Modi-Rohit Sharma: రోహిత్‌.. పిచ్‌ మట్టి రుచి ఎలా ఉంది?: మోదీ

టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించి స్వదేశంలో అడుగుపెట్టిన టీమ్ ఇండియా.. ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా సరదా ప్రశ్నలు అడుగుతూ మోదీ నవ్వులు పూయించారు.

Updated : 04 Jul 2024 19:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup) సాధించిన విజయోత్సాహంతో స్వదేశంలో అడుగుపెట్టింది టీమ్‌ఇండియా. ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టిన ఆటగాళ్లకు (Team India) అపూర్వ స్వాగతం లభించింది. ప్రత్యేక విమానంలో దిల్లీలో దిగిన రోహిత్‌ (Rohit Sharma) సేన.. నేరుగా ప్రధాని మోదీ (PM Modi) నివాసానికి వెళ్లారు. అందర్నీ ఆప్యాయంగా పలకరించిన ప్రధాని.. టూర్‌ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచకప్‌ సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. క్లిష్టపరిస్థితుల్లో ఒత్తిడిని ఎలా తట్టుకున్నారంటూ వాకబు చేశారు.

ఒక్కొక్కర్నీ సరదాగా పలకరిస్తూ.. పలు ప్రశ్నలతో నవ్వులు పూయించారు. ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత సంతోషం పట్టలేకపోయిన రోహిత్‌.. గ్రౌండ్‌లో అలాగే బోర్లా పడుకొని లేచి.. ఆ తర్వాత పిచ్‌పై ఉన్న చిన్న మట్టిని రెండుసార్లు నోట్లో వేసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని గుర్తు చేసుకున్న ప్రధాని ‘ రోహిత్‌.. మట్టి రుచి ఎలా ఉంది?’ అంటూ ప్రశ్నించారు. ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రారంభంలోనే భారత్‌ కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముందుగానే క్రీజులోకి వచ్చి మంచి స్కోరు చేయడం ఎలా అనిపించిందని అక్షర్‌ పటేల్‌ను అడిగారు. సాధారణంగా ఆరేడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగే అక్షర్‌ పటేల్‌.. ఫైనల్‌ మ్యాచ్‌లో మూడో డౌన్‌లో క్రీజులోకి వచ్చి ఒక ఫోర్‌, 4 సిక్సర్ల సాయంతో 47 కీలక పరుగులతో రాణించాడు. 

ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి ఐదు ఓవర్లలోనే విజయం తారుమారైంది. దక్షిణాప్రికా 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో టీమ్‌ ఇండియా అభిమానులంతా దాదాపు ఆశలు వదులుకున్నారు. ఆ దశలో బంతి అందుకున్న బుమ్రా తక్కువ పరుగులు ఇచ్చి సఫారీ బ్యాటర్ల మీద ఒత్తిడి పెంచాడు. ఆ ఓవర్‌ వేసే సమయంలో బుమ్రా మనసులో ఏం మెదిలిందో! అంటూ మోదీ వాకబు చేశారు. టోర్నీ సాంతం హార్దిక్‌ పాండ్య ఆటతీరుపై ఆరా తీసిన ప్రధాని..  దక్షిణాఫ్రికా 16 పరుగులు చేయాల్సిన తరుణంలో చివరి ఓవర్‌ ఒత్తిడిని ఎలా తట్టుకున్నావ్‌?అని ప్రశ్నించారు. బౌండరీ లైన్‌ వద్ద అద్భుతమైన క్యాచ్‌తో.. భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్‌ను అభినందిస్తూ.. ఆ ఏడు సెకన్ల సమయాన్ని మోదీ మళ్లీ గుర్తు చేసుకున్నారు. ప్రధాని ప్రశ్నలకు ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని