Axar Patel: ఆ ఒక్క ట్రిక్ పాటించా.. వికెట్లు సాధించా: అక్షర్‌ పటేల్

భారత విజయంలో అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. ముగ్గురు డేంజరస్‌ బ్యాటర్లు బట్లర్, బెయిర్‌స్టో, మొయిన్‌ అలీ వికెట్లు పడగొట్టాడు.

Updated : 28 Jun 2024 11:29 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన టీమ్‌ఇండియా ఫైనల్‌కు దూసుకుపోయింది. బ్యాటింగ్‌లో విలువైన పరుగులు చేసిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడినే ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది. మ్యాచ్‌ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన అక్షర్ పటేల్ (Axar Patel).. బంతులను చాలా నెమ్మదిగా వేసినట్లు తెలిపాడు. పిచ్‌ పరిస్థితికి అనుగుణంగా బౌలింగ్‌ చేయడం వల్లే వికెట్లు దక్కినట్లు వెల్లడించాడు. 

‘‘చాలా మ్యాచుల్లో పవర్‌ప్లేలోనూ బౌలింగ్‌ చేసిన అనుభవం ఉంది. ఈసారి కూడా ఓవర్‌ వేశా. మేనేజ్‌మెంట్, కెప్టెన్ ప్రణాళిక ప్రకారం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నా బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉంటా. పిచ్‌ చాలా మందకొడిగా ఉంది. మా బ్యాటర్లు ముందే చెప్పారు. బంతి అస్సలు పైకి లేవడం లేదన్నారు. దీంతో తక్కువ వేగంతో బౌలింగ్‌ చేశా. దాంతో వికెట్లు దక్కాయి. ఇక్కడ 160+ స్కోరును ఛేదించడమూ సవాలే. రోహిత్-సూర్యకుమార్ భాగస్వామ్యంతో మేం మెరుగైన టార్గెట్‌ను ఇంగ్లాండ్‌ ఎదుట నిర్దేశించాం. అవసరమైనప్పుడు బౌండరీలు కొడుతూనే.. స్ట్రైక్‌ను రొటేట్ చేశాం. ఇప్పుడే బార్బడోస్‌ (ఫైనల్‌కు వేదిక) గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం ఈ ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డును ఆస్వాదిస్తున్నా’’ అని అక్షర్ వ్యాఖ్యానించాడు. 

25 రన్స్‌ ఎక్కువ ఇచ్చాం: బట్లర్

‘‘భారత్ అన్ని విభాగాల్లో గొప్పగా ఆడింది. మేం బౌలింగ్‌లో అదనంగా 25 పరుగుల వరకు ఇచ్చాం. ఇలాంటి పిచ్‌పై ప్రతీ పరుగూ విలువైందే. సవాల్‌ విసిరింది. అప్పటికి (2022), ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు ఉన్నాయి. లివింగ్‌స్టోన్, రషీద్ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. మొయిన్ అలీతో కూడా బంతులేయిస్తే బాగుండేది. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. ఈ టోర్నీలో మా ప్రయాణంపై గర్వంగానే ఉంది. ప్రతిఒక్కరూ శాయశక్తులా కష్టపడ్డారు’’ అని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ (Jos Buttler) తెలిపాడు.

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు..

  • ఇప్పటివరకు ఒక టీ20 ప్రపంచకప్‌లో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అర్ష్‌దీప్‌ కొనసాగుతున్నాడు. ఈసారి అతడు 15 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా (13) రెండో స్థానంలో ఉన్నాడు.
  • టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు అత్యంత భారీ విజయాల్లో ఇప్పుడీ మ్యాచ్‌ నాలుగోది. ఇంగ్లాండ్‌పై 68 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా గెలిచింది. గతంలో ఇంగ్లాండ్‌పై 90 పరుగులు (2012), ఆసీస్‌పై 73 పరుగులు (2014), జింబాబ్వేపై 71 పరుగుల (2022) తేడాతో విజయం సాధించింది.
  • టీ20 ప్రపంచకప్‌ నాకౌట్‌లో భారీ తేడాతో గెలిచిన రెండో మ్యాచ్‌ ఇదే. ఆస్ట్రేలియాపై విండీస్ 2012లో 74 పరుగుల తేడాతో గెలిచింది.
  • టీ20ల్లో భారత్ వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చిన మూడో సీజన్‌ ఇదే. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు 11 మ్యాచుల్లో గెలిచింది. అంతకుముందు నవంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 వరకు 12 మ్యాచుల్లో విజయం సాధించింది
  • ఒక్క టీ20 ప్రపంచకప్‌ ఎడిషన్‌లో ఎక్కువ విజయాలు నమోదుచేసిన రెండో జట్టు భారత్. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచుల్లో గెలిచింది. ఇక దక్షిణాఫ్రికా 8 మ్యాచుల్లో విజయం సాధించి మొదటి స్థానంలో ఉంది. ఫైనల్‌లో ఆ జట్టును భారత్‌ ఓడిస్తే.. రెండు టీమ్‌లు సమంగా నిలుస్తాయి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని