Ind W vs RSA W: మహిళల తొలి టీ20లో దక్షిణాఫ్రికాదే విజయం

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ మహిళా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

Updated : 05 Jul 2024 22:34 IST

చెన్నై: వరుసగా వన్డే సిరీస్‌ను 3-0, టెస్ట్‌ సిరీస్‌ను 1-0తేడాతో సొంతం చేసుకున్న భారత్‌ మహిళా జట్టుకు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. 12 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా మహిళలు భారత్‌కు 190 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు. లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 177 పరుగులకు పరిమితమైంది. రోడ్రిగ్స్‌ (53; 30 బంతుల్లో 7×4, 1×6) అర్ధశతకంతో ఆకట్టుకుంది. స్మృతి మంధాన (46; 30 బంతుల్లో 7×4, 2×6), హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ (35; 29 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్ ఆడారు. షెఫాలీ వర్మ (18), హేమలత (14) నిరాశపరిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా, ట్రయాన్‌, డి క్లెర్క్‌, మ్లబా తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ప్రారంభం నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు వోల్వార్ట్‌ (33), తజ్మిన్‌ బ్రిట్స్‌ (81) తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి డౌన్‌లోవచ్చిన మరిజన్నె (57)తో కలిసి బ్రిట్స్‌ కీలక ఇన్నింగ్స్‌ నిర్మించి.. ఇద్దరూ క్రీజులో నిలదొక్కుకుంటూ ఎడాపెడా బాదేశారు.  17వ ఓవర్‌ వరకు మరో వికెట్‌ పడలేదంటే.. వారిద్దరూ క్రీజులో ఎంతలా పాతుకుపోయారో అర్థం చేసుకోవచ్చు. ఈ జోడీని రాధా యాదవ్‌ విడగొట్టింది. 16.3వ బంతికి శోభనాకు క్యాచ్‌ ఇచ్చి మరిజన్నె వెనుదిరిగింది. అప్పటికి జట్టు స్కోరు 146 పరుగులు. ఆ తర్వాత బ్రిట్స్‌కు, ట్రయాన్‌ (12) తోడుగా నిలవడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. భారత్‌ బౌలర్లలో పూజా వస్త్రాకర్‌, రాధా యాదవ్‌ చెరో 2 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో భారత్‌ సమష్టి ప్రదర్శన చేసినప్పటికీ.. లక్ష్యం భారీగా ఉన్న నేపథ్యంలో నిరాశ తప్పలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు