Rohit Sharma: కోహ్లీకి ఫామ్‌ సమస్యే కాదు.. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్‌ ఆడతాడు: రోహిత్ శర్మ

ఇంగ్లాండ్‌పై ఘన విజయంతో భారత్ టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు చేరుకుంది. శనివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

Updated : 28 Jun 2024 11:22 IST

ఇంటర్నెట్ డెస్క్: పదేళ్ల తర్వాత భారత్ టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) ఫైనల్‌కు దూసుకెళ్లింది. చివరి సారిగా 2014లో తుదిపోరుకు చేరిన భారత్‌.. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీస్‌లో అద్భుత విజయంతో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. తొలుత రోహిత్ శర్మ (Rohit Sharma) దూకుడుగా ఆడటంతో టీమ్‌ ఇండియా మెరుగైన స్కోరు చేసింది. ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడంలో ఇద్దరు స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్ మూడేసి వికెట్లు తీసి భారత్‌ను గెలిపించారు. మ్యాచ్‌ అనంతరం వీరిద్దరిపై రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు.

‘‘ఆత్మ సంతృప్తినిచ్చిన విజయమిది. జట్టుగా మేం చాలా కష్టపడ్డాం. పరిస్థితులను త్వరగా అలవాటు చేసుకుని గెలిచాం. ఈ విజయం చాన్నాళ్లు గుర్తుండిపోతుంది. బౌలర్లు, బ్యాటర్లు కుదురుకుంటే గెలవడం చాలా ఈజీ అని నిరూపించాం. ఓ దశలో మేం 140-150 పరుగులకే పరిమితం కావాల్సి ఉంటుందని భావించా. సూర్య, నేను కాస్త దూకుడు పెంచాం. కనీసం 170+ స్కోరు చేస్తే చాలు అనిపించింది. లోయర్‌ ఆర్డర్‌లోనూ విలువైన పరుగులు సాధించారు. బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (Axar Patel), కుల్‌దీప్‌ (Kuldeep Yadav) గన్‌ స్పిన్నర్లు. ఇలాంటి పిచ్‌ పరిస్థితుల్లో వారిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఒత్తిడిలోనూ నిశ్శబ్దంగా ఉండి వికెట్లు తీయగలరు. తొలి ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత మేం మాట్లాడుకున్నప్పుడు కూడా మా లక్ష్యం స్టంప్స్‌పై బంతులేయడంపైనే అనుకున్నాం. ప్రత్యర్థి బ్యాటర్లను తక్కువ అంచనా వేయలేదు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్‌ చేస్తే వికెట్లు వస్తాయి. ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు చేసిందదే. 

చాలా మంది విరాట్ కోహ్లీ ఫామ్‌ గురించి మాట్లాడుతున్నారు. కానీ, అదేమీ పెద్ద సమస్య కాదు. విరాట్ క్లాస్‌ ప్లేయర్. గత 15 ఏళ్లుగా ఆడుతున్నాం. అతడి ఆటతీరు అద్భుతం. ఫైనల్‌లోనూ కోహ్లీ ఉంటాడనడంలో సందేహం లేదు. తన ఎనర్జీనంతా ఫైనల్‌కు కోసం దాచి పెట్టాడేమో.. తుది పోరులో తప్పకుండా కీలక ఇన్నింగ్స్‌ ఆడతాడనే నమ్మకం ఉంది’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 9 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని