Sunil Gavaskar: భారత్ విజేతగా నిలవడంలో వారిద్దరి కంటే అతడిదే కీలక పాత్ర: గావస్కర్

దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ క్రెడిట్‌ జట్టులోని ప్రతి ఒక్కరికీ దక్కుతుందని చెబుతూనే సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Published : 06 Jul 2024 00:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’ అవార్డును సొంతం చేసుకున్నాడు. కానీ, వీరిద్దరి కంటే మరొక ప్లేయరే పొట్టి కప్‌లో భారత్‌ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అతడు ఎవరంటే? భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma). అద్భుత నాయకత్వంతో టీమ్‌ఇండియాకు రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ నెగ్గేందుకు కారణమయ్యాడని గావస్కర్ అభినందించాడు. 

‘‘ఇక్కడ నేనెవరినీ తక్కువ చేయడం లేదు. ప్రతి ఒక్కరూ జట్టు విజయంలో తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. బుమ్రా బౌలింగ్‌లో ఛాంపియన్. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ ఛాంపియన్‌. వీరందరినీ నడిపించి జట్టును గెలిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధాన పాత్రధారి. అతడి నాయకత్వం అబ్బురపరిచింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏమాత్రం నిస్పృహ దరిచేరనీయకుండా జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అతడి బాడీ లాంగ్వేజ్‌ను చూస్తే అర్థమైపోతుంది. అందుకే, ఈ టోర్నీ ఆసాంతం రోహిత్ చూపించిన నాయకత్వ ప్రతిభ నన్ను ఆకట్టుకుంది’’ అని గావస్కర్ తెలిపాడు.

లండన్‌ వెళ్లిన కోహ్లీ!

వరల్డ్‌ కప్‌తో స్వదేశానికి చేరిన భారత జట్టు ముంబయిలో భారీ రోడ్‌ షో చేసిన సంగతి తెలిసిందే. అనంతరం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అక్కడే అతడి సతీమణి అనుష్క శర్మ, కుమార్తె వామికా, కుమారుడు అకాయ్‌ ఉన్నారు. ఫైనల్‌ రోజు కూడా ఫోన్‌లోనే వారితో విరాట్ మాట్లాడాడు. సరైన సమయంలో ఫామ్‌ అందుకొన్న అతడు కీలకమైన ఇన్నింగ్స్‌తో (76 పరుగులు) భారత విజయానికి సహకరించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని