T20WC 2024-MS DHONI: నా హార్ట్‌రేట్‌ పెరిగిపోయింది.. బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చినందుకు థాంక్స్‌: ఎంఎస్ ధోనీ

భారత జట్టు రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ విజేతగా నిలిచింది. టీమ్‌ఇండియాకు వరల్డ్‌ కప్‌ను అందించిన మూడో సారథిగా రోహిత్‌ చరిత్రలో నిలిచిపోయాడు.

Updated : 30 Jun 2024 08:28 IST

ఇంటర్నెట్ డెస్క్: ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచ కప్‌ను (T20 World Cup) నెగ్గిన తర్వాత భారత్‌కు రెండో కప్‌ దక్కడానికి 17 ఏళ్లు పట్టింది. రోహిత్‌ కెప్టెన్సీలో పొట్టి కప్‌ను టీమ్ఇండియా ఒడిసిపట్టింది. దక్షిణాఫ్రికాతో ఫైనల్‌లో చివరి ఓవర్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్‌ విజయం సాధించింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల సహా ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తొలిసారి టీ20 ప్రపంచకప్‌ అందించిన ‘కెప్టెన్‌ కూల్‌’ ధోనీ (MS Dhoni) ఏమని స్పందించాడనేది ఆసక్తికరమే కదా! భారత విజయం సాధించిన తర్వాత అతడు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ఇప్పుడది వైరల్‌గా మారిపోయింది.

‘‘వరల్డ్‌ కప్‌ 2024 ఛాంపియన్స్‌. ఈ మ్యాచ్‌ సమయంలో నా హార్ట్‌ రేట్‌ పెరిగిపోయింది. నిశ్శబ్దంగా ఉంటూనే విజేతగా నిలిచారు. ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉంచి కుర్రాళ్ల నుంచి ఫలితం రాబట్టడం అద్భుతం. వరల్డ్‌ కప్‌ను (T20 World Cup 2024) స్వదేశానికి తీసుకొస్తున్నందుకు ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలవుతాడు. కంగ్రాట్స్‌ బాయ్స్‌. విలువ కట్టలేని బహుమతిని పుట్టిన రోజుకు ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని ధోనీ పోస్టు పెట్టాడు. జులై 7న ధోనీ బర్త్‌డే. దానిని ప్రస్తావిస్తూ అలా పెట్టాడని అభిమానులు కామెంట్లు పెట్టారు. దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. ఇది కూడా ‘తలా’ కోసమే అన్నట్లుగా నెట్టింట చర్చ మొదలైంది. ఎందుకంటే ధోనీ జెర్సీ నెంబర్‌ 7.

నాలుగో స్టార్‌ తోడైంది: సచిన్

‘‘ప్రతి స్టార్‌ భారత్‌ (team India) విజయం సాధించడంలో కృషి చేశారు. జెర్సీని చూసి దేశం గర్వపడేలా చేశారు. పిల్లలు కూడా తాము క్రికెటర్లం కావాలనే కలకు ముందడుగు వేసేలా ఈ విజయం చరిత్రలో నిలుస్తుంది. భారత్‌ నాలుగో స్టార్‌ను సాధించింది. రెండో టీ20 ప్రపంచ కప్‌ను సాధించడం అభినందనీయం. విండీస్‌లో 2007లో వన్డే ప్రపంచ కప్‌లో వైఫల్యంతో ఒడిదొడుకులను చూసిన భారత క్రికెట్‌ 2024 పొట్టి కప్‌ను గెలవడంతో పవర్‌హౌస్‌గా మారింది. నా స్నేహితుడు ద్రవిడ్‌ నేతృత్వంలో కప్‌ను చేజిక్కించుకోవడం ఆనందంగా ఉంది’’ అని సచిన్‌ (Sachin) పోస్టు చేశాడు. ఇప్పటికే వన్డే ప్రపంచ కప్‌ 1983, 2011, టీ20 ప్రపంచ కప్‌ 2007 విజేతగా భారత్‌ నిలిచిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని