IND vs AFG: రోహిత్‌ శర్మ ఔట్.. అది బలహీనత కాదు: గావస్కర్

రోహిత్ శర్మ ఫామ్‌పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తూ త్వరగా వికెట్‌ను సమర్పించేస్తున్నాడు. ఈ క్రమంలో సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Updated : 21 Jun 2024 12:37 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ సూపర్-8 పోరును భారత్‌ ఘనంగా ప్రారంభించింది. అఫ్గానిస్థాన్‌ను ఓడించింది. అయితే, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 8 పరుగులకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు. అఫ్గాన్ బౌలర్ ఫరూఖి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి మిడాన్‌లో దొరికిపోయాడు. తొలి ఓవర్‌ నుంచే పేస్‌ బౌలింగ్‌లో ఇబ్బందిపడినట్లు అనిపించాడు. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఈ క్రమంలో రోహిత్ ఆటతీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘రోహిత్ శర్మ ఎంతో అనుభవం కలిగిన క్రికెటర్. ఎలా ఆడాలనేది అతడికి తెలుసు. శైలిని మార్చుకోవాలని చెప్పడం సరైంది కాదు. బౌలర్‌ను బట్టి అక్కడ ఆడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు దూకుడుగా వెళ్లినా వికెట్‌ ఇవ్వాల్సిన పరిస్థితి. ఆఫ్‌సైడ్‌ వేసినా లెగ్‌సైడ్ ఆడుతున్నాడంటే కారణం ఉండొచ్చు. రోహిత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. ఏదొక సమయంలో బ్యాటర్ ఔట్ కావాల్సిందే. అలాగని ఆఫ్‌స్టంప్‌ ఆవల వేసిన బంతిని ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరితే దానిని బలహీనతగా భావించక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగులు చేసి.. 30 లేదా 40 సార్లు ఆఫ్‌స్టంప్ బంతులను ఆడుతూ ఔటైనా సరే ఆందోళన అవసరం లేదు’’ అని గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. 

అది నీ క్యాచే.. పంత్‌తో రోహిత్

అఫ్గాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా కెప్టెన్ రోహిత్, రిషభ్‌ పంత్‌ల మధ్య సరదా సన్నివేశం చోటుచేసుకుంది. కుల్‌దీప్‌ వేసిన (ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌) బంతిని గుల్బాదిన్‌ నైబ్ భారీ షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి పైకి లేవడంతో వికెట్ కీపర్‌ పంత్ పరుగెత్తుకుంటూ వచ్చి క్యాచ్‌ను అందుకొన్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న రోహిత్‌ను రావద్దని అరుస్తూ చెప్పాడు. దీంతో ‘అది నీ క్యాచే.. నీదే’ అంటూ రోహిత్‌ అన్న మాటలు మైక్స్‌లో వినిపించాయి. పంత్ ఆ బంతిని అందుకొన్న తర్వాత దానిని రోహిత్‌ వైపు సరదాగా విసిరాడు. ఈ వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని