T20 WC 2024: ‘హార్దిక్‌ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్‌ స్ట్రాంగ్‌ ఆన్సర్‌!

టీ20 ప్రపంచ కప్‌ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. పెద్దగా ఫామ్‌లో లేనివారికి అవకాశం ఇచ్చారనే విమర్శలూ వస్తున్నాయి.

Published : 01 May 2024 16:49 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ కోసం (T20 World Cup 2024) భారత జట్టును ప్రకటించిన తర్వాత వివిధ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు టీమ్‌ సమతూకంగా ఉందని అభినందించగా.. కొందరు ఫామ్‌లో లేని వారిని ఎందుకు ఎంపిక చేశారంటూ విమర్శలు చేశారు. మరీ ముఖ్యంగా ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేకపోతున్న హార్దిక్‌ పాండ్య సెలక్షన్‌పై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. పది మ్యాచుల్లో కేవలం 197 పరుగులు చేసిన పాండ్య 4 వికెట్లను మాత్రమే తీశాడు. అతడినే వైస్‌ కెప్టెన్‌గా చేయడం గమనార్హం. తాజాగా వాటిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘ఐపీఎల్‌లో ఆడటం.. దేశం కోసం ప్రాతినిధ్యం వహించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. జాతీయజట్టుకు ఆడేటప్పుడు ప్రతీ ఆటగాడు గర్వంగా ఫీలవుతాడు. హార్దిక్‌ పాండ్య విషయంలోనూ ఇదే ఉంటుంది. ఐపీఎల్‌లో అతడు చాలా సమస్యలను అధిగమిస్తూ ఉన్నాడు. వాటిని చక్కగా నిర్వహిస్తుండటం అభినందనీయం. వరల్డ్‌ కప్‌లో భారత్ తరఫున పాండ్య విదేశాల్లో ఆడనున్నాడు. ఇప్పుడున్న పరిస్థితి నుంచి పూర్తి భిన్నమైన మైండ్‌సెట్‌తో బరిలోకి దిగుతాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో హార్దిక్ భాగస్వామ్యం అత్యంత కీలకం కానుంది. తప్పకుండా టీమ్‌ఇండియా టైటిల్‌ రేసులో ముందుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో కొన్నిసార్లు అదృష్టమూ కలిసిరావాలి. ఇప్పుడీ టీమ్‌కు లక్‌ ఉందని భావిస్తున్నా. 2007 మళ్లీ పునరావృతం కావడం ఖాయం. భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ వచ్చేయడం తథ్యం. జట్టులోని ప్రతిఒక్కరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఐపీఎల్‌ తర్వాత మెగా టోర్నీ ప్రారంభానికి ముందు ఒక వారం విరామం లభించనుంది’’ అని గావస్కర్ తెలిపాడు.

కేఎల్ రాహుల్ ఉంటే బాగుండేది: రితేష్ దేశ్‌ముఖ్

వరల్డ్ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. ఐపీఎల్ 2024 సీజన్‌లో 400+ స్కోరు చేసిన అతడిని పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్ కూడా ఉన్నాడు.  రాహుల్‌ను ఎంపిక చేయకపోవడంపై ఎక్స్‌ వేదికగా స్పందించాడు. ‘‘కేఎల్‌ రాహుల్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉంటే బాగుండేది’’ అని పోస్టు పెట్టాడు. 

చాహల్‌ కోసం ధనశ్రీ వర్మ స్పెషల్ పోస్టు

ఐపీఎల్‌లో అదరగొడుతున్న యుజ్వేంద్ర చాహల్‌ చాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టులోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పుడు వరల్డ్‌ కప్‌ ఆడే అవకాశం అతడికి వచ్చింది. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. తొమ్మిది మ్యాచుల్లో 13 వికెట్లు పడగొట్టాడు. చివరిసారిగా వెస్టిండీస్‌పై 2023 ఆగస్ట్‌లో చాహల్‌ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడాడు. వరల్డ్‌ కప్‌నకు చాహల్‌ ఎంపిక కావడంపై అతడి భార్య ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ‘‘వెల్‌కమ్‌ చాహల్‌. హీ ఈజ్‌ బ్యాక్‌’’ అంటూ న్యూయార్క్‌ ఎంపైర్ స్టేట్ భవనం మీద భారత జట్టు పేర్లతో కూడిన ఫొటోను షేర్ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని