Kuldeep Yadav: చైనామన్‌ చిన్నోడు.. ఫీనిక్స్‌లా లేచాడు

భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలని దేశంలో కోట్లమంది కలగంటారు. కానీ ఆ కలను నెరవేర్చుకునేది కొద్దిమందే. అయితే కొంత కాలం టీమ్‌ఇండియా (Team India)కు ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత కనుమరుగైన ఆటగాళ్లు కోకొల్లలు. ముఖ్యంగా బౌలర్లలో చాలామంది వైవిధ్యమైన శైలితో ఆరంభంలో మెరుపులు మెరిపిస్తారు. ప్రత్యర్థి బ్యాటర్లు వాళ్ల బౌలింగ్‌ను చదివేసి, ఎదురు దాడి మొదలుపెట్టగానే.. వాళ్ల పనైపోతుంది.

Published : 09 Sep 2023 14:48 IST

 కుల్‌దీప్‌ పునరాగమనం అసామాన్యం

భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలని దేశంలో కోట్లమంది కలలుగంటారు. కానీ ఆ కలను నెరవేర్చుకునేది కొద్దిమందే. అయితే కొంత కాలం టీమ్‌ఇండియా (Team India)కు ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత కనుమరుగైన ఆటగాళ్లు కోకొల్లలు. ముఖ్యంగా బౌలర్లలో చాలామంది వైవిధ్యమైన శైలితో ఆరంభంలో మెరుపులు మెరిపిస్తారు. ప్రత్యర్థి బ్యాటర్లు వాళ్ల బౌలింగ్‌ను చదివేసి, ఎదురు దాడి మొదలుపెట్టగానే.. వాళ్ల పనైపోతుంది. చైనామన్‌ శైలితో అందరి దృష్టినీ ఆకర్షించి కొంత కాలం టీమ్‌ఇండియాలో కీలక బౌలర్‌గా ఉన్న కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav)  కూడా ఈ కోవలోనే చేరేలా కనిపించాడు. రెండేళ్ల పాటు టీమ్‌ఇండియా ఛాయల్లోనే లేడతను. ఐపీఎల్‌ (IPL)లో కూడా అతడిని పక్కన పెట్టేశారు. తన కెరీర్‌ ముగిసిందని అంతా అనుకున్న దశలో శిథిలాల నుంచి పైకి లేచిన ఫీనిక్స్ పక్షిలా పుంజుకుని.. మూడు ఫార్మాట్లలో రెగ్యులర్‌ బౌలర్‌గా మారిన వైనం స్ఫూర్తిదాయకం.

కుడిచేతి వాటం స్పిన్నర్లలో వేలిని ఉపయోగించి బంతిని తిప్పే ఆఫ్‌స్పిన్నర్లుంటారు. అలాగే మణికట్టును ఉపయోగించి బంతిని స్పిన్‌ చేసే లెగ్‌స్పిన్నర్లూ ఉంటారు. కానీ క్రికెట్‌ చరిత్రను గమనిస్తే.. ఎడమచేతి వాటం స్పిన్నర్లలో వేలితో బంతిని తిప్పే బౌలర్లు మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు. ఎడమ చేతి వాటంతో మణికట్టును ఉపయోగించి బంతిని స్పిన్‌ చేసే బౌలర్లను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ఈ శైలినే ‘చైనామన్‌’ (Chinaman) అంటారు. అలా బంతిని స్పిన్‌ చేయడం చాలా కష్టం కావడం, ఆ శైలితో విజయవంతమైన బౌలర్లూ తక్కువమంది కావడంతో అలాంటి బౌలర్లు తక్కువమంది ఉంటారు. కుల్‌దీప్‌ యాదవ్‌ ఆ శైలితోనే అందరి దృష్టిలో పడ్డాడు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. భారత జట్టులో కొన్నేళ్లు కీలక బౌలర్‌గా ఉన్నాడు. అండర్‌-19 ప్రపంచకప్‌లో సత్తా చాటి ఐపీఎల్‌లో అడుగు పెట్టిన ఈ ఉత్తర్‌ప్రదేశ్‌ బౌలర్‌.. 21 ఏళ్ల వయసులోనే టీమ్‌ఇండియాలోనూ అవకాశం దక్కించుకున్నాడు. అతను నేరుగా టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం విశేషం. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా లాంటి ప్రత్యర్థిపై తొలి ఇన్నింగ్స్‌లోనే 4 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టిన కుల్‌దీప్‌.. తర్వాత వన్డేలు, టీ20ల్లోనూ అవకాశం దక్కించుకున్నాడు. 

యుజ్వేంద్ర చాహల్‌తో కలిసి కొన్నేళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో రెండు మూడేళ్లు రెగ్యులర్‌ బౌలర్‌గా ఉన్నాడు. అశ్విన్‌ లాంటి సీనియర్‌ బౌలర్‌కు అతను చెక్‌ పెట్టాడు. అంత కీలక బౌలర్‌గా ఉన్న కుల్‌దీప్‌ ఉన్నట్లుండి ఫామ్‌ కోల్పోయాడు. ఒక్కో ఫార్మాట్లో అతను జట్టుకూ దూరమవుతూ వచ్చాడు. భారత జట్టులో చోటు పోతే ఐపీఎల్‌లో, దేశవాళీల్లో సత్తా చాటి పునరామగనం చేయడానికి ప్రయత్నిస్తారు క్రికెటర్లు ఎవరైనా. కానీ కుల్‌దీప్‌ ఐపీఎల్‌లో కూడా జట్టుకు భారంగా మారాడు. కొన్నేళ్ల పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులో కీలక బౌలర్‌గా ఉన్న కుల్‌దీప్‌.. 2021 సీజన్‌ మొత్తం తుది జట్టుకు దూరమై, బెంచ్‌కే పరిమితమయ్యాడు. వైవిధ్యమైన శైలితో వెలుగులోకి వచ్చిన బౌలర్లు.. ఇలా ఫామ్‌ కోల్పోతే, బ్యాట్స్‌మెన్‌ వారి బౌలింగ్‌లోని మర్మం కనిపెట్టి సులువుగా పరుగులు సాధించడం మొదలుపెడితే.. ఇక పుంజుకోవడం కష్టమే అవుతుంది. ఈ నేపథ్యంలో కుల్‌దీప్‌ కెరీర్‌ ముగిసిందనే వ్యాఖ్యలు వినిపించాయి.

ఆ ఇద్దరి అండతో..

కష్ట కాలంలో కుల్‌దీప్‌కు ఇద్దరు అండగా నిలిచారు. అందులో ఒకరు తన చిన్ననాటి కోచ్‌ కపిల్‌ పాండే కాగా.. మరొకరు టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ సునీల్‌ జోషి. కుల్‌దీప్‌ను టీమ్‌ఇండియా నుంచి తప్పించిన సెలక్టర్లలో జోషి కూడా ఒకడు. అయితే కుల్‌దీప్‌ లాంటి ప్రతిభావంతుడు ఇలా పతనం చూడటం జోషికి రుచించలేదు. తాను వేటు వేసిన బౌలర్‌ను తనే సరిదిద్దాలనుకున్నాడు. అప్పటికే కుల్‌దీప్‌.. తన కోచ్‌ కపిల్‌ పాండేతో కలిసి తన లోపాల మీద పని చేయడం మొదలుపెట్టాడు. తన బౌలింగ్‌లో కొంచెం వేగం పెంచాల్సిన, అలాగే బంతుల్లో వైవిధ్యం పెరగాల్సిన అవసరాన్ని కుల్‌దీప్‌ గుర్తించాడు. అదే సమయంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో జోషి శిక్షణ అతడికి కలిసొచ్చింది. దేశవాళీల్లో సత్తా చాటాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌ నుంచి దిల్లీ క్యాపిటల్స్‌కు మారిన కుల్‌దీప్‌ అక్కడా నిలకడగా రాణించాడు. దీంతో టీమ్‌ఇండియా నుంచి పిలుపు వచ్చింది. తిరిగి మూడు ఫార్మాట్లలోనూ అవకాశం దక్కించుకున్నాడు, సత్తా చాటాడు. వన్డే ప్రపంచకప్‌నకూ ఎంపికయ్యాడు.

కుల్‌దీప్‌ మళ్లీ పతాక స్థాయిని అందుకోవడంపై జోషి మాట్లాడుతూ.. ‘‘ఎన్‌సీఏలో నేను, కుల్‌దీప్‌ సాంకేతిక అంశాల మీద దృష్టిసారించాం. మోచేతి వేగం పెంచడం ద్వారా గాల్లో బంతి వేగం పెరిగేలా చూశాం. కొంతమేర బౌలింగ్‌ శైలి కూడా మారింది. అంతకుముందు అతను ఎక్కడెక్కడో బంతులు వేసేవాడు. కానీ ఇప్పుడు స్థిరంగా తాను అనుకున్న చోట బంతులు వేయగలుగుతున్నాడు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు మారడం కూడా తనకు కలిసొచ్చింది. రికీ పాంటింగ్‌ కుల్‌దీప్‌కు ఎంతగానో మద్దతు ఇచ్చాడు. రాబోయే ప్రపంచకప్‌లో కెప్టెన్‌ రోహిత్‌ ఆధారపడే బౌలర్లలో అతనుంటాడు. తన బౌలింగ్‌ వైవిధ్యంతో ఎలాంటి పరిస్థితుల్లో అయినా వికెట్లు తీయగల సామర్థ్యం కుల్‌దీప్‌కు ఉంది. ప్రపంచకప్‌లో అతడి ప్రదర్శన కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా’’ అని తెలిపాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌ కుల్‌దీపే. వచ్చే నెల 5న ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్‌లో కుల్‌దీప్‌ బౌలింగ్‌లో భారత జట్టుకు తురుపుముక్కలా ఉపయోగపడతాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఒకే ఒక్కడు

భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన ఏకైక చైనామన్‌ బౌలర్‌  (Chinaman bowler)  కుల్‌దీప్‌ యాదవే. 2017లో అతను అంతర్జాతీయ అరంగేట్రం చేసే సమయానికి.. చైనామన్‌ శైలితో అప్పటిదాకా ఒక్క బౌలరూ భారత జట్టులో చోటు సంపాదించలేదు. తర్వాత ఏడేళ్లు గడిచినా.. మరో చైనామన్‌ బౌలర్‌ భారత జట్టులోకి రాలేదు. కుల్‌దీప్‌ అరంగేట్రం చేసే సమయానికి ఆసియా స్థాయిలో కూడా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన చైనామన్‌ బౌలర్‌ ఒక్క సండకన్‌ మాత్రమే. మొత్తంగా కుల్‌దీప్ వచ్చే సమయానికి అతను అంతర్జాతీయ క్రికెట్లో 30వ చైనామన్ బౌలర్ మాత్రమే. ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో కుల్‌దీప్‌ కాకుండా తబ్రేజ్‌ షంసి (దక్షిణాఫ్రికా) మాత్రమే ఈ శైలిలో బంతులేసే బౌలర్‌.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని