Rohit Sharma: హై హై నాయకా

ఒక కపిల్‌ దేవ్‌.. ఒక మహేంద్రసింగ్‌ ధోని.. ఒక రోహిత్‌ శర్మ!భారత్‌కు ప్రపంచకప్‌ను అందించిన సారథుల్లో ఒకడిగా ఈ వరుసలో ఆ చివరి పేరు ఉంటుందన్న ఊహ కూడా కొన్నేళ్ల ముందు వరకు ఎవరికీ వచ్చి ఉండకపోవచ్చు! కెప్టెన్‌ అయిన మూడేళ్లలోపే పొట్టి కప్పులో జట్టును విజేతగా నిలిపి.. దిగ్గజ కెప్టెన్లలో ఒకడైపోయాడు రోహిత్‌ శర్మ.

Updated : 30 Jun 2024 07:14 IST

ఒక కపిల్‌ దేవ్‌.. ఒక మహేంద్రసింగ్‌ ధోని.. ఒక రోహిత్‌ శర్మ!భారత్‌కు ప్రపంచకప్‌ను అందించిన సారథుల్లో ఒకడిగా ఈ వరుసలో ఆ చివరి పేరు ఉంటుందన్న ఊహ కూడా కొన్నేళ్ల ముందు వరకు ఎవరికీ వచ్చి ఉండకపోవచ్చు! కెప్టెన్‌ అయిన మూడేళ్లలోపే పొట్టి కప్పులో జట్టును విజేతగా నిలిపి.. దిగ్గజ కెప్టెన్లలో ఒకడైపోయాడు రోహిత్‌ శర్మ. అలా అని ఏదో అదృష్టం తోడై, తన ప్రమేయం లేకుండా అతడి చేతిలోకి ప్రపంచకప్‌ రాలేదు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించి.. కప్పును అందుకోవడానికి తాను వంద శాతం అర్హుడినని చాటాడు రోహిత్‌.

ఈనాడు క్రీడావిభాగం

‘‘మనం మారాలి. మనం మారాల్సిన అవసరముంది’’.. 2022 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో పది వికెట్ల తేడాతో పరాజయం చవిచూశాక వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌తో సంభాషణలో రోహిత్‌ శర్మ ఈ మాటలు అన్నాడట! ఆ టోర్నీకి, ప్రస్తుత ప్రపంచకప్‌కు టీమ్‌ఇండియా ప్రదర్శనలో ఎంత తేడానో అందరూ చూశారు. ఆటతీరులో ఇంత తేడా వచ్చిందంటే అందులో రోహిత్‌ పాత్ర కీలకం. ప్రపంచ క్రికెట్లో చాలా ఏళ్ల నుంచి భారత్‌ ఆధిపత్యం సాగుతోంది. కానీ ప్రపంచకప్‌ లాంటి టోర్నీల్లో, ముఖ్యంగా నాకౌట్‌ మ్యాచ్‌ల్లో సమష్టిగా సత్తా చాటడంలో, ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడంలో, ఒత్తిడిని తట్టుకుని నిలవడంలో జట్టు విఫలమవుతూ వచ్చింది. కోహ్లి సారథ్యంలో ఐసీసీ టైటిల్‌ ఎండమావే అయింది. అలాంటి స్థితిలో రోహిత్‌ కెప్టెన్‌ అయ్యాడు. ఐపీఎల్‌లో అయిదుసార్లు ముంబయిని విజేతగా నిలపడమే కాక.. తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించినపుడు సైతం టీమ్‌ఇండియాను బాగా నడిపించిన రోహిత్‌.. పూర్తి స్థాయి సారథి అయితే భారత జట్టు రాత మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అతను కెప్టెన్‌ అయిన వెంటనే పరిస్థితేమీ మారిపోలేదు. ఇంకా దెబ్బ తింది కూడా. 2022 ఆసియా కప్‌లో కనీసం ఫైనల్‌ చేరకుండానే నిష్క్రమించడం, ఆపై టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో మరీ పది వికెట్ల తేడాతో చిత్తవడంతో తీవ్ర విమర్శలు తప్పలేదు. ఆ స్థితిలోనే జట్టు మారాల్సిన అవసరాన్ని గుర్తించి తదనుగుణంగా చర్యలు చేపట్టాడు రోహిత్‌. దాని ఫలితం నిరుడు వన్డే ప్రపంచకప్‌లోనే కనిపించింది. అప్పుడు త్రుటిలో కప్పు చేజారినా.. ఇప్పుడు పొట్టి కప్పు అందింది.

సవాళ్లను అధిగమించి..: ఆటగాళ్లందరితో మంచి సమన్వయం సాధించి జట్టును సమష్టిగా సత్తా చాటేలా చేయడంలో రోహిత్‌ సఫలమయ్యాడు. ఈ క్రమంలో అతడికి అతి పెద్ద సవాలు ఎదురైంది కోహ్లి విషయంలోనే. బ్యాటర్‌గా రోహిత్‌ను మించిన ఆటగాడు కోహ్లి. పైగా సుదీర్ఘ కాలం తన కెప్టెన్సీలో ఆడిన ఆటగాడి కింద తాను పని చేయాలంటే ఇబ్బందే. అందులోనూ విరాట్‌ నుంచి రోహిత్‌కు నాయకత్వ బదలాయింపు అంత సాఫీగా జరగలేదు. ఆ సమయంలో కోహ్లి, రోహిత్‌ మధ్య సంబంధాలు కూడా దెబ్బ తిన్న సంకేతాలు కనిపించాయి. ఇలాంటి స్థితిలో కోహ్లికి తగిన గౌరవాన్నిస్తూ, కష్ట కాలంలో అతడికి మద్దతుగా నిలుస్తూ.. ఆ పేలవ దశను దాటడంలో రోహిత్‌ తన వంతు పాత్ర పోషించాడు. 2022 టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన విరాట్‌ను రోహిత్‌ భుజాలకెత్తుకుని మోయడం అతడి గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. ఒకప్పుడు బ్యాటర్‌గా సచిన్‌కు తగిన గౌరవాన్నిస్తూ.. తన నుంచి కెప్టెన్‌గా గౌరవం పొందాడు ధోని. అది జట్టు వాతావరణాన్ని ఉత్తమ స్థితిలో ఉంచింది. నిరుడు వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్‌.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో తడబడ్డాడు. అయినా అతడికి మద్దతుగా నిలిచాడు రోహిత్‌. ఫలితమే.. ఫైనల్లో విరాట్‌ కీలక ఇన్నింగ్స్‌. మరోవైపు ఐపీఎల్‌లో ముంబయి జట్టు తనను కెప్టెన్‌గా తప్పించి హార్దిక్‌ను నియమించడం ద్వారా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టినా.. అదేమీ రోహిత్‌ మనసులో పెట్టుకోలేదు. ఫామ్‌లో లేని హార్దిక్‌ ప్రపంచకప్‌కు ఎందుకన్న వాదనల్ని పట్టించుకోలేదు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న అతణ్ని జట్టులోకి తీసుకుని, అండగా నిలిచాడు. హార్దిక్‌ కెప్టెన్‌ నమ్మకాన్ని నెలబెడుతూ బ్యాటుతో, బంతితో సత్తా చాటాడు. కెప్టెన్‌ ఆటగాళ్లకు అండగా నిలిస్తే.. వాళ్లు కెప్టెన్‌ను గౌరవిస్తూ, అతడితో కలిసి పని చేస్తే.. ప్రణాళికలను సమష్టిగా అమలు చేస్తే.. ఫలితాలు ఎలా ఉంటాయనడానికి నిదర్శనమే ఈ ప్రపంచకప్‌ విజయం.

రెండు పాత్రల్లో సూపర్‌ హిట్‌

కెప్టెన్‌గా, బ్యాటర్‌గా నూటికి నూరు శాతం ప్రదర్శన ఇచ్చి జట్టుకు ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్లు తక్కువమంది. ఆ జాబితాలో రోహిత్‌ కచ్చితంగా ఉంటాడు.  పేస్‌ పిచ్‌లకు నెలవైన వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్‌కు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం ఏంటి అని టోర్నీ ఆరంభానికి ముందు విలేకరులు ప్రశ్నిస్తే.. టోర్నీ మొదలయ్యాక చూడండి అన్నాడు రోహిత్‌. టోర్నీ ముందుకు సాగేకొద్దీ విండీస్‌లో స్పిన్నర్ల ప్రాధాన్యం పెరిగింది. కుల్‌దీప్, అక్షర్‌ పటేల్‌ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అమెరికాలో జరిగిన గ్రూప్‌ దశలో అక్కడి పిచ్‌లకు తగ్గట్లు మూడో పేసర్‌గా సిరాజ్‌ను ఆడించిన రోహిత్‌.. సూపర్‌-8 నుంచి అతణ్ని పక్కన పెట్టి కుల్‌దీప్‌ను బరిలోకి దించి అద్భుత ఫలితాలు రాబట్టాడు. హార్దిక్, అర్ష్‌దీప్, దూబెల విషయంలోనూ రోహిత్‌ ఎంపిక మంచి ఫలితాలనిచ్చింది. ఇక మైదానంలో అతడి బౌలింగ్‌ వ్యూహాలు, ఫీల్డింగ్‌ ఏర్పాట్లు దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాయి. డేటాను విశ్లేషించి ప్రతి మ్యాచ్‌కూ పకడ్బందీగా వ్యూహాలు రూపొందిస్తాడని రోహిత్‌కు పేరుంది. అది ప్రస్తుత టోర్నీలో స్పష్టంగా కనిపించింది. మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ మార్పులు, ఫీల్డింగ్‌ ఏర్పాట్ల గురించి వ్యాఖ్యాతలు ప్రశంసలు కురిపించారు. ఇక బ్యాటర్‌గా రోహిత్‌ వేసిన ముద్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లి ఫైనల్‌ ముందు వరకు నిరాశపరిచినా.. రోహిత్‌ కీలక ఇన్నింగ్స్‌లతో జట్టు విజయాలకు బలమైన పునాది వేశాడు. ఆస్ట్రేలియాపై సూపర్‌-8 దశలో రోహిత్‌ చేసిన 92 పరుగులు.. భారత టీ20 చరిత్రలోనే ఉత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటనడంలో సందేహం లేదు. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పైనా రోహిత్‌ విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కొన్నేళ్లుగా రోహిత్‌ ఆటను గమనిస్తే ఆరంభంలో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి.. ఆ ఊపులో బంతిని గాల్లోకి లేపి ఔటైపోతుంటాడు. కానీ ఈ ప్రపంచకప్‌లో మాత్రం వికెట్‌కు విలువ ఇచ్చి ఎక్కువ సమయం క్రీజులో నిలవడానికి ప్రయత్నించాడు. అలా అని స్కోరు వేగం పెంచే బాధ్యతను మరిచిపోలేదు. అందులో పూర్తిగా విజయవంతమయ్యాడు. ఇలా కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ద్విపాత్రాభినయంతో జట్టుకు కప్పు అందించి కపిల్, ధోనీలకు సరైన వారసుడినని చాటాడు రోహిత్‌.

1

ఆటగాడిగా (2007), కెప్టెన్‌గా (2024) ప్రపంచకప్‌లు గెలిచిన తొలి క్రికెటర్‌ రోహిత్‌.

15

ఈ ప్రపంచకప్‌లో బుమ్రా వికెట్లు. అతనే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’

8

రోహిత్, కోహ్లి ఆడిన ఐసీసీ ఫైనల్స్‌. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక ఫైనల్స్‌ ఆడిన ఆటగాళ్లుగా యువరాజ్‌ సింగ్‌ (7) రికార్డును వీళ్లు బద్దలుకొట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని