Rohit-Virat: రోహిత్ శర్మ భావోద్వేగం.. ‘కమాన్‌ మ్యాన్‌ చీర్స్‌’ అన్న విరాట్ కోహ్లీ!

టీమ్‌ఇండియా మూడోసారి టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన తర్వాత రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు.

Updated : 28 Jun 2024 11:17 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో టీమ్‌ఇండియా ఫైనల్‌కు చేరింది. రెండేళ్ల క్రితం సెమీస్‌లోనే  భారత్‌ను ఇంగ్లాండ్‌ చిత్తు చేసి విజేతగా నిలిచింది. ఇప్పుడు డిఫెండింగ్‌ ఛాంపియన్‌పై ప్రతీకార విజయం సాధించిన రోహిత్ సేన.. తుది పోరులో దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లిష్‌ జట్టును చిత్తు చేసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అప్పుడే డగౌట్‌కు వస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రోహిత్‌ను సముదాయించాడు. ‘కమాన్‌ మ్యాన్‌ చీర్స్‌’ అని హిట్‌మ్యాన్‌తో అన్నట్లుగా తెలుస్తోంది.

గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ ఓడిపోయాక.. ఆ రాత్రి నిద్ర పట్టలేదని గతంలో రోహిత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా సెమీస్‌కు ముందు అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడని అభిమానులు అంటున్నారు. 2022లో మనపై పది వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్‌ను అడ్డుకోవడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా సూపర్-8 నుంచి ఇంగ్లాండ్‌ దూకుడుగా ఆడుతోంది. ఆ జట్టులో బట్లర్, బెయిర్‌స్టో ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టేస్తున్నారు. అలాంటి వారిపై ఆధిపత్యం ప్రదర్శించడం అభినందనీయమని మాజీలు ప్రశంసలు కురిపించారు. భారత బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి బట్లర్‌ టీమ్‌ను చిత్తుగా ఓడించి ఇంటికి పంపారు. పదేళ్ల తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు టీమ్‌ఇండియా చేరుకోవడం గమనార్హం. 2007లో ధోనీ నాయకత్వంలో టైటిల్‌ విజేతగా నిలిచిన భారత్‌కు ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. దీనిని అందిపుచ్చుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు