IND vs SA: అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్

టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకొనేందుకు చక్కటి అవకాశం టీమ్‌ఇండియా ముంగిట ఉంది. తుది పోరులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి కప్‌ సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Published : 29 Jun 2024 10:31 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) భారత్‌ ఫైనల్‌కు చేరింది. దక్షిణాఫ్రికాతో ఇవాళ టైటిల్‌ కోసం తలపడేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు బ్యాటింగ్‌లో ఇద్దరు ప్లేయర్లు మాత్రం రాణించలేదు. అందులో ఒకరు విరాట్ కోహ్లీ కాగా.. మరొకరు స్టార్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. ఫైనల్‌లోనైనా కోహ్లీ నుంచి మంచి ఇన్నింగ్స్‌ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. జడేజా విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. జట్టులో అతడి ప్లేస్‌ను కూడా ప్రశ్నించాల్సిన అవసరం లేదని పేర్కొనడం గమనార్హం. బ్యాటింగ్‌లో ఎక్కువ పరుగులు చేయకపోయినా.. వికెట్లు తీస్తున్నాడని చెప్పాడు. మరీ ముఖ్యంగా ఫీల్డింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపిస్తున్నాడని ప్రశంసించాడు.

‘‘నేనెప్పుడూ జడేజా (Ravindra Jadeja) విషయంలో ఆందోళన చెందను. అతడి అనుభవం అలాంటిది. ఎప్పుడు అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడానికి ముందుంటాడు. మైదానంలో కనీసం 20 లేదా 30 పరుగులను కాపాడతాడని గుర్తుంచుకోవాలి. మెరుపు ఫీల్డింగ్‌తో క్యాచ్‌లు, రనౌట్‌లు చేస్తాడు. అతడు ఆపే రన్స్‌ అత్యంత కీలకం. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో రాణిస్తే అదనపు విలువ తీసుకొచ్చినట్లే. అందుకే, జట్టులో అతడి స్థానంపై ప్రశ్నించడంపైనా ఆలోచించలేం’’ అని గావస్కర్ తెలిపాడు.

కాసేపు క్రీజ్‌లో గడపాలి: కోహ్లీకి రవిశాస్త్రి సూచన

‘‘సీనియర్ ప్లేయర్‌ విరాట్ కోహ్లీకి (Virat Kohli) ఒకటే సూచన చేస్తున్నా. ఒకవైపు క్రీజ్‌లో రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నప్పుడు.. విరాట్ కాస్త సమయం తీసుకొనేందుకు అవకాశం ఉంటుంది. క్రీజ్‌లో కుదురుకునేందుకు ప్రయత్నిస్తే చాలు. ఆ తర్వాత బౌలర్లే ఒత్తిడికి గురవుతారు. ఒక్కసారి రిథమ్‌లోకి వచ్చాడంటే కోహ్లీని ఆపడం కష్టం. గత దశాబ్దానికి పైగా ఎలా ఆడాడో.. మరోసారి అదేతరహాలో భారీ ఇన్నింగ్స్‌ ఆడితే అంతా సెట్‌ అవుతుంది’’ అని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి (ravi Shatri) సూచించాడు.

కోహ్లీ ఇది బెంగళూరు పిచ్‌ అనుకుంటున్నాడేమో: లతీఫ్‌

‘‘ప్రపంచ కప్‌ జరుగుతున్న విండీస్‌, అమెరికా పిచ్‌లకు, బెంగళూరు మైదానానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ బంతిని బాదడం చాలా కష్టం. బ్యాటర్లకు సవాల్‌ ఎదురవుతుంది. విరాట్ విఫలమవుతున్నప్పటికీ.. ఆ ప్రభావం జట్టుపై లేకుండా చేయడంలో రోహిత్ శర్మ సక్సెస్ అవుతున్నాడు’’ అని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని