Virat-Rohit: రోహిత్-విరాట్‌ నిర్ణయంతో షాక్‌ అయ్యా.. వారిని భర్తీ చేయడం సవాలే: స్టార్ పేసర్

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు గుడ్‌బై చెప్పేశారు. అయితే, ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులతోపాటు వారి సహచరులను కూడా షాక్‌కు గురి చేసింది.

Published : 03 Jul 2024 15:17 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ను (T20 World Cup 2024) రెండోసారి కైవసం చేసుకొని 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత్ తెరదించింది. కప్‌ గెలిచామన్న సంతోషంలో ఉన్న అభిమానులకు షాక్‌ ఇచ్చేలా స్టార్‌ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేశారు. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 76 పరుగులు చేసిన ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది. ఒక్కసారిగా ఇద్దరు టాప్‌ ప్లేయర్లు వీడ్కోలు పలకడంతో వారి స్థానాలు ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది. కోహ్లీ, రోహిత్‌ లేని లోటును పూరించడం చాలా కష్టమని వెటరన్‌ పేస్‌ బౌలర్‌ మహమ్మద్ షమీ (Shami) వ్యాఖ్యానించాడు. వారిద్దరూ తీసుకున్న నిర్ణయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపాడు. 

‘‘టీ20ల నుంచి రోహిత్ (Rohit Sharma), విరాట్ వీడ్కోలు చెబుతారని అస్సలు అనుకోలేదు. భారత క్రికెట్‌ను పటిష్ఠమైన స్థితిలో ఉంచారు. గత 16 ఏళ్లుగా అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను అలరించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనే అత్యున్నత శిఖరాలకు చేరారు. ఇద్దరూ ఒక్కసారిగా గుడ్‌బై చెప్పడం మాత్రం షాక్‌కు గురి చేసింది. క్రీడల్లో ఇలా జరగడం సహజమే. ఒకరు వెళ్తుంటే.. మరొకరు వస్తుంటారు. కానీ, వీరిద్దరి స్థానాలను భర్తీ చేయడం మాత్రం అనుకున్నంత సులువు కాదు. మేనేజ్‌మెంట్‌కు కఠిన సవాల్‌ తప్పదు. లక్ష్యాన్ని సాధించిన తర్వాత వీడ్కోలు పలకడం భావోద్వేగానికి గురి చేసే సందర్భం. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన వీరిద్దరికీ ధన్యవాదాలు చెబుతున్నా. ఎన్నో రికార్డులను బ్రేక్‌ చేశారు. టీ20 ప్రపంచ కప్‌ను రెండోసారి దక్కించుకున్నందుకు భారత జట్టులోని ప్రతీ ఆటగాడికి శుభాకాంక్షలు. చివరి వరకూ పట్టువిడవకుండా విజేతగా అవతరించడం అభినందనీయం’’ అని షమీ వ్యాఖ్యానించాడు. 

విరాట్ అద్భుతం చేశాడు: సిద్ధూ

‘‘ఫైనల్‌లో సూపర్ ఇన్నింగ్స్‌తో భారత జట్టు విజయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) కీలక పాత్ర పోషించాడు. 150 కోట్ల భారతీయులు సగర్వంగా తలెత్తుకొనేలా చేశాడు. ఫామ్‌లో లేడని విమర్శలు వచ్చినా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించాడు. ఫైనల్‌లో 76 పరుగులు చేశాడు. ఇతర మ్యాచుల్లో 38, 24 పరుగులు చేసినప్పుడు కూడా రన్‌రేట్‌ పడిపోకుండా చూశాడు. దిగ్గజంగా గుర్తుండిపోవడం ఖాయం. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు’’ అని భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సిద్ధూ ప్రశంసించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని