ICC Rankings: సూర్య కంటే 2 పాయింట్లే ఎక్కువ.. అగ్రస్థానంలోకి ఆస్ట్రేలియా ఓపెనర్

ఒక్క ఇన్నింగ్స్‌తో ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా బ్యాటర్ అగ్రస్థానం సాధించాడు. గతేడాది డిసెంబర్‌ నుంచి ఆ స్థానంలో ఉన్న సూర్యకుమార్‌ కాస్త ఒక ర్యాంక్‌ కిందికి పడిపోయాడు.

Updated : 26 Jun 2024 15:09 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) భారత్‌పై అర్ధశతకం సాధించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ ఓ ఘనత సాధించాడు. తన జట్టు సెమీస్‌కు చేరడంలో విఫలమైనప్పటికీ తను మాత్రం ఐసీసీ ర్యాంకుల్లో టాప్‌నకు చేరాడు. దాదాపు ఏడు నెలల నుంచి ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ను (Suryakumar Yadav) హెడ్‌ వెనక్కి నెట్టాడు. వీరిద్దరికి కేవలం 2 పాయింట్లు మాత్రమే వ్యత్యాసం ఉండటం గమనార్హం. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ 844 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్‌ యాదవ్ 842 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. వీరిద్దరి తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్‌ సాల్ట్ (816), బాబర్ అజామ్ (755), మహమ్మద్ రిజ్వాన్ (746) తర్వాత ర్యాంకుల్లో నిలిచారు. టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు భారత్ చేరిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సూర్య రాణిస్తే మళ్లీ అగ్రస్థానంలోకి రావడం పెద్ద కష్టమేం కాదు. ఆసీస్‌పై కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు సాధించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. రోహిత్ (527) 13 స్థానాలను ఎగబాకి 38వ ర్యాంకులో నిలిచాడు.

కుల్‌దీప్‌ 20.. బుమ్రా 44 స్థానాలు ఎగబాకి

ఐసీసీ టీ20 ర్యాంకుల్లో భారత్‌ తరఫున అక్షర్ పటేల్ ఒక్కడే టాప్‌-10లో ఉన్నాడు. ప్రస్తుతం అతడు 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆడిన మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన చేసిన కుల్‌దీప్‌ యాదవ్ (641) ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరాడు. పొట్టి కప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ (621) 17వ స్థానంలో నిలిచాడు. ఇక స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఏకంగా 44 స్థానాలను మెరుగుపర్చుకోవడం గమనార్హం. దీంతో బుమ్రా (589) 24వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని