Virat Kohli: విరాట్.. కాస్త ఓర్పు ప్రదర్శించు చాలు: గావస్కర్‌

విరాట్ కోహ్లీ ప్రదర్శనపై వస్తున్న కామెంట్లను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కొట్టిపడేశాడు. అతడి ఫామ్‌పై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశాడు.

Published : 13 Jun 2024 12:42 IST

ఇంటర్నెట్ డెస్క్: పదిహేను రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్‌ టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీ (Virat Kohli). ఈ భారత స్టార్‌ టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) టోర్నీకి వచ్చేసరికి తేలిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు కోహ్లీ ఆడిన మూడు మ్యాచుల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి ఫామ్‌పై మళ్లీ ఆందోళన నెలకొంది. యూఎస్‌ఏ పిచ్‌లపై నెమ్మదిగా ఆచితూచి ఆడాల్సిన సమయంలో ఒత్తిడికి గురై వికెట్‌ను సమర్పిస్తున్నాడని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా యూఎస్‌ఏపై తొలి బంతికే వికెట్‌ను సమర్పించాడు. ఓపెనర్‌గా రావడం కూడా అతడి ఆటతీరుపై ప్రభావం చూపి ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే, విరాట్ ఫామ్‌పై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని.. మున్ముందు మ్యాచుల్లో కీలకమవుతాడని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. 

‘‘వరుసగా మ్యాచ్‌లను గెలవడమే ఏ ఆటగాడికైనా స్ఫూర్తి. దేశం కోసం ఆడేటప్పుడు గర్వపడుతూ ఆడాలి. విరాట్ కోహ్లీ భారత్‌ కోసం ఎన్నో విజయాలను అందించాడు. తప్పకుండా అతడికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మనం టోర్నీ తొలి దశలోనే ఉన్నాం. ఇంకా సూపర్ - 8, సెమీస్, ఫైనల్‌ ఉన్నాయి. కోహ్లీ కాస్త ఓర్పు పాటిస్తే మాత్రం తప్పకుండా మంచి ఇన్నింగ్స్‌లు ఆడతాడు. ఇంకా అతడిలో చాలా క్రికెట్ మిగిలే ఉంది. వరుసగా మూడు మ్యాచుల్లో తక్కువ స్కోరుకే పరిమితమైనంత మాత్రాన.. ఒక బ్యాటర్ సరిగా ఆడలేదని కాదు. కొన్నిసార్లు బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తారు. మంచి బంతులను ఎదుర్కొనే క్రమంలో బ్యాటర్లు పెవిలియన్‌కు చేరుతుంటారు. కాబట్టి, దీని గురించి పెద్దగా ఆందోళన చెందక్కర్లేదు. అతడిపై మనకు నమ్మకం ఉంది. ఇలాంటి పరిస్థితుల నుంచి ఎలా బయటకు రావాలనేది కోహ్లీకి బాగా తెలుసు’’ అని గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. 

గ్రూప్ స్టేజ్‌లో భారత్‌ చివరి మ్యాచ్‌ను కెనడాతో జూన్ 15న ఆడనుంది. అది ఫ్లోరిడా వేదికగా జరగనుంది. న్యూయార్క్‌ పిచ్‌ బౌలర్లకు సహకరించింది. మరి ఫ్లోరిడా మైదానం ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఒక మ్యాచ్‌ (శ్రీలంక-నేపాల్) రద్దైన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని