SA-AFG: ఫైనల్‌కు దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా.. అఫ్గానిస్థాన్‌పై అలవోక విజయం

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అఫ్గాన్‌స్థాన్‌తో జరిగిన సెమీస్‌ పోరులో ఘన విజయం సాధించింది.

Updated : 27 Jun 2024 14:37 IST

ట్రినిడాడ్: టీ20 ప్రపంచకప్‌ (t20 world cup 2024) చరిత్రలో దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ట్రినిడాడ్‌ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్‌-1 మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు అనూహ్య విజయాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన అఫ్గాన్‌ ఈ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికాపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కేవలం 56 పరుగులకే పరిమితమైంది.

స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డికాక్‌ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అఫ్గాన్‌ బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులు సంధిస్తుండటంతో మరో ఓపెనర్‌ హెండ్రిక్స్‌ (29*), తొలి డౌన్‌లో వచ్చిన మార్‌క్రమ్‌ (23*) తొలుత ఒకింత తడబడ్డారు. ఆ తర్వాత క్రీజులో నిలదొక్కుకొని ఆడటంతో మ్యాచ్‌ సులువుగానే ముగిసింది. అఫ్గాన్‌ బౌలర్లలో ఫరూకీ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

టీ20 ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్‌ - 1 లైవ్‌ అప్‌డేట్స్‌

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌.. 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులకు ఆలౌటైంది. టోర్నీ ఆరంభం నుంచి ఇప్పటివరకు అసాధారణ ప్రతిభ కనబరిచిన అఫ్గాన్‌ బ్యాటర్లు కీలక మ్యాచ్‌లో చేతులెత్తేశారు. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (10) మినహా మిగతా వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లు వరుస వికెట్లు పడగొడుతూ అఫ్గాన్‌ను కుప్పకూల్చారు.  ఓపెనర్లు గుర్బాజ్‌ (0), జర్దాన్‌ (2), తొలి డౌన్‌లో వచ్చిన గుల్బాదిన్ నైబ్ (9) పూర్తిగా విఫలమయ్యారు.

ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ఒమర్జాయ్‌ ప్రయత్నించాడు. కానీ, నోకియా బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (8) కూడా ఆకట్టుకోలేక పోయాడు. నబీ (0), జనత్‌ (8), నూర్ ఆహ్మద్‌ (0), నవీనుల్‌ హక్‌ (2), ఫరూకీ (2*) ప్రభావం చూపించలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్‌, షంసీ చెరో 3 వికెట్లు తీయగా.. రబాడా, నోకియా రెండేసి వికెట్లు పడగొట్టారు.

*ఇవాళ రాత్రి 8 గంటలకు భారత్‌- ఇంగ్లాండ్‌ మధ్య సెమీఫైనల్‌-2 జరగనుంది. అందులో విజయం సాధించిన జట్టుతో శనివారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) దక్షిణాఫ్రికా తలపడనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని