PM Modi: ప్రపంచ క్రీడలకు భారత్‌ కేంద్రబిందువు.. ఆ లక్ష్యాన్ని సాధిస్తామన్న ప్రధాని మోదీ

ప్రపంచస్థాయి క్రీడలకు భారతదేశం కేంద్రబిందువయ్యేరోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఖేలోఇండియా యువజన క్రీడల్ని చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం నుంచి శుక్రవారం ఆయన ప్రారంభించారు.

Updated : 19 Jan 2024 23:38 IST

చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడలు ప్రారంభం 

చెన్నై: ప్రపంచస్థాయి క్రీడలకు భారతదేశం కేంద్రబిందువయ్యేరోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఖేలోఇండియా యువజన క్రీడల్ని చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం నుంచి శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం దేశనలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. 2029లో యూత్‌ ఒలింపిక్స్, 2036లో ఒలింపిక్స్‌ పోటీల్ని భారత్‌లో నిర్వహించేందుకు ఎంతో పట్టుదలతో ఉన్నట్లు వివరించారు. 2028లో లాస్‌ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్‌ క్రీడల్లో ఎక్కువ పతకాలు సాధించే లక్ష్యంతో సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. దశాబ్దకాలంలో క్రీడల్లో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. బీచ్‌గేమ్స్, క్రీడా పర్యాటక అధ్యాయం భారత్‌లో మొదలైందని, తీర ప్రాంతాలకు ఎంతో మేలుచేసేలా ప్రణాళికలు చేశామని వెల్లడించారు.

రానున్న మూడేళ్లలో భారత్‌ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నామని, ఇందులో క్రీడలకు చక్కటి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 31 వరకు తమిళనాడులోని చెన్నై, తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు వేదికలుగా జరిగే ఖేలో ఇండియా యువజన క్రీడల్లో 5,630 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఇదే వేదిక నుంచి రూ.250కోట్ల విలువైన రేడియో, టీవీ ప్రసారాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌రవి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ తదితరులు పాల్గొన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని