోహిత్‌సేన పంతం పట్టి ఆడితే, స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్‌పై త్రివర్ణ పతాకం రెపరెపలాడడం ఖాయం.

బ్రిడ్జ్‌టౌన్‌ (బార్బడోస్‌)

టీ20 ప్రపంచకప్‌లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారమే అంతిమ సమరం. అజేయంగా ఫైనల్‌ చేరిన రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌లో అనూహ్యంగా విజేతగా నిలిచిన భారత్‌.. రెండోసారి పొట్టి కప్పును ఒడిసిపట్టాలని పట్టుదలతో ఉంది. ఇక వన్డేల్లో కానీ, టీ20ల్లో కానీ దక్షిణాఫ్రికా ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి. టైటిల్‌ గెలవడానికి లేక లేక వచ్చిన ఈ అవకాశాన్ని వదులకోకూడదని సఫారీ జట్టు చూస్తోంది. మరి బ్రిడ్జ్‌టౌన్‌ మైదానంలో ఎవరు పైచేయి సాధిస్తారు? భారత్‌ ఖాతాలో రెండో టీ20 ప్రపంచకప్‌ చేరుతుందా? దక్షిణాఫ్రికా దశాబ్దాల ప్రపంచకప్‌ కలను నెరవేర్చుకుంటుందా? అన్నది చూడాలి. 

కోహ్లి ఇప్పుడైనా..?: ఐపీఎల్‌లో సూపర్‌ ఫామ్‌తో టీ20 ప్రపంచకప్‌లో అడుగు పెట్టాడు విరాట్‌ కోహ్లి. భారత జట్టులోని బ్యాటర్లలో అత్యధిక అంచనాలున్నదీ అతడి మీదే. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో నిలిచే కోహ్లి.. బౌలర్లకు అనుకూలించే పిచ్‌లపై సత్తా చాటి తన ప్రత్యేకతను చాటుతాడని అభిమానులు ఆశించారు. కానీ ఆశ్చర్యకరంగా టోర్నీలో అతను తీవ్రంగా నిరాశపరిచాడు. సూపర్‌-8లో బంగ్లాదేశ్‌పై చేసిన 37 పరుగులను మినహాయిస్తే.. అన్ని మ్యాచ్‌ల్లోనూ నిరాశపరిచాడు. ఇంగ్లాండ్‌తో సెమీస్‌లోనూ 9 పరుగులకే వెనుదిరిగాడు. అతను ఫైనల్లో అయినా తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌తో జట్టు కప్పు అందుకోవడంలో కీలక పాత్ర పోషించాలని అభిమానుల ఆశ.

వాళ్లంతా ఆడితే..

టోర్నీలో టీమ్‌ఇండియా సమష్టి ప్రదర్శనతో ఫైనల్‌ చేరింది. బౌలింగ్‌ ఉత్తమంగా సాగడమే భారత్‌ జైత్రయాత్రకు ప్రధాన కారణం. బుమ్రా ప్రతి మ్యాచ్‌లోనూ పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాక.. కీలక వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థి జట్లకు కళ్లెం వేశాడు. పాకిస్థాన్‌పై 120 పరుగుల లక్ష్యాన్ని నిలిపి కూడా భారత్‌ గెలిచిందంటే బుమ్రానే కారణం. సూపర్‌-8, సెమీస్‌లోనూ బుమ్రా మెరిశాడు. అతను 7 మ్యాచ్‌ల్లో 8.15 సగటుతో 13 వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్‌ పరుగులిచ్చినా ఎక్కువ వికెట్లు (15) తీశాడు. ఇక స్పిన్నర్‌ కుల్‌దీప్‌.. సూపర్‌-8 నుంచి తుది జట్టులోకి వచ్చి ప్రతి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అక్షర్‌ సైతం టోర్నీలో నిలకడగా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పింది అతనే. ఇక బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో సూపర్‌-8 మ్యాచ్‌లో, సెమీస్‌లో అతను మెరుపు అర్ధశతకాలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్, హార్దిక్‌ పాండ్య, పంత్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రెండు మ్యాచ్‌ల్లో శివమ్‌ దూబె కూడా ఆకట్టుకున్నాడు. వీళ్లంతా ఫైనల్లోనూ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. కోహ్లి, జడేజా మాత్రమే టోర్నీలో అంచనాలను అందుకోలేకపోయారు. వాళ్లు కూడా జోరందుకుంటే కప్పు గెలవడం కష్టమేమీ కాదు.

రెండూ అజేయమే..

ఈ ప్రపంచకప్‌లో రెండు ఉత్తమ జట్లే ఫైనల్లో తలపడబోతున్నాయని చెప్పొచ్చు. ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికా.. రెండూ అజేయంగానే ఫైనల్‌ చేరాయి. భారత్‌ గ్రూప్‌ దశలో ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాలను ఓడించగా.. కెనడాతో మ్యాచ్‌ రద్దయింది. గ్రూప్‌లో భారత్‌దే అగ్రస్థానం. సూపర్‌-8లో భారత్‌ అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. అక్కడా అగ్రస్థానమే దక్కింది. సెమీస్‌లో రోహిత్‌సేన ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఇక దక్షిణాఫ్రికా గ్రూప్‌ దశలో శ్రీలంక, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, నేపాల్‌లపై విజయం సాధించింది. సూపర్‌-8లో అమెరికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లను ఓడించిన సఫారీ జట్టు.. సెమీస్‌లో అఫ్గానిస్థాన్‌ను మట్టికరిపించింది. పాకిస్థాన్‌తో మినహా అన్ని మ్యాచ్‌ల్లో భారత్‌ సునాయాసంగా గెలవగా.. దక్షిణాఫ్రికా మాత్రం బంగ్లాదేశ్, నేపాల్‌లపైనా చచ్చీ చెడీ గెలిచింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోనూ ఓటమి కోరల్లోంచి పుంజుకుని నెగ్గింది.

రిజర్వ్‌ డే ఉంది..

ఈ ప్రపంచకప్‌లో బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో పిచ్‌ బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సహకరించింది. టోర్నీలో సమతూకం ఉన్న పిచ్‌ల్లో ఇదొకటి. అమెరికా, ఒమన్‌ లాంటి చిన్న జట్లు తప్ప.. అన్నీ మెరుగైన స్కోర్లే సాధించాయి. ఇంగ్లాండ్‌పై గ్రూప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 201 పరుగులు చేయగలిగింది. ఆరంభంలో పేసర్లను కాచుకోవడం కీలకం. తర్వాత స్పిన్నర్లు ప్రభావం చూపుతారు. బ్యాటర్లు కుదురుకుంటే పరుగులు చేయొచ్చు. టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపొచ్చు. మ్యాచ్‌కు కొంత మేర వర్షం ముప్పు ఉంది. కానీ మ్యాచ్‌ రద్దయ్యే స్థాయిలో వర్షం పడకపోవచ్చు. శనివారం మ్యాచ్‌ జరగకపోయినా తర్వాతి రోజు రిజర్వ్‌ డే ఉంది. అప్పుడూ మ్యాచ్‌ జరక్కపోతే ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. 

ముప్పు వీళ్లతోనే..

దక్షిణాఫ్రికా గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత బలంగా, సమతూకంతో కనిపిస్తోంది. ఆ జట్టు ఒకరిద్దరి మీద ఆధారపడకుండా సమష్టిగా సత్తా చాటి ఫైనల్‌కు వచ్చింది. టోర్నీలో ఆ జట్టుదే ఉత్తమ బౌలింగ్‌ విభాగం! మధ్యలో కొంచెం ప్రభావం తగ్గినట్లు కనిపించిన రబాడ.. ఈ టోర్నీలో అదరగొట్టాడు. 8 మ్యాచ్‌ల్లో 13.25 సగటుతో 12 వికెట్లు తీశాడు. మరో పేసర్‌ నోకియా (13 వికెట్లు) సైతం అదరగొట్టాడు. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ భారత్‌పై చాలా మ్యాచ్‌లు ఆడిన వీళ్లిద్దరికీ భారత బ్యాటర్ల బలహీనతలపై బాగానే అవగాహన ఉంది. ఇక టోర్నీలో 4 మ్యాచ్‌లే ఆడి 11 వికెట్లు తీసిన షంసితోనూ ముప్పు పొంచి ఉంది. బ్యాటింగ్‌లో డికాక్‌ ఎంత ప్రమాదకారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టోర్నీలో అతను సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. మెరుపు ఇన్నింగ్స్‌లతో నిమిషాల్లో మ్యాచ్‌ గమనాన్ని మార్చేసే ఈ ఓపెనర్‌ను వీలైనంత త్వరగా పెవిలియన్‌ చేర్చాలి. ఇక క్లాసెన్, మిల్లర్‌ కుదురుకుంటే ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో తెలిసిందే. బౌలింగ్‌లో కేశవ్‌ మహరాజ్, యాన్సెన్‌.. బ్యాటింగ్‌లో మార్‌క్రమ్, స్టబ్స్‌ కూడా దక్షిణాఫ్రికాకు కీలకమే.

ఆ ముగ్గురి ముగింపు!

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిలకు ఇదే చివరి టీ20 ప్రపంచకప్‌ అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో కప్పుతో వాళ్లిద్దరూ వీడ్కోలు పలకాలని అభిమానులు ఆశిస్తున్నారు. రాహుల్‌ ద్రవిడ్‌కు కూడా టీమ్‌ఇండియా కోచ్‌గా ఇదే చివరి మ్యాచ్‌. ఆటగాడిగా, కోచ్‌గా ఇప్పటిదాకా ప్రపంచకప్‌ కలను నెరవేర్చుకోలేకపోయిన రాహుల్‌ ద్రవిడ్‌ కూడా కప్పుతో తన పదవికి వీడ్కోలు పలకాలన్నది అభిమానుల కోరిక.

తుది జట్లు (అంచనా)... 

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), కోహ్లి, పంత్, సూర్యకుమార్, దూబె, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్‌దీప్, అర్ష్‌దీప్, బుమ్రా 

దక్షిణాఫ్రికా: డికాక్, రీజా హెండ్రిక్స్, మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, కేశవ్‌ మహరాజ్, రబాడ, నోకియా, షంసి.

స్పిన్‌ యుద్ధంలో గెలిచేదెవరు?

ఈ ప్రపంచకప్‌లో సూపర్‌-8 దశ నుంచి స్పిన్నర్ల ఆధిపత్యం సాగుతోంది. భారత్, దక్షిణాఫ్రికా జట్లు రెండూ స్పిన్‌ ఆయుధంతోనే ప్రత్యర్థులను దెబ్బ కొట్టాయి. భారత స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ ప్రత్యర్థులకు పెద్ద ముప్పుగా మారాడు. అక్షర్‌ పటేల్‌ కూడా ప్రభావవంతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. వీరికి తోడు జడేజా కూడా ఉన్నాడు. స్పిన్‌ను బాగా ఆడే డికాక్, క్లాసెన్, మార్‌క్రమ్‌లను వీరెలా నియత్రిస్తారో చూడాలి. దక్షిణాఫ్రికా జట్టులో షంసి, కేశవ్‌ మహరాజ్‌ కూడా అదరగొడుతున్నారు. కెప్టెన్‌ మార్‌క్రమ్‌ కూడా పార్ట్‌ టైం స్పిన్‌తో జట్టుకు ఉపయోగపడుతున్నాడు. భారత బ్యాటర్లందరూ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగల వారే. ముఖ్యంగా మిడిలార్డర్లో దూబె, హార్దిక్‌ స్పిన్నర్లపై ఆధిపత్యం చలాయించడం కీలకం. స్పిన్‌ యుద్ధంలో గెలిచే జట్టే ప్రపంచకప్‌నూ అందుకునే అవకాశాలున్నాయి.

కోహ్లి నాణ్యమైన ఆటగాడు. ప్రతి ఆటగాడికీ ఇబ్బందికర దశ ఒకటుంటుంది. తన స్థాయి మాకు తెలుసు. కీలక మ్యాచ్‌ల్లో తన ప్రాధాన్యం తెలుసు. 15 ఏళ్లుగా ఉత్తమ క్రికెట్‌ ఆడుతున్న వ్యక్తికి ఫామ్‌ అనేది సమస్య కాదు. అతను సరైన స్థితిలోనే ఉన్నాడు. ప్రపంచకప్‌ కోసం తన ఉత్తమ ఆటను దాచుకున్నాడని అనుకుంటున్నాం. ప్రపంచకప్‌లో పరిస్థితులు సవాలు విసిరేవే. వాటికి  బాగా అలవాటు పడ్డాం. ఇప్పటిదాకా అంతా బాగా సాగింది. ఫైనల్లోనూ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తామని ఆశిస్తున్నా.

రోహిత్‌ శర్మ 

ట్టు చక్కటి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నా. అంతే తప్ప నా కోసమో, మరొకరి కోసమో గెలవాలని అనుకోను. అది నా నైజం కాదు. ‘ఒక వ్యక్తి కోసం గెలవాలి’ అనే మాటకే నేను వ్యతిరేకం. ఒక వ్యక్తిని ఎవరెస్టు ఎందుకు ఎక్కాలనుకుంటున్నావు అని అడిగితే.. ‘అది అక్కడుంది కాబట్టి’ అన్నాడట. అలాగే ప్రపంచకప్‌ అనేది ఒకటుంది కాబట్టి దాన్ని గెలవాలని భావిస్తా. ఎవరి కోసమో కాదు.

రాహుల్‌ ద్రవిడ్, టీమ్‌ఇండియా కోచ్‌

  • టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌ ఆడడం ఇది మూడోసారి. 2007లో తొలి కప్పులోనే టైటిల్‌ గెలిచిన భారత్‌.. 2014లో ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా వన్డేల్లో అయినా, టీ20ల్లో అయినా ఫైనల్‌ ఆడనుండడం ఇదే తొలిసారి.

15

టోర్నీలో అర్ష్‌దీప్‌ వికెట్లు. తుది పోరులో ముగ్గురిని ఔట్‌ చేస్తే ఫారూఖీ (17)ను దాటి అత్యధిక వికెట్ల వీరుడవుతాడు.

248

ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌ పరుగులు. ఫైనల్లో 34 పరుగులు చేస్తే.. గుర్బాజ్‌ (281)ను అధిగమించి టాప్‌స్కోరర్‌ అవుతాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని