shivam dube: నితీశ్‌కు గాయం.. దూబెకు చోటు

యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి నిరాశ. టీమ్‌ఇండియా తరపున అరంగేట్రం కోసం ఈ విశాఖ ఆల్‌రౌండర్‌ ఎదురు చూడక తప్పదు.

Published : 27 Jun 2024 02:44 IST

దిల్లీ: యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి నిరాశ. టీమ్‌ఇండియా తరపున అరంగేట్రం కోసం ఈ విశాఖ ఆల్‌రౌండర్‌ ఎదురు చూడక తప్పదు. జింబాబ్వేతో సిరీస్‌ కోసం భారత టీ20 జట్టుకు తొలిసారి ఎంపికైన నితీశ్‌ తాజాగా గాయం బారిన పడ్డాడు. దీంతో అతను ఈ 5 టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. హెర్నియా గాయమే అందుకు కారణంగా తెలుస్తోంది. అతని స్థానంలో ప్రపంచకప్‌లో ఆడుతున్న శివమ్‌ దూబెను జట్టులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరపున 21 ఏళ్ల నితీశ్‌ 303 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు తీశాడు. బీసీసీఐ యువ ఆటగాళ్ల టార్గెట్‌ గ్రూప్‌లో ఉన్న నితీశ్‌ గత ఏడాది కాలంగా జాతీయ క్రికెట్‌ అకాడమీ పర్యవేక్షణలో ఉన్నాడు. ‘‘జింబాబ్వే పర్యటన కోసం గాయపడ్డ నితీశ్‌ స్థానంలో శివమ్‌ దూబెను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది’’ అని బీసీసీఐ బుధవారం ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల 6న తొలి టీ20 జరుగుతుంది. 

భారత జట్టు: శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రుతురాజ్, అభిషేక్‌ శర్మ, రింకు సింగ్, శాంసన్, ధ్రువ్‌ జూరెల్, శివమ్‌ దూబె, రియాన్‌ పరాగ్, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్, ముకేశ్‌ కుమార్, తుషార్‌ దేశ్‌పాండే.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని