PM Modi-Team India: ప్రధాని మోదీకి టీమ్‌ఇండియా ‘జెర్సీ’ బహూకరణ.. నంబర్‌ ఎంతంటే?

ప్రధాని నరేంద్ర మోదీని పొట్టి కప్‌ విజేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు భారత జెర్సీని అందించారు. మోదీతో భేటీ కావడంపై క్రికెటర్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Updated : 04 Jul 2024 16:41 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) సాధించిన తర్వాత స్వదేశానికి వచ్చిన టీమ్‌ఇండియా ఆటగాళ్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister) ప్రత్యేకంగా కలిశారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో భేటీ జరిగింది. ఈ సందర్భంగా క్రికెటర్లను మోదీ అభినందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్‌ ద్రవిడ్‌పై ప్రశంసలు కురిపించారు. విజేతగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడారని స్టార్‌ ప్లేయర్లనూ కొనియాడారు. భారత క్రికెటర్లతోపాటు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా కూడా ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి వీరిద్దరూ ప్రత్యేకంగా భారత జెర్సీని అందజేశారు. ఇంగ్లిష్‌లో నమో (NAMO) అని ‘1’వ నంబర్‌తో కూడిన జెర్సీని మోదీకి బహూకరించారు. 

ఈ ఫొటోలను షేర్ చేసిన బీసీసీఐ ‘‘భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ని టీ20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన క్రికెటర్లు కలిశారు. ఈ సందర్భంగా మీరు (ప్రధాని) అందించిన స్ఫూర్తివంతమైన మాటలను ఆచరణలోకి తీసుకొస్తాం. మీ అమూల్యమైన మద్దతు ఇలానే టీమ్‌ఇండియాపై ఉండాలని కోరుకుంటున్నాం’’ అని క్యాప్షన్‌ను జోడించింది. దాదాపు 16 గంటలపాటు విండీస్‌ నుంచి ప్రయాణించి వచ్చిన భారత ఆటగాళ్లకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. 

గొప్ప గౌరవం: విరాట్

ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం భారత స్టార్‌ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘ప్రధాని మోదీని కలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు’’ అని కోహ్లీ పోస్ట్‌ పెట్టాడు. అంతకుముందు దిల్లీ విమానాశ్రయం వద్ద ఓ హోటల్‌లో కోహ్లీ తన కుటుంబ సభ్యులను కలిశాడు. వారితో కలిసి ఫొటోలు దిగాడు. ఈ సందర్భంగా అనుష్క శర్మ ‘లవ్’ ఎమోజీతో రిప్లయ్‌ ఇవ్వడం గమనార్హం. 

బుమ్రా కుటుంబంతో మోదీ

భారత జట్టులోని ప్రతి ఒక్కరితో మోదీ ప్రత్యేకంగా ఫొటోలు దిగారు. ఈ క్రమంలో స్టార్‌ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) సతీమణి సంజనా గణేశన్‌ కూడా ప్రధానితో సంభాషించారు. అనంతరం బుమ్రా కుమారుడు అంగద్‌ను ప్రధాని ఎత్తుకొని కాసేపు బుజ్జగించారు. దీనిపై బుమ్రా స్పందిస్తూ.. ‘‘మీ ఆతిథ్యం అద్భుతం. మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు’’ అని పోస్టు చేశాడు. యుజ్వేంద్ర చాహల్‌ (Chahal) కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని