Ramoji Rao memorial athletics Championship: ఛాంపియన్ల వేదిక

చెరుకూరి రామోజీరావు స్మారక తెలంగాణ రాష్ట్ర అండర్‌-8, 10, 12 బాలబాలికల అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రేరణగా తీసుకుని మరింత మంది ఛాంపియన్లు వస్తారని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్, ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ బ్రాండ్‌ అంబాసిడర్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు.

Published : 08 Jul 2024 03:10 IST

 రామోజీరావు స్మారక చిన్నారుల అథ్లెటిక్స్‌పై గోపీచంద్‌ 
‘లక్ష్య’ దేశానికే ఆదర్శం: రమేశ్‌
ఈనాడు, హైదరాబాద్‌

రామోజీరావుకు నివాళి అర్పిస్తున్న ఉమ చిగురుపాటి. చిత్రంలో పుల్లెల గోపీచంద్, నాగపురి రమేశ్‌

చెరుకూరి రామోజీరావు స్మారక తెలంగాణ రాష్ట్ర అండర్‌-8, 10, 12 బాలబాలికల అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రేరణగా తీసుకుని మరింత మంది ఛాంపియన్లు వస్తారని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్, ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ బ్రాండ్‌ అంబాసిడర్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. ప్రతిభాన్వేషణకు ఇది మంచి అవకాశమని తెలిపారు. పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ- ఈనాడు ‘లక్ష్య’ ఆధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలిలోని గోపీచంద్‌ అకాడమీలో రామోజీరావు స్మారక అథ్లెటిక్స్‌ పోటీలు జరిగాయి. 469 మంది చిన్నారులు పాల్గొన్న ఈ టోర్నీని గోపీచంద్‌ ప్రారంభించారు. గ్రాన్యూల్స్‌ ఇండియా ఫార్మా లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఉమ చిగురుపాటి, ఏఐజీ హాస్పిటల్స్‌ కార్డియాలజిస్టులు అనూజ్‌ కపాడియా, ప్రగతి గుర్రం.. భారత జూనియర్‌ అథ్లెటిక్స్‌ చీఫ్‌ కోచ్, ‘లక్ష్య’ మెంటార్‌ నాగపురి రమేశ్‌.. తెలంగాణ అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి సారంగపాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ ‘‘తెలంగాణ రాష్ట్ర చిన్నారులకు అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహిస్తుండటం సంతోషకరం. అకాడమీలో ఈరోజు కోసం ఎప్పట్నుంచో కల కంటున్నా. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి చాలామంది పిల్లలు చురుగ్గా టోర్నీలో పాల్గొంటున్నారు. తల్లిదండ్రులు ఉత్సాహంగా చిన్నారులను తీసుకొచ్చారు. ప్రతిభావంతుల అన్వేషణకు ఇది మంచి అవకాశం. ఈ టోర్నీ చిన్నారులకు ప్రేరణగా నిలుస్తుంది. రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని టోర్నీలు నిర్వహించాలి. అద్భుతమైన ఈ టోర్నీని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ఛాంపియన్లు వస్తారని ఆశిస్తున్నా’’ అని తెలిపారు.

రామోజీరావు స్మారక తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్‌లో వివిధ విభాగాల విజేతలు

‘‘ప్రతి చిన్నారికి ఆడుకునే అవకాశం కల్పించడమే ‘లక్ష్య’ ఉద్దేశం. ఈ టోర్నీలో 8, 10, 12 వయో పరిమితి విభాగాల్లో పిల్లలు పాల్గొంటున్నారు. చిన్నారులకు ఉచిత భోజనం, పతకాలు, నగదు బహుమతులు అందిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ‘లక్ష్య’ ద్వారా ఉపకార వేతనాలు ఇస్తున్నాం. అత్యుత్తమ ప్రతిభావంతులకు హైదరాబాద్‌లో ఉచిత భోజనం, అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందజేస్తున్నాం. ఇప్పటికే ఒలింపిక్స్, ఆసియా స్థాయి క్రీడాకారుల్ని ‘లక్ష్య’ తీర్చిదిద్దింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తున్న ఈనాడుకు కృతజ్ఞతలు. ‘లక్ష్య’ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఎంతోమంది గ్రామీణ, పేద, ప్రతిభావంతుల్ని గుర్తించి వెలుగులోకి తీసుకొస్తుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది’’ అని ద్రోణాచార్య అవార్డీ రమేశ్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని