Jasprit Bumrah-Rohit Sharma: రోహిత్‌ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్‌ప్రీత్ బుమ్రా

టీమ్‌ఇండియా సారథి రోహిత్‌పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. స్టార్‌ పేసర్‌ బుమ్రా నుంచి మాజీ క్రికెటర్ల వరకు రోహిత్ నాయకత్వం గురించి ప్రత్యేకంగా స్పందిస్తున్నారు.

Published : 29 Jun 2024 14:56 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) భారత్‌ ఫైనల్‌కు చేరడంలో జస్‌ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తీసుకొచ్చి పరుగులు నియంత్రించడంతోపాటు కీలక సమయంలో వికెట్లు తీశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తనపై పెట్టుకున్న అంచనాలను వందశాతం అందుకొన్నాడు. సహచర ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంలో రోహిత్ ముందుంటాడని బుమ్రా (Jasprit Bumrah) వ్యాఖ్యానించాడు. ఐసీసీ షేర్‌ చేసిన ఈ వీడియోలో బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

నమ్మడం.. నడిపించడం.. ఇదే రోహిత్‌ మార్క్‌ కెప్టెన్సీ

‘‘రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. ఆటగాడిగానూ రాణిస్తూ జట్టును నడిపించడం చిన్న విషయం కాదు. గత వరల్డ్‌ కప్‌లోనూ చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. ఇప్పుడు ప్రతీ మ్యాచ్‌లో ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేసింది. అతడి జోరు ఏమాత్రం తగ్గలేదు. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు. వారు ఏం చెప్పాలనుకున్నా ఇబ్బందిలేకుండా చూస్తాడు. అతడి అనుభవాలను మ్యాచ్‌ సమయంలో ప్లేయర్లతో పంచుకుంటాడు. అతడి నాయకత్వంలో ఆడటం బాగుంది. జట్టులోని ప్రతిఒక్కరి ఆత్మవిశ్వాసం అత్యుత్తమంగా ఉంది’’ అని బుమ్రా తెలిపాడు. 

రోహిత్ ఏంటో నాకు బాగా తెలుసు: నాజర్ హుస్సేన్

‘‘నేను కూడా రోహిత్‌కు అభిమానినే. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా, వ్యక్తిత్వపరంగా అతడి గురించి నాకు తెలుసు. చూసేందుకు నిశ్శబ్దంగా ఉన్నా.. అతడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన క్రికెటరే. వారిద్దరి భావ వ్యక్తీకరణ విభిన్నంగా ఉండొచ్చేమో అంతే. రోహిత్‌ది (Rohit Sharma Captaincy) ఉక్కు పిడికిలి. దానిని తెరవడం చాలా కష్టం. జట్టులోని ప్రతిఒక్కరికీ అతడిచ్చే స్వేచ్ఛ అద్భుతం. ప్లేయర్ల నుంచి ఫలితం రాబట్టడంలో ముందుంటాడు’’ అని రోహిత్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్‌ హుస్సేన్ ప్రశంసలు కురిపించాడు. 

కపిల్‌ - రోహిత్ కెప్టెన్సీపై క్రిష్

‘‘సాధారణంగా నాకు ఎవరితోనూ పోల్చడం ఇష్టం ఉండదు. అయితే, 1983 వన్డే ప్రపంచకప్‌, ఇప్పుడు పొట్టి కప్‌ (T20 World Cup)కు మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయి. కపిల్‌ సారథ్యంలో కలసికట్టుగా విజేతగా నిలిచాం. ఇప్పుడు భారత జట్టును రోహిత్‌ నడిపిస్తున్నాడు. అతడు రాణిస్తూనే జట్టుకు నాయకత్వం వహించడం అభినందనీయం. ‘నేను రిస్కీ షాట్లు కొడతా. ఇన్నింగ్స్‌ను ముందుకుతీసుకెళ్తా’ అని తన ఆటతో నిరూపించాడు. ఇప్పుడున్న జట్టులో ప్రతిఒక్కరూ ఎంతో కొంత భాగస్వామ్యం ఇస్తున్నవారే. సూర్య, రిషభ్‌పంత్, హార్దిక్‌, అక్షర్.. ఇలా తలో చేయి వేసి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు’’ అని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని