Sarfaraz Khan: సూర్య ఆ మెసేజ్‌ చేయకపోయి ఉంటే..: సర్ఫరాజ్‌ తండ్రి

Sarfaraz Khan: టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వల్లే తన కుమారుడి అరంగేట్రం క్షణాలను ప్రత్యక్షంగా చూడగలిగానని అంటున్నాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రి. ఇంతకీ సూర్య ఏం చేశాడంటే..?

Updated : 16 Feb 2024 10:37 IST

రాజ్‌కోట్‌: సుదీర్ఘ నిరీక్షణ ఫలించి ఎట్టకేలకు మిడిలార్డర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ (Sarfaraz Khan) అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి అడుగు వేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ (IND vs ENG)తో అరంగేట్రం చేశాడు. తొలి రోజు టాస్‌కు ముందు టీమ్‌ ఇండియా క్యాప్‌ అందుకునే సమయంలో అతడి కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. అయితే, బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) వల్లే తన కుమారుడి అరంగేట్రాన్ని ప్రత్యక్షంగా చూశానని అంటున్నారు సర్ఫరాజ్‌ తండ్రి నౌషద్‌ ఖాన్‌. అతడి మెసేజ్‌ వల్లే తాను రాజ్‌కోట్‌కు వచ్చానని చెప్పారు.

‘‘నేను మ్యాచ్‌కు వస్తే సర్ఫరాజ్‌ ఒకింత ఒత్తిడికి లోనవుతాడని అనిపించింది. దీనికి తోడు ఆరోగ్యం కూడా సహకరించలేదు. అందుకే రాకూడదని నిర్ణయించుకున్నారు. కానీ, సూర్య పంపించిన మెసేజ్‌తో నా మనసు కరిగింది. ‘మీ ఉద్వేగాన్ని నేను అర్థం చేసుకోగలను. నేను టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పుడు మా అమ్మానాన్న నా వెనుకే ఉన్నారు. ఆ క్షణం ఎంతో ప్రత్యేకం. అలాంటివి మళ్లీ మళ్లీ రావు. అందుకే మీరు మ్యాచ్‌కు వెళ్తే బాగుంటుందని నా సలహా’ అని సూర్య మెసేజ్‌ పంపాడు’’ అని నౌషద్‌ ఖాన్‌ తెలిపారు. అది చూడగానే తాను ఆగలేకపోయానన్నారు. తక్షణమే రాజ్‌కోట్‌కు బయల్దేరానని చెప్పారు.

దూకుడుగా ఆడే సమయంలో రనౌట్.. స్పందించిన సర్ఫరాజ్‌

భారత దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే నుంచి సర్ఫరాజ్‌ టోపీ అందుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సర్ఫరాజ్‌ భార్య, తండ్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నౌషద్‌ ఆ టోపీని తీసుకుని ముద్దాడాడు. తండ్రిని హత్తుకుని సర్ఫరాజ్‌ ఆనందాన్ని పంచుకున్నాడు. అనంతరం భార్య కన్నీళ్లను తుడిచాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని