T20 World Cup: ‘‘ఆదర్శప్రాయమైన విజయం’’.. టీమ్‌ఇండియాకు ప్రధాని మోదీ ఫోన్‌

T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకున్న సందర్భంగా భారత జట్టును ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లతో ఆయన స్వయంగా మాట్లాడి అభినందించారు.

Updated : 30 Jun 2024 12:36 IST

T20 World Cup | దిల్లీ: టీ20 వరల్డ్‌ కప్‌లో విజేతగా నిలిచిన భారత క్రికెట్‌ జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సమష్టిగా రాణించి విశ్వ వేదికపై దేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన ఆటగాళ్లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు టీమ్‌ఇండియా కృషిని కీర్తిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రికెట్‌ జట్టును అభినందించిన వారిలో ఉన్నారు. స్వయంగా ఫోన్‌లో మాట్లాడి మరీ ఆయన తన ఆనందాన్ని ప్లేయర్లతో పంచుకోవడం విశేషం. ‘‘భారత క్రికెట్‌ జట్టుతో మాట్లాడి, T20 ప్రపంచ కప్‌లో వారి ఆదర్శప్రాయమైన విజయాన్ని అభినందించాను. టోర్నీ అంతటా వారు అద్భుతమైన నైపుణ్యం, స్ఫూర్తి ప్రదర్శించారు. ప్రతీ క్రీడాకారుడి నిబద్ధత అందరిలో ప్రేరణ నింపుతుంది’’ అంటూ జట్టు సభ్యులతో మాట్లాడిన అనంతరం మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

రోహిత్‌ శర్మతో స్వయంగా మాట్లాడిన మోదీ.. ఆయన కెప్టెన్సీని కొనియాడారు. తుది మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకంగా మారిన కోహ్లీ పాత్రను సైతం ఆయన అభినందించారు. మరోవైపు దాదాపు రెండున్నరేళ్లుగా జట్టు కోచ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న ద్రవిడ్‌ కృషిని సైతం మెచ్చుకున్నారు. భారత క్రికెట్‌కు చేసిన సేవలకుగానూ ఆయనకు ధన్యవాదాలూ తెలిపారు. ఫైనల్‌ ఓవర్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన హార్దిక్‌ పాండ్య, చరిత్రలో నిలిచిపోయే క్యాచ్‌తో విజయాన్ని ఖాయం చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ను సైతం ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సైతం ద్రవిడ్‌, రోహిత్‌ శర్మకు శుభాకాంక్షలు తెలిపారు.

జయహో జగజ్జేత


మీ కెప్టెన్సీతో కొత్త దిశ..

‘‘మీది అద్భుతమైన వ్యక్తిత్వం. మీ దూకుడు మనస్తత్వం, బ్యాటింగ్, కెప్టెన్సీ భారత జట్టుకు కొత్త దిశను అందించాయి. మీ టీ20 కెరీర్‌ అందరికీ గుర్తుండిపోతుంది. మీతో మాట్లాడినందుకు ఆనందంగా ఉంది’’ - రోహిత్‌తో మోదీ సంభాషణ


ప్రేరణనిస్తూనే ఉంటారు..

‘‘మీతో మాట్లాడుతున్నందుకు సంతోషం. ఫైనల్స్‌లో ఇన్నింగ్స్‌లా, మీరు భారత బ్యాటింగ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. మీరు అన్ని ఫార్మాట్లలో మెరిశారు. T20 క్రికెట్ మిమ్మల్ని మిస్సవుతుంది. కానీ, కొత్త తరం ఆటగాళ్లకు మీరు ప్రేరణనిస్తూనే ఉంటారని నేను విశ్వసిస్తున్నాను’’- కోహ్లీతో ప్రధాని


విజయాన్ని తీర్చిదిద్దిన ద్రవిడ్‌..

‘‘రాహుల్ ద్రవిడ్ అద్భుతమైన కోచింగ్ ప్రయాణం భారత క్రికెట్‌ను విజయ తీరాలకు చేర్చింది. ఆయన అచంచలమైన అంకితభావం, వ్యూహాత్మక ప్రణాళికలు, సరైన ప్రతిభను గుర్తించడం వంటి అంశాలు మెరుగైన జట్టు కూర్పుకు ఎంతో దోహదం చేశాయి. టీమ్‌కు అందించిన సేవలు, రాబోయే తరాల్లో స్ఫూర్తి నింపినందుకు భారత్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతోంది. ప్రపంచకప్‌ గెలుపొందిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు’’- రాహుల్‌ ద్రవిడ్‌పై మోదీ

తాజా విజయంతో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ తమ అంతర్జాతీయ టీ20కి వీడ్కోలు చెప్పారు. విశ్వవిజేతగా భారత జట్టును నిలిపిన శుభసందర్భాన వీరు తమ నిర్ణయాలను ప్రకటించారు. మరోవైపు కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం సైతం ముగియనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని