అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్‌ రాహుల్‌-సంజీవ్‌ గోయెంకా ఎపిసోడ్‌పై ఎల్‌ఎస్‌జీ

కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై ఆ జట్టు యజమాని ఆగ్రహం వ్యక్తం చేసిన అంశంపై లఖ్‌నవూ టీమ్‌ స్పందించింది.

Published : 14 May 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లఖ్‌నవూపై హైదరాబాద్‌ సూపర్‌ విక్టరీ కంటే.. ఆ మ్యాచ్‌లో చోటుచేసుకున్న మరో అంశమే అందరి దృష్టిలో పడింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై ఆ జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేయడంపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. ఓనర్‌ తీరును పలువురు తప్పుపట్టగా.. ఈ అంశంపై ఆ జట్టు ఎట్టకేలకు స్పందించింది.

ఆ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ లాన్స్‌ క్లూసేనర్‌ ఈ విషయాన్ని తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించాడు. ‘‘ఇద్దరు క్రికెట్‌ ప్రేమికుల మధ్య జరిగిన బలమైన సంభాషణలో నాకేమీ తప్పు కనిపించలేదు. ఇది టీకప్పులో తుపాను లాంటిది. ఇలాంటి చర్చలను మనం ఇష్టపడతాం. అప్పుడే జట్ల ప్రదర్శన మెరుగవుతుందని నేను భావిస్తాను. ఇది మాకు పెద్ద విషయం కాదు’’ అంటూ చెప్పుకొచ్చాడు.

గత బుధవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ కేవలం 9.4 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా ఛేదించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన ఛేదన ఇదే. ఈ ఘోర ఓటమిపై మ్యాచ్‌ అనంతరం కేఎల్‌ రాహుల్‌తో మాట్లాడుతూ ఆ జట్టు యజమాని గోయెంకా అందరి ముందే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో పలువురు ఈ చర్యపై మండిపడ్డారు. ఇది కెప్టెన్‌ను అవమానించడమేననీ.. ఏదైనా చెప్పాలనుకుంటే డ్రెస్సింగ్‌ రూమ్‌లోనో, బయటనో చర్చించుకోవాలని.. ఇలా కెమెరాల ముందు కాదని హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని