IND vs SA: భారత బ్యాటర్లు షంసీని టార్గెట్ చేస్తే చాలు: ఉతప్ప

టీ20 ప్రపంచ కప్‌ సంగ్రామం తుది పోరుకు వేళైంది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టైటిల్‌ వేట జరగనుంది. బార్బడోస్‌ వేదికగా ఈ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

Published : 29 Jun 2024 18:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) దక్షిణాఫ్రికా స్పిన్నర్ తంబ్రిజ్ షంసీ అత్యంత ప్రభావం చూపిస్తున్నాడు. నాలుగు మ్యాచుల్లోనే 11 వికెట్లు తీశాడు. స్పిన్‌కు సహకరించే విండీస్‌ పిచ్‌లపై అతడిని ఎదుర్కోవడం కఠినమైన సవాల్‌ అని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. అయితే, భారత్‌తో ఫైనల్‌లో (IND vs SA Final) అతడే ఎక్కువ పరుగులు ఇస్తాడని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప వ్యాఖ్యానించడం గమనార్హం. 

‘‘షంసీ తుది జట్టులో ఉంటే నేను చాలా సంతోషిస్తా. బార్బడోస్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో (IND vs SA) బార్ట్‌మన్‌ కూడా ఉండాలి. వీరిద్దరిలో ఒకరికే అవకాశం అంటే మాత్రం షంసీ వైపు మొగ్గు చూపిస్తా. ఎందుకంటే అతడి బౌలింగ్‌లోనే భారత బ్యాటర్లు టార్గెట్‌ చేసి ఎక్కువ పరుగులు రాబట్టేందుకు వీలుంది. అతడు వికెట్లు తీసినా.. కనీసం 45+ పరుగులు సాధించే అవకాశం ఉంది. ఇప్పుడున్న భారత బ్యాటింగ్‌ లైనప్‌ను చూసి ఈ మాట చెబుతున్నా. మనకు అతడు ఉండటం బిగ్ డీల్‌ అవుతుంది’’ అని ఉతప్ప (Robin uthappa) తెలిపాడు. 

షంసీ బౌలింగ్‌లో ఇలా..: అశ్విన్

‘‘షంసీ బౌలింగ్‌లో ఎక్కువగా స్వీప్‌ షాట్లు ఆడాలి. ఈ విషయంలో భారత బ్యాటర్లు పరిస్థితి బెటర్‌గానే ఉంది. అదిల్ రషీద్, లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో ఇలానే ఆడి పరుగులు రాబట్టారు. ఈసారి కూడా అలాంటి మ్యాచ్‌ ప్రదర్శనే చేయాలి. అయితే, తుది జట్టులో షంసీని ఉంచుతారా? బార్ట్‌మన్‌ను తీసుకుంటారా? అనేది చూడాలి’’ అని అశ్విన్‌ (Ashwin) వెల్లడించాడు. 

బుమ్రా, కుల్‌దీప్‌ను కాచుకుంటేనే: మోర్కెల్

తొలిసారి ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా కప్‌ను అందుకోవాలంటే.. టీమ్‌ఇండియా (Team India) జట్టులోని ఇద్దరు బౌలర్లతో జాగ్రత్తగా ఉండాలని మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ సూచించాడు. ‘‘జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌ను జాగ్రత్తగా ఆడాలి. ఒత్తిడిని దరిచేరనీయకూడదు. ఒక్కో బంతిపై దృష్టిపెడుతూ ఇన్నింగ్స్‌ సాగాలి. డెత్‌ ఓవర్లలో బుమ్రా (Jasprit Bumrah) మరింత ప్రమాదకరంగా మారతాడు. కాబట్టి మంచి స్కోరును చేసి లక్ష్యంగా నిర్దేశించేందుకు టీమ్‌ఇండియా ప్రయత్నిస్తుంది. బుమ్రా, కుల్‌దీప్‌ గురించి ఎక్కువ ఆందోళన చెందక్కర్లేదు. వారిని గౌరవిస్తూనే.. మిగతా బౌలింగ్‌ ఎటాక్‌ను లక్ష్యం చేసుకోవాలి’’ అని మోర్కెల్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని