ZIM vs IND: జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!

జింబాబ్వే పర్యటనకు టీమ్‌ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.

Published : 05 Jul 2024 18:15 IST

జింబాబ్వే పర్యటనకు యువ భారత్‌ (ZIM vs IND) వెళ్లింది. ఇప్పటికే ప్రాక్టీస్‌ను షురూ చేసింది. ఇప్పుడీ జట్టులోని ప్రతిఒక్కరూ ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టు తలుపులు తట్టిన వారే. శుభమన్‌ గిల్ నాయకత్వంలో టీమ్‌ఇండియాకు ఈసారి ఐదుగురు కొత్త కుర్రాళ్లు ఎంపిక కావడం గమనార్హం. భారత జట్టుకు భవిష్యత్తులో మరింతకాలం ప్రాతినిధ్యం వహించే సత్తా ఉన్నా వారూ ఇందులో ఉన్నారు. అలాంటి యువ క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం. 

టీ20ల్లో ఇప్పుడు భారత జట్టుకు (Team India) ముగ్గురి అవసరం ఉంది. టాప్‌ ప్లేయర్లు రోహిత్, విరాట్, జడేజా ఈ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేసిన సంగతి తెలిసిందే. వారి స్థానాలను ఇప్పటికప్పుడే భర్తీ చేయడం సవాలే. కానీ, యువ క్రికెటర్లలో ఎవరు ఈ ప్లేస్‌లకు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

అభిషేక్ శర్మ

ఐపీఎల్‌లో ఓపెనర్‌గా హైదరాబాద్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దూకుడుగా ఆడటంలో ముందుంటాడు. ఎడమ చేతివాటం కలిగిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) 16 మ్యాచుల్లో 484 పరుగులు చేసి అదరగొట్టాడు. ట్రావిస్‌ హెడ్‌తో కలిసి రికార్డులను బ్రేక్‌ చేశాడు. జింబాబ్వేపై కెప్టెన్‌ గిల్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మాత్రం భారత జట్టులో స్థానానికి ఢోకా ఉండదు. మరో ఆటగాడు యశస్వి జైస్వాల్‌తో పోటీ ఉన్నప్పటికీ.. బ్యాకప్‌గానైనా జట్టులోకి రావడం ఖాయం. ఐపీఎల్‌లో 200+ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం కూడా అభిషేక్‌కు కలిసొచ్చే అంశం.

రియాన్‌ పరాగ్‌

జింబాబ్వే పర్యటనకు ఎంపికైన జట్టులో రియాన్‌ పరాగ్‌ (Riyan Parag)పై ఎక్కువ ఫోకస్‌ ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఫామ్‌తో ఇబ్బంది పడిన రియాన్‌.. ఈసారి ఐపీఎల్‌లో చెలరేగిపోయాడు. రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ అసోం కుర్రాడు 15 మ్యాచుల్లోనే 573 పరుగులు చేశాడు. సెకండ్‌ డౌన్‌లో వస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టాప్‌ ఆర్డర్‌లో విరాట్‌ కోహ్లీ లేని లోటును తీర్చగల సత్తా ఉందని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. 

రోహిత్ ప్లేస్‌.. గిల్‌దా? గైక్వాడ్‌దా?

ఓపెనర్‌గా దూకుడుగా ఆడే రోహిత్ శర్మ (Rohit Sharma) టీ20లకు వీడ్కోలు పలికేశాడు. దీంతో యశస్వి జైస్వాల్‌కు జోడీగా ఇద్దరు ప్లేయర్లు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడీ సిరీస్‌కు సారథిగా వ్యవహరిస్తున్న శుభ్‌మన్‌ గిల్‌తోపాటు (Shubman Gill) రుతురాజ్‌ గైక్వాడ్‌ ‘ఓపెనర్‌’ ప్లేస్‌ కోసం చూస్తున్నాడు. జింబాబ్వే సిరీస్‌లో వీరిద్దరిలో ఎవరు రాణిస్తే వారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఐపీఎల్‌లో రుతురాజ్‌ (Ruturaj Gaikwad) 14 మ్యాచుల్లో 583 పరుగులు చేయగా.. శుభ్‌మన్‌ గిల్ మాత్రం 12 మ్యాచుల్లో 426 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరూ వారి జట్లకు ఓపెనర్లుగా వచ్చినవారే. చెన్నైకి గైక్వాడ్, గుజరాత్‌కు గిల్ కెప్టెన్లుగా వ్యవహరించారు.

ఆల్‌రౌండర్‌.. పోటీలో వీరు

రవీంద్ర జడేజా (Ravindra Jadeja) రిటైర్‌మెంట్‌ తీసుకోవడంతో ఈ స్థానం ఇప్పుడు ఖాళీ. కానీ, అక్షర్‌ పటేల్ టీ20 ప్రపంచ కప్‌లో అదరగొట్టేసి స్పిన్‌ ఆల్‌రౌండర్‌ పాత్రను సమర్థవంతంగా పోషించాడు. అయితే, అతడికి బ్యాకప్‌గా వాషింగ్టన్‌ సుందర్‌కు మంచి అవకాశం ఉంది. ఇప్పటికే టీమ్‌ఇండియా (team India) తరఫున ఆడిన అనుభవం అతడి సొంతం. బ్యాటింగ్‌లోనూ అప్పుడప్పుడు మెరుపులు మెరిపించగల సత్తా ఉంది. కానీ, బౌలింగ్‌లో నిలకడలేని కారణంగా సక్సెస్‌ కాలేకపోయాడు. ఈసారి జింబాబ్వేపై మెరుగైన ప్రదర్శన చేస్తే భారత జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవచ్చు. అభిషేక్‌, రియాన్‌ కూడా స్పిన్‌ను వేయగల సమర్థులే. నిలకడగా బౌలింగ్‌లోనూ రాణించగలిగితే భారత్‌ జట్టుకు అంతకుమించిన సానుకూలాంశం మరొకటి ఉండదు. 

చివరిగా..: టీ20 ప్రపంచ కప్‌ 2024 (T20 World Cup 2024) విజేతగా భారత్ నిలిచింది. ఇక 2026 టోర్నీపై ఇక్కడి నుంచి బీసీసీఐ దృష్టిసారించింది. అందుకోసం యువకులను సిద్ధం చేసేలా వారికే అవకాశాలను ఇచ్చేందుకు సిద్ధపడింది. కొత్త కోచ్‌ గంభీర్ వస్తాడనే చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అతడు యువకులకు ఛాన్స్‌ ఇచ్చేందుకు ఎల్లవేళలా ముందుంటాడు. ఇలాంటి సిరీసుల్లో సత్తా చాటి రాణిస్తే భవిష్యతుల్లో కుర్రాళ్లు స్థానం కోసం ఇబ్బంది పడకుండా ఉండొచ్చని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు