Rishabh Pant: వరల్డ్ కప్‌ మెడల్‌తో పంత్.. ట్రోల్‌ చేసిన అక్షర్, సిరాజ్

పొట్టి కప్‌ను నెగ్గిన భారత ఆటగాళ్లు ఎట్టకేలకు స్వదేశానికి చేరారు. వారికి ఘనస్వాగతం లభించింది. దిల్లీ విమానాశ్రయంలో అభిమానులు, అధికారుల మధ్య ప్లేయర్లు డ్యాన్సులతో కాసేపు హంగామా చేశారు.

Published : 04 Jul 2024 10:50 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ను (T20 World Cup 2024) సగర్వంగా సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా క్రికెటర్లు స్వదేశంలో అడుగుపెట్టారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆటగాళ్లకు అభిమానులు దిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ జట్టులోని ప్లేయర్లు మెడల్‌తో ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. హార్దిక్‌, రిషభ్ పంత్ (Rishabh Pant) ఇప్పటికే ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. అయితే, పంత్‌ షేర్‌ చేసిన ఫొటోలను భారత క్రికెటర్లు అక్షర్ పటేల్, మహమ్మద్‌ సిరాజ్‌ సరదాగా ట్రోల్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. పంత్ మెడల్‌ను చూపిస్తూ షేర్‌ చేసిన ఫొటోలకు ఈ ఇద్దరు క్రికెటర్లు ‘‘భాయ్‌.. అలాంటిదే మా దగ్గరా ఉంది’ అంటూ కామెంట్ జోడించారు. వరల్డ్‌ కప్‌ను అందుకోవడానికి భారత్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. 

అభిమానులూ.. సంబరాల్లో పాల్గొనండి: రోహిత్

వరల్డ్‌ కప్‌తో సాయంత్రం 5 గంటలకు ముంబయిలో ఓపెన్ టాప్‌ బస్‌ పరేడ్‌ జరగనుంది. అభిమానులందరూ ఈ వేడుకలో పాల్గొనాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పిలుపునిచ్చాడు. ‘‘ఇలాంటి అద్భుతమైన క్షణాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాం. మరైన్ డ్రైవ్‌, వాంఖడే వేదికగా సంబరాలు నిర్వహించుకుందాం. వరల్డ్‌ కప్‌తో స్వదేశానికి వచ్చేశాం’’ అని రోహిత్ పోస్టు పెట్టాడు. టీ20 ప్రపంచ కప్ విక్టరీ గుర్తుండిపోయేలా చేసుకుందామని బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా పోస్టు చేశారు. రాత్రి 7 గంటలకు వాంఖడే స్టేడియం వేదికగా ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని