AFG vs SA: సెమీఫైనల్‌కు ఇలాంటి మైదానమా?.. అఫ్గాన్‌ కోచ్‌ అసహనం

టీ20 సెమీఫైనల్‌ 1కు ఎంపిక చేసిన మైదానంపై అఫ్గానిస్థాన్‌ కోచ్‌ టార్ట్‌ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.

Published : 27 Jun 2024 15:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ సిరీస్‌లో అసాధారణ పోరాటం చేసి, అందరి దృష్టినీ ఆకర్షించిన అఫ్గానిస్థాన్‌ (Afghanistan) జట్టు సెమీఫైనల్‌లో చేతులెత్తేసింది. 9 వికెట్ల భారీ తేడాతో ప్రత్యర్థి దక్షిణాఫ్రికా (South Africa) చేతిలో పరాజయం పాలైంది. కేవలం 56 పరుగులకే ఆలౌటైంది. టీ20 ప్రపంచకప్‌ (T20 World cup) చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. టీ20 ప్రపంచకప్‌ 2024లో అఫ్గాన్‌ ప్రయాణం ముగిసిన నేపథ్యంలో ఆ జట్టు కోచ్‌.. జొనాథన్‌ ట్రాట్‌ స్పందించారు. పిచ్‌ ఎంపికపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. సెమీఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌కు ఇలాంటి వేదికను ఎంచుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.

‘‘ విజయం మాకు అందని ద్రాక్షగా మిగిలిపోయిందన్న ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. సెమీఫైనల్‌ లాంటి మ్యాచ్‌కు ఈ వేదిక సరికాదు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇరుజట్ల మధ్య పోటీ న్యాయమైన పోరాటం జరగాలి. స్పిన్నర్లకు, సీమర్లకు అనుకూలంగా లేకుండా.. పిచ్‌ ఫ్లాట్‌గా ఉండాలని నేను అనను. బంతిని ఆడేందుకు బ్యాటర్‌ ఎంత కష్టపడ్డాడో ఈ మ్యాచ్‌ చూసిన  ప్రతిఒక్కరికీ అర్థమవుతుంది. టీ 20 మ్యాచ్‌లంటేనే అటాక్‌ చేయడం, పరుగులు రాబట్టడం, వికెట్లు తీయడం అంతే తప్ప.. వికెట్లు కాపాడుకోవడానికి బ్యాటర్లు ప్రయత్నించడం కాదు. ఇరు జట్లకూ పిచ్‌ ఇబ్బందికరంగానే ఉంది. అయితే, తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ టీమ్‌ తక్కువ స్కోరు చేయడంతో విజయం దక్షిణాఫ్రికా వశమైంది. అంతే తప్ప ఈ మ్యాచ్‌లో అసలైన పోరు జరగలేదు’’ అని ట్రాట్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు