T20 WC 2024 Final: ఫైనల్‌ను చివరివరకూ చూశా.. భారత్‌ బ్రాండ్‌ క్రికెట్‌ అద్భుతం: పాక్‌ పేసర్

పొట్టి కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమ్‌ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. భారత్ విజయంపై పాక్‌ మాజీలు కొందరు అక్కసు వెళ్లగక్కగా.. ఆ జట్టు పేసర్ మాత్రం అభినందనలు తెలిపాడు.

Published : 03 Jul 2024 16:12 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో (T20 World Cup 2024) దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్ రెండోసారి విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ను సఫారీ జట్టుపై ఏడు పరుగుల తేడాతో గెలిచింది. పొట్టి కప్‌ ఫైనల్‌లో టీమ్‌ఇండియా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిందని పాకిస్థాన్‌ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది ప్రశంసలు కురిపించాడు. యూఎస్‌ఏ, భారత్‌ చేతిలో ఓటమితో పాక్‌ గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. 

‘‘ఫైనల్‌ మ్యాచ్‌ మొత్తం చూశా. చాలా ఆస్వాదించా. రెండు జట్లూ అద్భుతంగా ఆడాయి. అయితే, ఒత్తిడిని తట్టుకొని ఏ జట్టు రాణిస్తుందో, అదే విజేతగా నిలుస్తుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లోనూ ఇదే జరిగింది. భారత్‌ తన బ్రాండ్‌ క్రికెట్‌తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. కప్‌ను అందుకొనేందుకు దాయాది దేశానికి అన్ని అర్హతలూ ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌లో బలమైన జట్లే తలపడ్డాయి. మేం కూడా చాలా పొరపాట్లు చేశాం. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మరింత శ్రమిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయనడంలో సందేహమే లేదు’’ అని షహీన్‌ వ్యాఖ్యానించాడు. 

జట్టులో రాజకీయాలపై రిజ్వాన్ స్పందన

జట్టు ఎంపిక నుంచి ఆటగాళ్ల మధ్య సరైన సంబంధాలు లేవని వస్తున్న ఆరోపణలపై పాక్‌ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ స్పందించాడు. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన తమ జట్టు తొలి దశలోనే నిష్క్రమించడంతో రాజకీయాలు ఎక్కువయ్యాయనే విమర్శలూ వచ్చాయని పేర్కొన్నాడు. ‘‘జట్టులో రాజకీయాలు ఉండటంతో ప్రదర్శన దారుణంగా ఉందని రకరకాల ఆరోపణలు వచ్చాయి. ఆటగాళ్ల మధ్య విభేదాలు  ఉన్నాయని గుసగుసలు విన్నాం. మా మధ్య ఏమైనా ఉంటే వరల్డ్‌ కప్‌ ముందు మ్యాచుల్లోనూ ఓడిపోవాలి కదా. ఇదే జట్టుతో మేం గతంలో సెమీస్, ఫైనల్స్‌కు కూడా చేరాం. అయితే, ట్రోఫీలను గెలవలేదనేది మాత్రం వాస్తవమే. అంచనాలను అందుకోవడంలో మేం విఫలమయ్యాం. ఆటగాడు ఎవరైనా సరే.. విమర్శలు ఎదుర్కోకపోతే విజయవంతం కాలేడు. టీ20 ప్రపంచకప్‌లో అభిమానులను నిరాశపరిచాం. మా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి’’ అని రిజ్వాన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు